Breaking News

05/03/2019

గూడు మరింత భారం (తూర్పుగోదావరి)

రాజమండ్రి, మార్చి 5 (way2newstv.in): 
భవన నిర్మాణాలపై సామగ్రి భారం పడింది. నిర్మాణాలకు ప్రధానంగా అవసరమైన సిమెంటు, ఇనుము, ఇసుక ధరలు పెరిగిపోవడంతో.. అంచనాల కంటే 20 నుంచి 30 శాతం వ్యయమవుతోంది. 15 రోజుల వ్యవధిలో రోజుకో రకంగా ముడి సరకు పెరిగిపోవడంతో నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. సిమెంటు ధరలైతే 40 శాతం పెరిగిపోవడంతో భవనాలతో పాటు జిల్లాలో చేపట్టే పలు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు పెరిగిన ధరలు భారం కావడంతో పనులు నిలిపివేయక తప్పడం లేదు.
భవన నిర్మాణ పనులకు జనవరి నుంచి జూన్‌ వరకు సీజన్‌.. ఈ సమయంలో ఎక్కువగా పనులు చేపడతారు. సాధారణంగా ఈ కాలంలో కొంత వరకు ధరలు పెరగడం సహజం. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలు మాత్రం భవన నిర్మాణదారులకు చుక్కలు చూపుతున్నాయి. జిల్లాలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో చేపట్టిన సుమారు 42 వేల వరకు ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. కొత్తగా మంజూరైన ఇళ్లతో పాటు.. ఆర్థిక పరమైన ఇబ్బందులతో గతంలో నిలిపివేసిన పనులు వీటిలో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి ఆయా లబ్ధిదారులు పనులు ప్రారంభించాలనుకుంటున్న తరుణంలో పెరిగిన ముడి సరకుల ధరలు అడ్డుకట్ట వేశాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం వంటి పట్టణాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. వీటితో పాటు ముహూర్తాలు ఉండడంతో నెల నుంచి వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా చేపట్టిన ఇళ్లు 25 వేలు వరకు ఉంటాయని అంచనా. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సిమెంటు రోడ్లు నిర్మాణం, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ, సామాజిక భవనాలు, ప్రభుత్వ పాఠశాలల ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. వీటికి సిమెంటు, ఇసుక, ఇనుము, ఇటుక, నల్లకంôకర ధరలు పెరిగిపోవడంతో సుమారు రూ.120 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.


గూడు మరింత భారం (తూర్పుగోదావరి)

భవన నిర్మాణ రంగంలో కీలక ముడిసరకైన సిమెంటు ధర భారీగా పెరిగింది. 15 రోజుల క్రితం వరకు బస్తా రూ.240-260 ఉంటే.. ప్రస్తుతం ఆ ధర రూ.330-360కు (కంపెనీలను బట్టి) చేరింది. అంటే దాదాపు రూ.110 వరకు ధర పెరిగింది. దీంతో జిల్లాలో భవన నిర్మాణ దారులపై రూ.కోట్లలో భారం పడుతుంది. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో నిర్మించుకునే లబ్ధిదారులకు బస్తా సిమెంటుకు రూ.250 బిల్లు చేస్తారు. గత ఏడాది వరకు గృహ నిర్మాణ శాఖ ద్వారా లబ్ధిదారులకు సిమెంటు సరఫరా చేసేవారు. దానిని ప్రస్తుతం నిలిపివేయడంతో లబ్ధిదారులు బయటి మార్కెట్‌లో రూ.330కు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవాలంటే.. సుమారు రూ.30 కోట్లు వరకు భారం పడుతుంది. సిమెంటు రోడ్లు, ఇతర భవన నిర్మాణాలకు సంబంధించి ఒక్క సిమెంటు ధర విషయంలోనే రూ.వందల కోట్లు భారం పడుతుందని వెనకడుగు వేస్తున్నారు. భవన నిర్మాణాల్లో మరో ప్రధాన ముడి సరుకు ఇనుము అదే బాటలో సాగుతుంది. నెల రోజుల వ్యవధిలో ఇనుము టన్నుకు రూ.అయిదు వేలు వరకు ధర పెరిగింది. భవన నిర్మాణాలకు సంబంధించి అంచనా విలువలో ప్రస్థుతం పెరిగిన  ఇనుము ధరల కారణంగా నాలుగు నుంచి అయిదు శాతం అదనంగా వ్యయం పెరిగింది.
ప్రస్తుతం పెరిగిన సిమెంటు ధరలు వచ్చే క్లోజర్‌ సీజన్‌లో చేపట్టే డెల్టా ఆధునికీకరణ పనులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీరు-చెట్టు, డెల్టా ఆధునికీకరణలో భాగంగా జిల్లాలో ఈ సీజన్‌లో రూ.216 కోట్లతో వివిధ పనులు చేపట్టడానికి జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో సుమారు రూ.100 కోట్లు వరకు కాలువలకు రక్షణ గోడలు.. ఇతర పనులు చేపట్టనున్నారు. దీనికి వినియోగించే కాంక్రీటు మిశ్రమానికి సిమెంటు, ఇసుక అవసరం. ఈ పనులు చేపట్టడానికి అంచనాల్లో రూ. 240 వరకు సిమెంటు ధరను చెల్లించడానికి రూపొందించారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో గుత్తేదారులు పనులు చేపట్టడానికి ముందుకు వస్తారా అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.
భవన నిర్మాణాల విషయంలో ఇసుక ఇక్కట్లు అంతా.. ఇంతా కాదు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చినా.. క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకాకపోవడంతో నిర్మాణదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు ఇటీవల జిల్లాలో పలు ఇసుక ర్యాంపులు మూత పడడంతో ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయాయి. అక్రమంగా ఇసుకను తరలించి.. అక్కడ నుంచి ఎక్కువ ధరకు విక్రయించడంతో యూనిట్‌ ఇసుకకు రూ.రెండు వేలు భారం పడుతుంది. దీంతో సామాన్యులకు ఇసుక దొరకడం గగనంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు లక్షల యూనిట్‌ల ఇసుక అవసరం కావడం.. ధరలు పెరిగిపోవడం వంటి పరిస్థితుల్లో గత 20 రోజులుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి.

No comments:

Post a Comment