Breaking News

23/07/2019

కవిత సైలెన్స్ కు రీజనేంటో

హైద్రాబాద్, జూలై 23 (way2newstv.in)
టీఆర్ఎస్‌లో జనాకర్షణ ఉన్న నాయకుల్లో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఒకరు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా...పార్టీ శ్రేణుల్లో మాత్రం కవితకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నీ తానై వ్యవహరించిన కవిత... లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె జిల్లాకు రావడం లేదు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా కవిత దూరంగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
కవిత సైలెన్స్ కు రీజనేంటో

మున్సిపల్ ఎన్నికలకు కవిత దూరంగా ఉంటే... జిల్లాలో పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించేదెవరు అనే అంశంలో ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. జిల్లా నుంచి వేములు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ... ఆయన జిల్లా వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గంలోనూ బీజేపీకి మెజార్టీ రావడం ఆయనకు పెద్ద మైనస్. దీనికి తోడు కవిత తరహాలో రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం, వ్యూహరచన చేయడంలోనూ ప్రశాంత్ రెడ్డి అంతగా సక్సెస్ కాలేకపోయారనే అపవాదు ఉంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో... కవిత రంగంలోకి దిగితేనే జిల్లా టీఆర్ఎస్‌లో మళ్లీ మునుపటి జోష్ వస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఆమె తీరు చూస్తుంటే... ఇప్పుడప్పుడే జిల్లాకు వచ్చి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కవిత దూరంగా... ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆమె పాత్ర పోషించేది ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది

No comments:

Post a Comment