Breaking News

16/07/2019

కొత్త బస్సులు లేవు

పదిహేను ఏళ్ల నుంచి పాతవే దిక్కు
కరీంనగర్, జూలై 16, (way2newstv.in)
ఎక్స్‌ప్రెస్‌ బస్సులు అసలు కనిపించడమే కరువయ్యాయి. డిపో ప్రారంభం అయినప్పుడు ఎన్ని బస్సులున్నాయో? నేటికీ అదే సంఖ్యలో బస్సులు ఉండటం గమనార్హం. నాలుగు జిల్లాలకు ప్రధాన డివిజన్‌ కేంద్రంగా ఉన్న హుస్నాబాద్‌కు  నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు  సాగిస్టుంటారు.  ప్రతి రోజు పట్టణాలు, నగరాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. అందుకు తగ్గట్లుగా ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు లేవు.   లాంగ్‌ రూట్లకు ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లు లేకపోవడం డిపో నష్టానికి ఇదో కారణమని అభిప్రాయ పడుతున్నారు. ఉన్న  ఒక్క ఎక్స్‌ప్రెస్‌ బస్సులో హైదరాబాద్‌కు వెళ్లాలంటే సీట్లు దొరకని పరిస్ధితి. 
కొత్త బస్సులు లేవు

గతంలో బాసర, గోదావరిఖని, భద్రాచలం, యాదగిరి గుట్ట, మంచిర్యాల వంటి పట్టణాలకు లాంగ్‌ సర్వీస్‌లు నడిచేవి. ప్రస్తుతం ఈ లాంగ్‌ సర్వీస్‌లను పూర్తిగా రద్దు చేశారు.  హుస్నాబాద్‌ కేంద్రం నుంచి ఏటూ 40 కి.మీ దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలు వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, జనగామకు వెళ్లాలంటే పల్లె వెలుగు బస్సులే దిక్కవుతున్నాయి.  డిపోకు ఎక్స్‌ప్రెస్, సూపర్‌ లగ్జరీ బస్సులు కేటాయించకపోతే డిపొ మూసివేత బాట పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. డిపో ఇప్పటికే రూ.6 నుంచి 7 కోట్ల వరకు నష్టాల్లో ఉందని తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన కాకముందు హుస్నాబాద్‌ డిపో కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో ఉండేది. హుస్నాబాద్‌ను  సిద్దిపేట జిల్లాలో కలిపిన తర్వాత  అధికారులు, కార్మిక సంఘాల నాయకులు  ఏ పనికి వెళ్లాలన్నా సంగారెడ్డికి వెళ్లాల్సిన పరిస్థితి. స్క్రాప్‌ బస్సుల పేరిట ఇక్కడి నుంచి బస్సులను పక్కనబెడుతున్నా.. వాటి స్థానంలో మళ్లీ పాత బస్సులకే కలరింగ్‌ చేసి వినియోగిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.  పెద్ద బస్సుల స్థానంలో  మినీ బస్సులను తెచ్చి డిపోను మరింత నష్టాల్లోకి నెట్టేశారు.  హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపోలో మొత్తం 54 బస్సులున్నాయి.  ఇందులో ఆర్టీసీకి చెందిన 4 ఎక్స్‌ప్రెస్‌లు, 2 సూపర్‌ లగ్జరీ, 25 ఆర్డినరీ, 11 మిని పల్లె వెలుగు బస్సులున్నాయి. అలాగే 2 అద్దె బస్సులు(ఎక్స్‌ప్రెస్‌), 10 హైర్‌విత్‌ ఆర్డీనరీ బస్సులు నడుస్తున్నాయి.  బస్సుల నిర్వాహణకు గాను 89 మంది డ్రైవర్లు, 94 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ డిపో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. డిపోలోని మొత్తం 54 బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. మినీ బస్సులు తక్కువ దూరంలో ఉన్న గ్రామాల్లో నడిపించి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించాల్సింది. అంతే కాకుండా కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈ బస్సులను నడిపించడంతో కొత్తదనం ఏమీలేదు. లాంగ్‌రూట్లల్లో ఈ బస్సులు నడిపించే పరిస్ధితి లేదు.  మినీ బస్సుల ఉద్దేశం, లిమిటెడ్‌  స్టేజీలు, దాదాపు 20 కి.మీ దూరంలో  ఉన్న గ్రామాలకు మాత్రమే నడపాలి. కరీంనగర్,  హుజురాబాద్, సిద్దిపేట, హన్మకొండ రూట్లల్లో ఈ మినీ  బస్సులను నడిపిస్తున్నారు. ఈ రూట్లలో గతంలో పెద్ద బస్సులు నడిచేవి. అవి కాలం చెల్లడంతో మినీ బస్సును నడిపిస్తున్నారు. పెద్ద బస్సులు 55 సీట్ల కెపాసిటీ ఉండగా, మినీ బస్సుల్లో  కేవలం 35 సీట్ల కెపాసిటీ మాత్రమే.ఈ బస్సులను నడిపించడంతో పరోక్షంగా ఆటోలకు అశ్రయం కల్పించడమే అవుతోంది. అసలే చిన్న బస్సులు ఆపై వన్‌మెన్‌ సర్వీస్‌ వెరసి డ్రైవర్లపై అదనపు భారం పడుతోంది. హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లాలంటే, 9 స్టేజీలతో పాటు, హుస్నాబాద్‌ పట్టణంలోనే ఆరు స్టేజీలుంటాయి.  ఇంచుమించు డ్రెవర్‌ 15 స్టేజీల్లో బస్సు ఆపుకుంటూ టికెట్లు ఇస్తూ  ఏకాగ్రతతో డ్రైవింగ్‌ చేయడమంటే ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఆదాయంలో కోత, డ్రైవర్లకు అదనపు పని భారం, కండక్టర్ల కుదింపు, మరో వైపు ప్రయాణికులకు అసౌకర్యం.. ఇన్ని రకాల ఇబ్బందులు డిపోకు శాపంగా మారాయి.  

No comments:

Post a Comment