గుంటూరు, మార్చి 5 (way2newstv.in):
ప్రభుత్వ పాఠశాలల్లోని బాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోడిగుడ్ల సరఫరాను గుత్తేదారుల ద్వారా నేరుగా వాటికి సరఫరా చేయిస్తుంది. వారానికి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఐదు, నెలకు గర్భిణులు, బాలింతలకు 25, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు 8, 3-6 సంవత్సరాలలోపు బాలలకు 16 గుడ్ల వంతున ఇవ్వాల్సివుంది. అయితే వాటి కొరత, సరఫరాలో ప్రభుత్వానికి, గుత్తేదారులకు మధ్య ధర విషయంలో బేరం కుదరక మూడు వారాలుగా రోజులుగా పంపిణీ నిలిచిపోయింది.జిల్లాలోని 3,563 ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్ పాఠశాలల్లో 3,17,075 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 2,43,621 మంది పాఠశాలకు రెగ్యులర్‌గా వస్తున్నారు. 2,03,570 మంది ప్రతి రోజూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వీరికి భోజనంలో నిత్యం అన్నం, పప్పు/సాంబారుతోపాటు కోడిగుడ్డు ఇవ్వాలి. దానిని తినని వారికి అరటి పండు ఇవ్వాలి. సంక్రాంతి సెలవుల అనంతరం కోడిగుడ్ల సరఫరాలో అవాంతరాలు వస్తూనే ఉండగా ఏదో మూల సరఫరా చేయలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. 4,.405 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వాటిలో 2,24,389 మంది 0-6 సంవత్సరాల పిల్లలు, 27,450 మంది బాలింతలు, 29,470 మంది గర్భిణులు ఉండగా వీరికి దాదాపు పక్షం రోజులుగా గుడ్లు ఇవ్వడం లేదు.
గుడ్డుకి గడ్డుకాలం (గుంటూరు)
కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ కు రవాణా ఛార్జీలు అన్నీ కలుపుకుని ప్రభుత్వం గుడ్డుకు రూ.4.68 చెల్లిస్తోంది. ఇటీవల రవాణా ఛార్జీలు పెరిగినందున రూ.5.18 చెల్లించాలని కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని కోరినా ఏ విషయం చెప్పకపోవడంతో గిట్టుబాటు కాదని సరఫరా ఆపివేశారు. దీంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు లేకుండానే ఏజెన్సీ నిర్వాహకులు భోజనాలు పెడుతున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వారుస్తున్న ఏజెన్సీ నిర్వాహకులకు మూడు నెలలుగా గౌరవ వేతనాలు అందడం లేదు. ఏజెన్సీ వారే కోడిగుడ్డు పెట్టేటపుడు విద్యార్థికి ఒకరికి ప్రాథమికస్థాయిలో రూ.5.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలస్థాయిలో రూ.7.51గా చెల్లించారు. గుత్తేదారుడు సరఫరా చేస్తున్నప్పటి నుంచి రూ.1 తగ్గించి ప్రాథమిక స్థాయిలో రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలస్థాయిలో రూ.6.51 పైసలు చెల్లించారు. ఇటీవల ప్రభుత్వమే ఏజెన్సీలకు కందిపప్పు, నూనె సరఫరా చేస్తూ ప్రాథమికస్థాయిలో రూ.2.06 పైసలు తగ్గించి ప్రస్తుతం రూ.2.29, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలస్థాయిలో రూ.3.10 కోత పెట్టి రూ.3.41 ఏజెన్సీలకు చెల్లిస్తున్నారు. ఒకవైపు మూడు నెలలుగా వేతనాలు అందక, అతి తక్కువ ధరతో ఏజెన్సీ నిర్వహించటం కష్టంగా ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలలకు కందిపప్పు, నూనె సరఫరా చేయలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఏజెన్సీ నిర్వాహకులకు గత ఆగస్టు నుంచి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.
No comments:
Post a Comment