Breaking News

13/04/2019

అన్నీ అడ్డదారులే.. (కరీంనగర్)

కరీంనగర్, ఏప్రిల్ 13  (way2newstv.in): 
ఆధార్‌ అనుసంధానం.. ఆన్‌లైన్‌ బుకింగ్‌తో అక్రమ ఆదాయం కోల్పోయిన పలు గ్యాస్‌ ఏజెన్సీలు అడ్డదారులు తొక్కాయి. గతంలో బుకింగ్‌ల పేరుతో వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకోగా ఇష్టారీతిన గ్యాస్‌ కనెక్షన్ల జారీలో అందినంత దండుకున్నారు. ఆ దారులు మూసుకుపోవడంతో కొత్తగా ‘గ్యాస్‌ తీసే’ దందాకు తెరలేపారు. నగరంతో పాటు జిల్లాలోని హుజూరాబాద్‌, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో లక్షల్లో గ్యాస్‌ వినియోగదారులున్నారు. భారత్‌, హెచ్‌పీ, ఇండెన్‌ కంపెనీలు గ్యాస్‌ సరఫరా చేస్తుండగా.. కంపెనీల ఏజెన్సీలు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వినియోగదారు గ్యాస్‌ బుక్‌ చేసుకున్నారంటే డెలివరీ బాయ్స్‌ వాహనం వెంట తూకం యంత్రంతో పాటు ప్రీ డెలివరీ చెక్‌ పరీక్షించే కిట్టును తీసుకెళ్లాలి. వినియోగదారు ఇంటివద్ద గ్యాస్‌ తూకం వేసి గ్యాస్‌ బండ బరువుపోనూ 14.2 కిలోలు గ్యాస్‌ చూపాలి. అలాగే సిలిండర్‌ సరిగా ఉందా? లీకవుతుందా? పరీక్ష యంత్రం ద్వారా పరీక్షించి ఇవ్వాలి.రసీదులో ఉన్న నగదును మాత్రమే తీసుకోవాలి. ఇదీ జరగాల్సిన తంతు. సిలిండర్‌ 200-300 గ్రాముల తేడా ఉంటే సరి. కానీ కిలోల కొద్ది తేడా ఉందంటే పక్కా అక్రమమే..చమురు కంపెనీలు వాటి వాటి ప్లాంట్ల నుంచి సిలిండర్లను గ్యాస్‌ ఏజెన్సీ గోదాంలకు చేర్చుతున్నాయి. ప్లాంట్‌ నుంచి వచ్చినప్పుడు తూకం సరిచూసుకొని దించుకోవడం పరిపాటి.. ఇక అక్కడి నుంచి గ్యాస్‌ వినియోగదారునికి చేర్చే ముందు కూడా తూకం వేసి డెలివరీ బాయ్స్‌ వినియోగదారులకు ఇంటికి చేర్చాలి. 


అన్నీ అడ్డదారులే.. (కరీంనగర్)

అయితే చర్లపల్లి ప్లాంట్‌ నుంచి జిల్లాలోని గ్యాస్‌ ఏజెన్సీలకు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. గ్యాస్‌ వచ్చిందే తరువాయి గోదాంలనే అడ్డా చేసుకుని పిన్‌ ద్వారా గ్యాస్‌ తీసేస్తున్నారు. దీంతో 14.2 కిలోలు ఉండాల్సిన గ్యాస్‌ 10, 8, 12 కిలోలు మాత్రమే ఉంటోంది. తీసిన గ్యాస్‌ను కమర్షియల్‌ సిలిండర్లలో నింపేసి భారీగా దండుకుంటున్నారు. పలువురు డెలివరీ బాయ్స్‌ రహస్య స్థావరాల్లో వాహనాన్ని నిలిపి గ్యాస్‌ను తీస్తున్నారు. ఒక్కో సిలిండర్‌ నుంచి 2-5 కిలోల వరకు తీసేస్తున్నారు. గతంలో నగరంలోని ఓ ప్రాంతంలో ఓ ఏజెన్సీ గ్యాస్‌ డెలివరీ బాయ్‌ గ్యాస్‌ తీసి నింపుతుండగా పట్టుకున్న పౌరసరఫరాల శాఖలోని ఓ అధికారి రూ.2 లక్షలు వసూలు చేసి కేసు నమోదు చేయకుండా వదిలేశారు.నగరంలో డెలివరీ బాయ్స్‌ వసూళ్లు ఆగడం లేదు. ఎన్నికలంటూ ఏవో సాకులు చెప్పి తప్పుకోవడమే తప్ప పౌరసరఫరాల శాఖ తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాలో 12,35,838 కుటుంబాలు ఉండగా.. 8,02,499 కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు 1.50 లక్షలు కాగా భారత్‌, హిందుస్థాన్‌, ఇండేన్‌ ఏజెన్సీలు వినియోగదారులకు సేవలు అందిస్తుండగా.. 103 గ్యాస్‌ ఏజెన్సీలున్నాయి. కొన్ని ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వారిపై అదనపు భారం మోపుతున్నాయి. వినియోగదారుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు దాదాపుగా 4 లక్షల మంది ఉన్నారు. వీరిలో 5 కి.మీలోపు 2 లక్షల మంది ఉండగా వీరికి ఉచితంగా డోర్‌డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఒక్కొక్కరి నుంచి రూ.30కి పైగా సిలిండర్‌ ధరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు రూ.60 లక్షలు నెలవారీగా దండుకుంటున్నారు. ఇక మిగతా గ్రామాల్లో 2 లక్షల మంది వినియోగదారులు ఉండగా.. వీరివద్ద రూ.50-60 వరకు వసూలు చేస్తున్నారు. వీరి నుంచి సరాసరి రూ.50 చొప్పున లెక్కించినా సరే నెలకు మరో రూ.కోటి దండుకుంటున్నారు. ఇక మిగతా మంది పట్టణ ప్రాంత వినియోగదారులుండగా.. వీరిలో దాదాపుగా అందరూ 5 కి.మీల పరిధిలోనే ఉన్న వీరికి ఉచితంగా డోర్‌ డెలివరీ చేయాల్సి ఉన్నప్పటికి అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారు. వీరికి సరాసరి రూ.20 చొప్పున మాత్రమే లెక్కించినా సరే రూ.80 లక్షల పైచిలుకు అదనపు భారం పడుతోంది. నెలకు మొత్తం జిల్లాలో వినియోగదారుల నుంచి నెలకు రూ.2.40 కోట్ల చొప్పున నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారు. ఏటా రూ.24 కోట్లపైన వినియోగదారుల cజేబులకు చిల్లు పడుతోంది.

No comments:

Post a Comment