Breaking News

13/04/2019

మూగజీవాల గొంతెండుతోంది (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఏప్రిల్ 13(way2newstv.in): 
వేసవి వచ్చిందంటే చాలు వన్యప్రాణులను ప్రాణభయం వెంటాడుతోంది. ఆకు రాలే కాలంలో అడవిలో ఆహారం, నీటి కొరత ఏర్పడి కడుపు నింపుకొనే క్రమంలో దారితప్పి జనావాసాల్లోకి వస్తుంటాయి. వాటి కోసం కాచుకునే వేటగాళ్లకు అడ్డంగా దొరికిపోతుంటాయి. ఇలాంటి సంఘటనలు అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ఏదో ఒకచోట పునరావృతం అవుతుంటాయి. వివిధ కారణాలతో రోజురోజుకు వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేటి తరుణంలో వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. మండుటెండల కాలంలో వన్యప్రాణులు నివసించే ప్రదేశాల్లో తగు వసతులు కల్పించాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కవ్వాల్‌ పులుల అభయారణ్యం ఉంది. ఇది నాలుగు జిల్లాల పరిధిలో ఏకంగా 89 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. మంచిర్యాల జిల్లాలో ప్రత్యేకంగా రెండు జంతు అభయారణ్యాలు  ఉన్నాయి. జైపూర్‌ మండలం శివ్వారంలో మొసళ్ల అభయారణ్యం, కోటపల్లి మండలంలో కృష్ణ జింకల అభయారణ్యంగా పేరు పొందాయి. ఈ మూడు అభరణ్యాల పరిధిలో అనేక శాకాహార, మాంసాహారం జంతువులు ఉన్నాయి. వర్షాకాలం మినహాయిస్తే మిగతా కాలాల్లో తాగునీరు, ఆహారం కోసం అడవిని వదిలి సమీప గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో అదృష్టవశాత్తు గ్రామస్థులు చేతికి చిక్కితే బతికి బయట పడుతుండగా వేటగాళ్ల దృష్టిలో పడ్డవి మాత్రం మాంసాహారం అవుతున్నాయి. వేసవి కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 


మూగజీవాల గొంతెండుతోంది (ఆదిలాబాద్)

వన్యప్రాణులు సంచరించే అటవీ ప్రాంతాల్లో తాగునీటి వసతి పుష్కలంగా కల్పిస్తేనే వాటి ప్రాణాలకు భరోసా కలుగుతుంది.గోదావరి, ప్రాణహిత మధ్యలో పచ్చని చెట్లతో కనువిందైన అటవీ ప్రాంతానికి చిరునామాగా నిలుస్తోంది కృష్ణజింకల అభయారణ్యం. సుమారు 136 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ అటవీ ప్రాంతంలో గతేడాది నుంచి అధికారులు తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలనిస్తున్నాయి. తాగునీటితో పాటు మేత కోసం పచ్చిక బయళ్లను పెంచుతుండటంతో వన్యప్రాణుల మనుగడకు భరోసా ఏర్పడుతోంది. కోటపల్లితో పాటు కొండంపేట్‌ అటవీప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతులతో వన్యప్రాణులకు తాగునీటి వసతి దొరికింది. మరోవైపు లింగన్నపేట్‌ అటవీ ప్రాంతంలోనే పచ్చగడ్డిని పెంచుతున్నారు. అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలు సరిపోవడం లేదని చెప్పడానికి వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తుండడమే నిదర్శనం. మరిన్ని చోట్ల నీటి వసతి ఏర్పాటు చేసి వన్యప్రాణులు జనవాసాల్లోకి రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడి అధికారులపై ఉంది.వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అధికారులు ప్రస్తుతం పలు చర్యలు చేపడుతున్నారు. గుక్కెడు నీరు దొరకని ప్రదేశాల్లో సహజసిద్ధంగా ఉండేందుకు చిన్నపాటి కుంటలు ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన సాసర్‌పిట్‌లు అనుకున్నంత ప్రయోజనాన్ని ఇవ్వకపోవడాన్ని గమనించిన అధికారులు వాటి నిర్మాణాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో కుంటల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. కుంటను ఏర్పాటు చేసి అందులో నీటిని నింపేందుకు సోలార్‌ పంపుసెట్‌లను ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీటి సరఫరా నిరంతరంగా జరిగి కుంటలో స్వచ్ఛమైన నీరు చేరుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా వన్యప్రాణులు నీటికుంటల్లో నీరు తాగడమే కాకుండా జలకాలాడుతున్నాయి.కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోని జన్నారం డివిజన్‌లో మూగజీవాల దాహార్తి తీర్చడానికి పలు చర్యలు చేపట్టారు. కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో 89,223 హెక్టార్ల కోర్‌ ఏరియా, 1,11,968.34 హెక్టార్ల బఫర్‌ ఏరియాలో విస్తరించి ఉంది. చెంగున ఎగిరే జింక పిల్లలు, వేగంగా పరుగెత్తే చిరుత పులులకు ఇక్కడ కొదువ లేదు. గతంలో వేసవి కాలం సమీపించిందంటే చాలు వన్యప్రాణులు అడవిని విడిచి గ్రామాల బాట పట్టడం వల్ల అప్పట్లో కుక్కల దాడిలో, రహదారి ప్రమాదంలో ఏటా పదుల సంఖ్యలో వన్యప్రాణులు మరణించేవి. ప్రస్తుతం అడవి మధ్యలో సాసర్‌వెల్స్‌ నిర్మించి వారానికి రెండు సార్లు నీటి ట్యాంకు ద్వారా సంబంధిత బీట్‌ అధికారి నీళ్లు పోయడం వల్ల దాహార్తిని తీర్చుకుంటున్నాయి. అక్కడక్కడ నీటి కుంటలు, వాగుల్లో ప్రవహించే నీరు అటవీ జంతువులకు  ఉపయోగపడుతున్నాయి. దీంతో ప్రస్తుతం గ్రామ పొలిమేరల్లోకి మూగజీవాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. అటవీశాఖ అధికారులు చేపట్టిన చర్యలతో ప్రస్తుతం కవ్వాల్‌లో నీటి కొరత తీరినట్లే. కాకపోతే అడవిలో ఏర్పాటు చేసిన సోలార్‌ పంపులు, చేతి పంపుల పనితీరు బాగా లేకపోవడం, కొన్ని చోట్ల రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చేతి పంపులు పూర్తిగా పనిచేయక అలంకార ప్రాయంగా మారిపోయాయి. అటవీశాఖ అధికారులు సైతం చేతి పంపుల పనితీరును పట్టించుకోవడం లేదు. ఇక్కడున్న చేతి పంపులకు చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తే మరింత ఉపయోగ పడతాయని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment