Breaking News

01/08/2019

బీజేపీకి ప్రియమైన శత్రువులు..

వ్యూహాత్మకంగా యూపీఏ మిత్రపక్షాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 1, (way2newstv.in)
దేశంలో పరిణామాత్మక మార్పునకు దోహదం చేసే ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం ఆమోదింప చేసుకోగలిగింది. సంఖ్యాపరంగా రాజ్యసభలో తనకు ఏమాత్రం మెజార్టీ లేకపోయినప్పటికీ బిల్లు విషయంలో అసాధారణ విజయం సాధించింది. దీనివల్ల దేశంలోని ముస్లిం ప్రజా జీవితంలో వచ్చే మార్పులు, పర్యవసనాల సంగతి పక్కన పెడదాం. రాజ్యం తాను చేయదలచుకున్న అంశాన్ని ఏదో రకంగా సాధించగలుగుతుందని ఈ ఉదంతం చాటి చెప్పింది. ప్రతిపక్షాల వ్యతిరేక వైఖరులు, తీవ్ర ప్రసంగాలు, బెదిరింపుల వంటి వన్నీ పైపై కబుర్లేనని తేలిపోయాయి. అన్నిటికీ మించి ఈవిషయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు బిక్క మొఖం వేయాల్సి వచ్చింది. అధికారపక్షం బలాబలాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయనేందుకు ఇదొక సంకేతం. కమలం పార్టీ రాజకీయ అజెండాలో తదుపరి కార్యాచరణ ఏవిధంగా ఉండబోతోందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. 
బీజేపీకి ప్రియమైన శత్రువులు.....

సైద్ధాంతికంగా బీజేపీకి ఆవిర్భావం నుంచే కొన్ని నియమాలున్నాయి. అయితే రకరకాల కారణాలు, సంకీర్ణ ధర్మంతో సంయమనం పాటిస్తూ వస్తోంది. తాజాగా వాటన్నిటినీ పక్కనపెట్టి తన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లేందుకు రాజకీయ సాహసాలకు సిద్ధమవుతోంది.భారతీయ జనతాపార్టీని వ్యతిరేకించే పార్టీల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ, త్రుణమూల్ మాత్రమే కొంచెం ఎదురొడ్డి నిలుస్తున్నాయి. కాంగ్రెసులోనూ కొందరు సభ్యులు వ్యక్తిగతంగా జంపింగ్ జపాంగ్ లు ఉన్నారు. కీలకమైన విషయాలకొచ్చే టప్పటికి యూపీఏలో భాగస్వామి అయినప్పటికీ ఎన్సీపీ గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుగా కనిపించే పెద్ద పార్టీలు ఇష్యూ బేస్డ్ సపోర్టు అంటూ కొత్త పల్లవి పాడుతున్నాయి. బిజూ జనతాదళ్ దాదాపు అన్ని సందర్బాల్లోనూ కమలం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. తెలుగు పార్టీలైన వైసీపీ,టీఆర్ఎస్, టీడీపీలు కమలానికి కవచంలా నిలుస్తున్నాయనే విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీఎస్పీ, ఎస్పీ లు సైతం ఏదో రూపేణా మద్దతును కొనసాగిస్తున్నాయి. సభనుంచి వాకౌట్ చేయడం, లేదా గైర్హాజరు కావడం ద్వారా కేంద్రప్రభుత్వం బిల్లులు రాజ్యసభలో గట్టెక్కడానికి తోడ్పడుతున్నాయి. 240 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏ బలం 107 మాత్రమే కానీ ట్రిపుల్ తలాక్ వంటి వివాదాస్పదమైన బిల్లు సైతం అనాయాసంగా విజయం సాధించగలిగిందంటే బీజేపీ రాజకీయ చాణక్యం ఎంత చక్కగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అజెండాలో ఇంకా అనేక అంశాలు దాగి ఉన్నాయి. ప్రధానంగా ఒకే దేశం ఒకే ఎన్నిక.. ఉమ్మడి పౌర స్మ్రుతి వంటి అంశాలు… ఒక దాని తర్వాత ఒకటిగా ఆచరణలోకి తెస్తుందనేది పరిశీలకుల అంచనా. ఇందుకుగాను కమలం పార్టీ తన మార్గాన్ని నిరాటంకం చేసుకుంటోందనే చెప్పాలి.2014 ఎన్నికల్లో యూపీఏ ఓడిపోయినప్పట్నుంచి కాంగ్రెసు మిత్రపక్షాలు గందరగోళంగానే ఉన్నాయి. ఆయా పార్టీలు నిజంగానే కాంగ్రెసుకు మిత్రపక్షాలుగా ప్రవర్తిస్తున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెసును కించపరచడం, అధినాయకత్వం ధోరణి సరిగా లేదని హెచ్చరించడం మినహా కాంగ్రెసు బలపడేందుకు మిత్రులెవరూ సహకరించడం లేదు. తన హయాంలో తీసుకు వచ్చిన చట్టాలే మార్పు చేర్పులకు గురవుతున్నా కాంగ్రెసు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. సమాచార హక్కు చట్టం సవరణ ఇందుకొక పెద్ద ఉదాహరణ. లోక్ సభలో బీజేపీ, ఎన్డీఏ ను నిరోధించడం యూపీఏ, కాంగ్రెసు పక్షాలకు సాధ్యం కాదు. అక్కడ ఎన్డీఏకు మంచి మెజార్టీ ఉంది. రాజ్యసభలో ఇప్పటికీ విపక్షాలదే ఆధిక్యత. కనీసం అక్కడైనా ప్రతిఘటించవచ్చు. ప్రతిపక్షాల బలాన్ని చాటుకోవచ్చు. కానీ హస్తం పార్టీ అదృష్టం అక్కడ కూడా అస్తవ్యస్తమైపోతోంది. అనూహ్యంగా ఓటమి చవిచూస్తోంది. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయాన్ని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెసు కూడా అంతగట్టిగానూ ప్రతిఘటిస్తామని శపథం పూనింది. బీజేపీకి మిత్రులైన అన్నాడీఎంకే, జేడీయూ వంటి పార్టీలు కూడా వ్యతిరేకిసున్నాయి. అయినప్పటికీ బీజేపీ చక్కని గేమ్ ప్లాన్ తో వారినందర్నీ అడ్డుతొలగించుకోగలిగింది. కాంగ్రెసు లో శల్యసారథులు ఎక్కువ అయిపోవడంతో ఎదుటి పార్టీ బలాన్ని పెంచేస్తున్నారు. సొంతబలాన్ని కుదించివేస్తున్నారు. ఫలితంగా బీజేపీ పక్కాగా విజయం సాధిస్తోంది.బీజేపీకి బలమైన శత్రువులే ఉన్నారు. కానీ వారంతా సైద్ధాంతికంగా విభేదిస్తున్నట్లుగా కనిపిస్తారు. కానీ సానుకూలంగా సహకరిస్తారు. తమ సంకీర్ణంలో ఉన్న మిత్రులు కొందరికీ బీజేపీతో ఐడియాలజీ పరంగా అంతరాలు ఉన్నాయి. కానీ వారెవరూ చట్టసభల్లో ఆమోదానికి ఆటంకంగా నిలవరు. కాంగ్రెసుకు, బీజేపీకి ఇక్కడే తేడా కనిపిస్తోంది. తమ వర్గంలో ఉండి బీజేపీకి సహకరించే పక్షాలు కాంగ్రెసు పుట్టి ముంచుతున్నాయి. బీజేపీ విషయానికొచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. ప్రత్యర్థి కూటమిలో ఉండి ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి ప్రతిపక్షాలు. నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ వంటివి ఈరకంగా ద్వంద్వప్రమాణాలు పాటిస్తున్నాయి. స్వయంగా కాంగ్రెసు పార్టీ సభ్యులే కొందరు గైర్హాజరవుతూ అధికారపార్టీని గట్టెక్కిస్తున్నారు. సమాచార హక్కు చట్టానికి సవరణలు, త్రిపుల్ తలాక్ బిల్లుల విషయంలో జరిగిందదే. బీజేపీ ఫ్లోర్ మేనేజర్లు తెలివిగా వ్యహరిస్తున్నానుకోవాలా? లేక కాంగ్రెసు పార్టీ సైద్ధాంతికంగా కలిసి వచ్చే పక్షాలతో సమన్వయం జరుపుకోలేకపోతోందనుకోవాలో అర్థం కాని విచిత్ర పరిస్థితి.

No comments:

Post a Comment