Breaking News

08/04/2019

అందాల తీరం ఎవరికో... (గుంటూరు)

బాపట్ల, ఏప్రిల్ 08(way2newstv.in):
అందమైన సూర్యలంక బీచ్‌... విద్య, పరిశోధన సంస్థల నిలయం... ఆక్వా సాగుకు ప్రసిద్ధి చెందిన తీరం...చారిత్రక ప్రసిద్ధి చెందిన భావనారాయణస్వామి ఆలయం... విస్తారంగా వరి పండే ప్రాంతం... పూలు, కూరగాయల సాగుకు అనుకూలమైన నేలలు... స్వాతంత్య్రోద్యమ కాంక్షను రగిల్చిన ప్రదేశం... జాతీయ రహదారితో కోస్తా అనుసంధానం... ఇలాంటి విశిష్ట పరిస్థితులు నెలకొన్న బాపట్ల నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన వైకాపా ఈసారి గెలిచి పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తుండగా ఈసారైనా పాగా వేయాలని తెదేపా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇరుపార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తుండటంతో పోరు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతోంది. బాపట్ల మినహా మిగిలిన ప్రాంతమంతా గ్రామీణ నేపథ్యమున్నదేకాగా తీరంలో నివసించే పల్లెకారుల ఓట్లు ఇక్కడ కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో పోటీపడిన పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. తెదేపా తరపున అన్నం సతీష్‌ ప్రభాకర్‌ కిందటిసారి ఓటమి పాలై మరోసారి బరిలోకి దిగగా వైకాపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రత్యర్థిగా ఉన్నారు. గతసారి భాజపా, జనసేన, తెదేపా కలిసి పోటీ చేయగా ఈసారి జనసేన, వామపక్షాలు, బీఎస్పీ కలిసి, వైకాపా, తెదేపా ఒంటరిగానే రంగంలోకి దిగాయి. అయితే పోటీ ప్రధానంగా తెదేపా, వైకాపా మధ్య కొనసాగుతోంది. ఇద్దరూ స్థానికులు కావడంతోపాటు విస్తృత పరిచయాలు ఉండటంతో పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తుండటంతో భావపురి బరిలో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


అందాల తీరం ఎవరికో... (గుంటూరు)

గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా అన్నం సతీష్‌ ప్రభాకర్‌ పనిచేస్తున్నారు. 2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా అధికారపార్టీ తరఫున అన్నీ తానై ప్రగతిలో పాలుపంచుకున్నారు. తొలి నుంచి తెదేపా తరఫున తానే పోటీ చేస్తానని, పార్టీని అధికారంలోకి తీసుకువస్తాననే ధీమాతో ఉన్నారు. సొంత సామాజికవర్గంతోపాటు తాను చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలుపు తీరాలకు నడిపిస్తాయన్న భరోసాతో ప్రచారం చేస్తున్నారు. తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయడంతోపాటు అండగా ఉంటానంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి గత ఐదేళ్లకాలం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అవకాశం ఉన్న మేరకు అభివృద్ధి పనులు చేపట్టానని, మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. సౌమ్యుడిగా పేరుపొందడంతోపాటు సొంత ట్రస్టు ద్వారా సేవలు అందించిన విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నారు. వైకాపాకు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు, వ్యక్తిగత పరిచయాలతో విజయం సాధిస్తానన్న నమ్మకంతో ప్రచారం చేస్తున్నారు. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారపర్వం సాగిస్తుండగా గెలుపు కీలకమై నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఎవరికి వారు వ్యూహాలకు పదును పెడుతూ ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ రాజకీయం చేస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా పగలంతా ప్రచారం, రాత్రయితే మంత్రాంగం అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
బాపట్ల నియోజకవర్గం 1952లో ఏర్పడగా అప్పటినుంచి 14సార్లు ఎన్నికలు జరిగాయి. సీపీఐ ఒకసారి, స్వతంత్రులు ఒకసారి, ఏడుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు తెదేపా, ఒకసారి వైకాపా విజయం సాధించాయి. 1982లో తెదేపా ఆవిర్భావం తర్వాత ఎనిమిదిసార్లు ఎన్నికలు జరగ్గా నాలుగుసార్లు తెదేపా, మూడుసార్లు కాంగ్రెస్, ఒకసారి వైకాపా నెగ్గాయి. తెదేపా ఆవిర్భావం తర్వాత నాలుగుసార్లు ఇక్కడ ఆ పార్టీ జెండా ఎగురవేసింది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు గెలుపొందిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెదేపాలో ఉన్నారు. ఇరుపార్టీలు ఇక్కడ హోరాహోరీగా తలపడుతుండటంతో ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment