Breaking News

08/08/2019

సురేష్ రెడ్డి, మండవ ఫ్యూచరేంటీ...

నిజామాబాద్, ఆగస్టు 8, (way2newstv.in - Swamy Naidu)
పార్టీ మారితే, ఫేట్‌ మారుతుందనుకున్నారు. కండువా మార్చితే పదవి ఖాయమని ఫిక్సయ్యారు. హామీలు కూడా ఆ రేంజ్‌లో వచ్చాయని సంబరపడ్డారు. రోజులు, నెలలు గడుస్తున్నాయి. ఆ శుభ గడియ మాత్రం, గడప తొక్కలేదు. ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామి నెరవేరకపోవడానికి, కారణం ఏమై ఉంటుందా అని బుర్రకు పని చెప్పారు. ఒకరి ఓటమి, తమకు పదవులు రాకుండా అడ్డు పడుతోందని తెలిసి, తెగ ఫీలయిపోతున్నారట. ఓడిపోయినవారిని తిరిగి సెటిల్ చేసే వరకూ, వీరికి పదవులు రానేరావని అందరూ మాట్లాడుకుంటున్నారట. అదే వారిద్దరిలోనూ కొత్త గుబులుకు కారణమవుతోంది.  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేకమంది సీనియర్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారినా రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదన్న ధీమాతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి టిఆర్ఎస్‌లో చేరారు.
 సురేష్ రెడ్డి, మండవ ఫ్యూచరేంటీ...

అందులో ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఎన్నికల ముందు టిఆర్ఎస్ అధినేత సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.  పార్లమెంట్ ఎన్నికల ముందు నిజామాబాద్‌ రాజకీయాల్లో మంచి పట్టున్న నేతగా పేరున్న మండవ వెంకటేశ్వరరావును, స్వయంగా ఆయనింటికి వెళ్లి చర్చించి పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. రానున్న రోజుల్లో మండవకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని భరోసా కల్పించి పార్టీలోకి తీసుకున్నారు. అయితే అటు సురేష్ రెడ్డి, ఇటు మండవ వెంకటేశ్వరరావుల పరిస్థితి, అగమ్యగోచరంగా మారింది. సురేష్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలి ఛైర్మన్‌ లేదా రాజ్యసభ ఇచ్చి పెద్దల సభకు పంపిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు, ఆ ఉలుకే లేదు. తనకు ఎలాంటి పదవి ఇస్తారో, అసలు ఇస్తారో ఇవ్వరో కూడా సురేష్‌ రెడ్డికి అర్థంకావడం లేదట. దీంతో ఎదురుచూపులే మిగిలాయి సురేష్‌ రెడ్డికి. తెలంగాణలో వరుసగా ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో సురేష్ రెడ్డికి ఏదో ఒకటి ఇస్తారని అంతా భావించారు. కానీ ఈమధ్య ప్రకటించిన ఎమ్మెల్సీల్లో కూడా సురేష్ రెడ్డి పేరు లేకపోవడంతో, కక్కలేక మింగలేక ఉన్నారు సురేష్‌ రెడ్డి. మండవ సేవలు టిఆర్‌ఎస్‌ పార్టీకి అవసరమని, ఆయనకు కీలక పదవి కట్టబెట్టబోతున్నట్టు అప్పట్లో తెలంగాణ భవన్‌ వర్గాలు చెప్పాయి. కానీ ఇప్పటివరకు అసలు పార్టీలో మండవ పొజిషన్ ఏంటో కూడా ఎవరికీ అర్థం అవ్వడం లేదు. అయితే ఎంపీ ఎన్నికల ఫలితాల తరువాత పదవులు పక్కా అనుకున్న నేతలకు, కవిత ఓటమితో బ్రేకులు పడ్డాయంటున్నారు గులాబీ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓడిపోయి ఎలాంటి పదవి లేకుండా ఉన్న సమయంలో, ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు పదవులు ఇస్తే బాగుండదన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. కవిత భవిష్యత్తుపై ఒక క్లారిటీ వస్తే గాని ఈ ఇద్దరు నాయకుల ఫ్యూచర్‌పై క్లారిటీ వచ్చేలా లేదని నిజామాబాద్ టిఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది

No comments:

Post a Comment