Breaking News

20/04/2019

రెవెన్యూ శాఖ ప్రక్షాళన పై మీనమేషాలు

హైద్రాబాద్, ఏప్రిల్ 20, (way2newstv.in)
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రస్తుతం రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. ఆ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది, పైసల్లేనిదే పనులు జరగటం లేదంటూ ఆయన పదేపదే ఫైర్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం నిర్ణయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఒకవైపు రెవెన్యూశాఖను ఎత్తేస్తానంటున్న చంద్రశేఖర్ రావు వైఖరిపై నిరసనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు శాఖలో అవినీతి ఉంటే దాన్ని పారద్రోలటానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై ఆలోచించాలిగానీ, ఏకంగా శాఖనే ఎత్తేస్తే సమస్య పరిష్కారమవుతుందా..? అనే ప్రశ్నలను పలువురు లేవనెత్తుతున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా జిల్లా కలెక్టర్లకు బదులు మంత్రులకు చెక్‌ పవర్‌ ఇచ్చేందుకు సీఎం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విస్తృత కార్యవర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన పార్టీ క్యాడర్‌కు ఇలాంటి సంకేతాలిచ్చినట్టు పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ అంశంపై ఇప్పుడు పలు రకాల వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. 


రెవెన్యూ శాఖ ప్రక్షాళన పై మీనమేషాలు 

తెలంగాణ ఏర్పడిన కొత్తలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన ఈ సందర్భంగా గమనార్హం. 'కాంగ్రెస్‌, టీడీపీల హయాంలో ఆ శాఖలో అవినీతి తారాస్థాయిలో పేరుకు పోయింది.. ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ ఇండ్లను మంజూరు చేశారు, దొంగ బిల్లులు సృష్టించారు, ప్రభుత్వ నిధుల్ని అప్పనంగా భోం చేశారు, ఈ విధంగా తిన్నదంతా కక్కిస్తా, ఎవర్నీ వదిలి పెట్టబోను...' అంటూ ఆయన హెచ్చరించారు. అదే సందర్భంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి.. ఇక అసలు హౌస్‌ఫెడ్‌తో పనేముందని ఆయన వ్యాఖ్యానించారు.. ఆ తర్వాత కొద్ది రోజులకు సీఎం ఒక కీలక ప్రకటన చేశారు. 'డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల మంజూరుకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అధికారమిస్తే... వారిపై కిందిస్థాయి నుంచి ఒత్తిడి పెరుగుతుంది.. దాంతో అర్హులకు అన్యాయం జరిగే అవకాశముంటుంది.. అందువల్ల ఇండ్ల మంజూరుపై అధికారాలన్నింటికీ కలెక్టర్లకే అప్పజెపుతాం...' అని ఆయన ప్రకటించారు. అంటే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల మంజూరుకోసం పనికొచ్చిన కలెక్టర్లు.. ఇప్పుడు చెక్‌ పవర్‌కు పనికి రాకుండా పోతున్నారన్నమాట. ఒకవేళ నిజంగానే చెక్‌పవర్‌ను మంత్రులకు అప్పగిస్తే.. అవినీతి అసలే లేకుండా పోతుందా...? అప్పుడు కూడా వారిపై కిందిస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తాయి కదా...? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలపై సీఎం కేసీఆర్‌ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అంశంగా మారింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి పట్ల కూడా ఉద్యోగుల్లో అయోమయం నెలకొన్నట్టు చర్చ జరుగుతోంది.

No comments:

Post a Comment