Breaking News

12/04/2019

రాయలసీమలో ఫ్యాన్ ప్రభంజనమే..?

తిరుపతి, ఏప్రిల్ 12 (way2newstv.in)
పోలింగ్ ముగిసింది. రాయలసీమ జిల్లాల్లో ఎవరివైపు మొగ్గు ఉంటుందన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ప్రచారం వరకూ ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ తలపడ్డాయి. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు విపరీతంగా శ్రమించాయి. పోలింగ్ పూర్తయింది. ఇక ఎవరి అంచనాలు వారివే. రాయలసీమలో గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను వైసీపీయే గెలుచుకుంది. అయినా కోస్తాంధ్రలో వైసీపీ దెబ్బతినడంతో అధికారంలోకి రాలేకపోయింది.తాజాగా జరిగిన ఎన్నికల్లో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈసారి రసవత్తరమైన పోటీ జరిగిందనే చెప్పాలి. ఇటు పార్లమెంటు అభ్యర్థులు, అటు అసెంబ్లీ అభ్యర్థులు హోరా హోరీ తలపడ్డారు. కడప జిల్లాలో మరోసారి వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉంది. మొత్తం పది స్థానాల్లో ఈసారి కూడా తొమ్మిది స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్న ధీమా ఆ పార్టీలో కన్పిస్తుంది. పోలింగ్ సరళిని చూస్తే ఖచ్చితంగా పదికి పది గెలుస్తామని చెబుతున్నా జమ్మలమడక నియోజకవర్గం విషయంలో కొంత సందిగ్దత నెలకొని ఉంది. గత ఎన్నికల్లోనూ వైసీపీ కడప జిల్లాలో 9 స్థానాలను గెలుచుకుంది.


రాయలసీమలో ఫ్యాన్ ప్రభంజనమే..?

ఇక అనంతపురం జిల్లా విషయానికొస్తే ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ కంగుతినింది. కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఈసారి వైసీపీకి ఆరు నుంచి ఏడు స్థానాలు దక్కే అవకాశముందని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఈ ఐదేళ్లలో అనంతపురం జిల్లాకు నీళ్లు, పరిశ్రమలు తెచ్చినందున తమకే ఎడ్జ్ ఉంటుందని టీడీపీ భావిస్తున్నప్పటికీ అనేక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు టీడీపీ విజయావకాశాలకు అడ్డుకట్ట వేస్తాయని భావిస్తున్నారు. పుట్టపర్తి, కల్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, కదిరి, ఉరవ కొండ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైసీపీ ఖాతాలో పడతాయంటున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు సంబంధించి ఈసారి రాజకీయ సమీకరణాలు మారినందున రెండు పోటా పోటీగా ఉన్నట్లు కన్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో ఎనిమిది వైసీపీ గెలుచుకుంది. ఆరుతెలుగుదేశం పార్టీ సాధించింది. అయితే ఈసారి సమానంగా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పుంగనూరు, నగరి, చంద్రగిరి, చిత్తూరు, పీలేరులో ఇరు పార్టీల అభ్యర్దుల గెలుపు ఎవరిదో చెప్పడం కష్టంగా ఉంది. చంద్రబాబునాయుడికి ఎప్పుడూ చిత్తూరు జిల్లా కలసి రాలేదు. ఆయన సొంత జిల్లాలో ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తామని టీడీపీ ధీమాగా ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్లు ఉంది. కర్నూలు జిల్లాలోనూ అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశాలున్నట్లు కన్పిస్తుంది. గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని అంటున్నారు. కోట్ల ఫ్యామిలీ ప్రభావం ఏమాత్రం ఉండదన్నది పోలింగ్ తర్వాత స్పష్టమయింది. మొత్తం మీద రాయలసీమలో మరోసారి ఫ్యాన్ పార్టీ తన ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment