Breaking News

15/05/2019

దోమలపై దండయాత్ర (విజయవాడ)

విజయవాడ, మే 14 (way2newstv.in):  
దోమలను ఇట్టే పసిగట్టి నియంత్రించేందుకు నగరపాలక సంస్థ నూతన సాంకేతికతను వినియోగించేందుకు శ్రీకారం చుట్టింది ‘మస్కిటో డివైజెస్‌ ప్రాజెక్టు’ను ప్రస్తుతం ప్రయోగాత్మక ప్రాజెక్టుగా నగరంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలు, పేదల బస్తీలు, శివారు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో దోమలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా, తగిన రసాయనాల వాడకానికి ఏటా రూ.కోట్లు ఖర్చుచేస్తున్నా దోమల కాటు మాత్రం ప్రజలను కంటిమీదు కనుకులేకుండా చేస్తోంది. ఈ స్థితిలో నగరంలోని వివిధ ప్రాంతాలవారీగా దోమల సాంద్రతను సాంకేతిక పద్ధతిన కొలిచి ఆపై సమూలంగా నిర్మించేందుకు అనువుగా నూతన ప్రాజెక్టును నగరంలో పైలెట్‌ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెచ్చారు.నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో దోమలు అధికంగా ఉంటున్నాయి. వాటివల్ల ప్రజలు పలురకాల వ్యాధుల బారిన పడుతున్నారు. 


దోమలపై దండయాత్ర (విజయవాడ)

ఈ స్థితిలో దోమల జాతి మూలలను గుర్తించి లార్వాదశలోనే నిర్మూలించడం ద్వారా వాటికాటు నుంచి ప్రజలను రక్షించడం ఉత్తమంగా అధికారులు నిర్ణయించారు. నగరంలోని పాతబస్తీ, కొత్తపేట, ఆంజనేయవాగు, సామారంగం చౌక్‌, గొల్లపాలెంగట్టు, హౌసింగ్‌బోర్డుకాలనీ, దర్గాప్రాంతం, సింగ్‌నగర్‌, రాజీవ్‌నగర్‌, కృష్ణలంక,  రామలింగేశ్వరనర్‌, పటమటలంక, క్రీస్తురాజపురం, వంటి దాదాపు 28 సమస్యాత్మక ప్రాంతాల్లో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సమస్య సంపూర్ణ పరిష్కారానికి ‘మస్కిట్‌ డివైజెస్‌ ప్రాజెకు’్ట సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ‘మస్కిటో యంత్రాలను’ ట్రాకిట్‌నవ్‌ టెక్నాలజీ సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.‘మస్కిటో డివైజెస్‌’ సాంకేతిక పరికరాలను దోమలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బిగిస్తారు. వాటిల్లో దోమలను అకర్షించగలిగే, సువాసనతో కూడిన లిక్విడ్‌ను ఉంచుతారు. ఇది 24 గంటల పాటు కొద్దిపాటి విద్యుత్తువినియోగం ద్వారా పనిచేస్తుంది. అందులో అమర్చిన చిప్‌ ఆధారంగా ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటి) వంటి సాంకేతికతతో సిగ్నల్స్‌ సెల్‌టవర్‌కు, ఆపై క్లౌడ్‌ డేటాబేస్‌కు చేరతాయి. అనంతరం ఇంటర్‌నెట్‌ సర్వర్‌ సాయంతో కంప్యూటర్‌కు తరంగాలు అనుసంధానం అవుతాయి. ఫలితంగా డివైజెస్‌ ఉన్న ప్రాంతాల్లోని దోమల వివరాలను 24 గంటలూ.. ప్రతి నిమిషం తెలుసుకునే వీలుంటుంది. అందుకు సంబంధించిన సాంకేతికతను అధికారులు స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ సాయంతో అమెరికా(ఫ్లోరిడా) సాయంతో అందిపుచ్చుకోగా, పలు ప్రాంతాల్లో అమర్చిన సంబంధిత ‘డివైజ్‌ పరికరాలు’ దోమలను అకర్షించడంతో పాటువాటి సంఖ్య, ఆడ, మగ, వ్యాధులను కలిగించే వాటి సమాచారం వెల్లడిస్తాయి. ఇందుకు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్‌ను నగరపాలక సంస్థ బయాలజిస్టు కార్యాలయానికి అనుసంధానించారు.    కంప్యూటర్‌ సాయంతో ఏ ప్రాంతాల్లో మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, డెంగీ, గన్యా, జికా వైరస్‌ కలిగించే అతిప్రమాదరకమైన దోమలు ఉన్నాయో తెలుసుకుంటారు.నగరంలో ప్రాథమికంగా గుర్తించిన వాంబేకాలనీలో ప్లాట్‌ నెంబరు-118, హౌసింగ్‌బోర్డ్డు కాలనీ వీఎంసి ఎలిమెంటరీ స్కూలు, రాజీవ్‌నగర్‌ గృహకల్పప్లాటు నెంబరు-హెచ్‌.2-22, భ్రమరాంబపురం, భవానీపురం, హెచ్‌.బి.కానీ వాటర్‌ట్యాంకు, వాంబేకాలనీ సి బ్లాక్‌, కెఎల్‌.రావునగర్‌ పంప్‌హౌస్‌, రాణిగారితోట సిమెంట్‌ గోడౌన్‌, కృష్ణలంక అర్బన్‌హెల్త్‌ సెంటర్‌ వంటి 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో ఎటువంటి దోమలు ఉన్నాయో? ఏస్థాయిలో ఉన్నాయో? సులువుగా తెలుసుకుని, వాటిని లార్వాదశలోనే నిర్మూలించేందుకు ప్రజారోగ్య విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. నీరు నిల్వఉండే పల్లపు ప్రాంతాలు, కుంటలు, మరుగుకాల్వలు, డ్రెయిన్లు, కల్వర్టులు, నీరు తగ్గిన కాల్వలు వంటప్రాంతాల్లో ఎంఎల్‌ఆయిల్‌ బాల్స్‌ వేస్తారు. ఇక దోమలు పెరిగిన పక్షంలో మైదాన, కొండ ప్రాంతాలు, పేదల బస్తీలోని ఇంటింటా పైరత్రం చల్లడం, మలాథిన్‌ పౌడర్‌ను గోడలకు పిచికారి చేయడం, నీరు నిల్వఉన్న టైర్లు, కొబ్బరిబొండాలు, తొట్టెలు, ఇతర వస్తు సామగ్రిని ఖాళీ చేయించడం వంటి చర్యలు తీసుకుంటారు. శివారు ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లోనూ, మురికివాడల్లోనూ ఫాగింగ్‌ చేయడం ద్వారా దోమల నివారణకు ఈ విధానం ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment