Breaking News

08/05/2019

ఆ 250 జిల్లాలు

20 ఏళ్లలో 13 ఏళ్ల పాటు కరువే
న్యూఢిల్లీ, మే 8, (way2newstv.in
దేశంలో దాదాపు 250 జిల్లాల్లో  ఐదేండ్లుగా వరుసగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 2000 ఏడాది నుంచి 13 సార్లు లోటు వర్షపాతమే నమోదైంది. ఈఏడాది పరిస్థితులు మరింత దుర్భరంగా ఉన్నాయి. 85-90 శాతం పంటలు నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం జల వనరులపై ప్రభావం చూపుతున్నది. బోర్లు వంటి వాటిపై ఎక్కువగా ఆధారపడడం వల్ల అవి తొందరగా ఎండిపోతున్నాయి అని కలబుర్గి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేడర్ రాజు తెగ్గలి తెలిపారు. వాతావరణ అంచనాల్లో సమస్యలను పక్కనపెడితే, విపత్తు సన్నద్ధతలో ఐఎండీ వైఫల్యం కనిపిస్తున్నది. గతేడాది కేరళలో సంభవించిన వరదలు, ఈశాన్య రాష్ర్టాల్లో ఏటా సంభవిస్తున్న ఉపద్రవాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రుతుపవనాలు గతి తప్పుతున్న పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వమూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ 2018లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 76 శాతం మంది భారత రైతులు వ్యవసాయాన్ని వదిలేయాలని భావిస్తున్నట్లు తేలింది. 

ఆ 250 జిల్లాలు

వ్యవసాయం అత్యంత రిస్క్‌తో కూడుకున్నది. పంటపై ఎలాంటి గ్యారెంటీ ఉండదు. గతంలో అనుభవం ఆధారంగా వర్షాలపై ఓ అంచనాకు వచ్చేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. నవంబర్ నాటికే రిజర్వాయర్లు, బావులు ఎండిపోయాయి. రైతులందరూ పూర్తిగా పంట నష్టపోయారు అని ఉత్తర కర్ణాటకలోని నెల్లౌర్ గ్రామానికి చెందిన భీంశా కొగనూర్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య దాదాపు సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గత నెల 15న తొలివిడుత అంచనాలను విడుదల చేసింది. అయితే ఐఎండీ చెబుతున్నదానికంటే వర్షాలపై ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రైవేట్, అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దాదాపు సాధారణ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అంచనా వార్తాపత్రికల్లో ప్రధానంగా శీర్షికలకు ఎక్కినా, అదే అంచనాలో ఈ ఏడాది లోటు వర్షపాతం సంభవించడానికి దాదాపు 50 శాతం అవకాశం ఉందన్న విషయం మరుగునపడిపోయింది. దేశంలో హిమాలయ నదులను పక్కనపెడితే, మిగిలినవన్నీ వర్షాలపై ఆధారపడినవే. అయితే వర్షాలు మొహం చాటేయడంతో వాటిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. మరోవైపు భూగర్భ జలాలు ఎన్నడూ లేనంతగా అడుగంటి పోయాయి. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వివరాల ప్రకారం దేశంలో 2007-17 మధ్య కాలంలో దాదాపు 60 శాతం భూగర్భజలాలు అడుగంటాయి వ్యవసాయంలో ఆదాయం రావడమనేది గగనంగా మారగా, ప్రత్యామ్నాయ ఉపాధి కూడా దుర్భరంగా మారింది. దీంతో ఉపాధి హామీ పథకంలో చేరికలు పెరిగాయి. పంటలు పండకపోవడంతో గతేడాది కంటే ఈసారి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నవారి సంఖ్య 40 శాతం పెరిగిందని నెల్లౌర్‌కు చెందిన ఓ ఉపాధి కూలీ పేర్కొన్నారు. 

No comments:

Post a Comment