Breaking News

27/04/2019

వైజాగ్ నుంచి మరో ఇంటర్నేషనల్ సర్వీస్

విశాఖపట్టణం ఏప్రిల్ 27, (way2newstv.in)
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు కేవలం మూడు మాత్రమే. కొత్తగా దుబాయ్‌కి మరో సర్వీసును ప్రారంభించనున్నారు. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల అనుసంధానం నిమిత్తం ముంబైకి రాత్రి వేళలో సర్వీసును ఎయిర్ ఇండియా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. పారిశ్రామికంగా ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న విశాఖ నుంచి విమాన సర్వీసులు నామమాత్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపలేకపోయినా కనీసం అనుసంధాన సర్వీసులు నడపాలని కోరుతున్నారు. ముఖ్యంగా విశాఖ నుంచి రాత్రి వేళల్లో ఢిల్లీ, ముంబై నగరాలకు సర్వీసులు నడపడం ద్వారా అంతర్జాతీయ అనుసంధానత పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాత ముంబై, ఢిల్లీ నగరాల నుంచి విదేశాలకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. నేరుగా విశాఖ నుంచి లేకపోయినా ఢిల్లీ, ముంబైలతో అనుసంధానం చేయాలన్న విజ్ఞప్తికి కేంద్ర పౌరవిమానయాన శాఖ స్పందించింది. విశాఖ నుంచి ముంబై నగరానికి రాత్రి వేళల్లో వారానికి రెండు సార్లు విమానాలు నడపాలని నిర్ణయించింది. 


వైజాగ్ నుంచి మరో ఇంటర్నేషనల్ సర్వీస్

దీనిలో భాగంగా తొలి విమానం విశాఖ నుంచి సోమవారం నడిచింది. వారానికి రెండు సార్లు ఈ సర్వీసు నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైంది. ఈ సర్వీసు ప్రతి సోమ, శనివారాల్లో విశాఖ-ముంబయి మధ్య నడుస్తుంది. సోమవారం 19.00 గంటలకు ముంబయి నుంచి బయలుదేరి 20.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి 21.30 గంటలకు బయలుదేరి 23.20 గంటలకు ముంబయి చేరుకుంటుంది. శనివారం 21.10 గంటలకు ముంబయిలో బయలుదేరి 23.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి 23.30 గంటలకు బయలుదేరి 1.20కి ముంబై చేరుకుంటుంది.అంతర్జాతీయ ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా విమాన సర్వీసులు నడపాలని ఏపీటీఏ ప్రతినిధులు ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి నేతృత్వంలో డైరెక్టర్ కమర్షియల్ అమితాబ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి ముంబైకి సర్వీసును మంజూరు చేశారని ఏపీటీఏ ప్రతినిధులు కే కుమార్ రాజా, ఒ నరేష్‌కుమార్, డీఎస్ వర్మ తెలిపారు. దీనితో పాటు రాత్రి వేళల్లో ఢిల్లీకి కూడా మరో సర్వీసును నడిపేందుకు అంగీకరించాలన్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ దేశాలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో శ్రీలంకకు నడిచే సర్వీసును రద్దు చేశారు. తాజాగా దుబాయ్‌కి మరో సర్వీసు నడిపేందుకు ప్రతిపాదించామని వెల్లడించారు.

No comments:

Post a Comment