Breaking News

08/03/2019

వామపక్షాలతో కాంగ్రెస్ అడుగులు

గుడ్ బై చెప్పే యోచనలో దీదీ
కోల్ కత్తా, మార్చి 8, (way2newstv.in)
రానున్న పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ కు ఎంతో ప్రతిష్టాత్మకం. ఇప్పటికే నిధుల లేమితో పార్టీ కూనారిల్లుతోంది. పార్టీ ఆర్థికంగా కష్ట నష్టాలను ఎదుర్కొంటోంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలి పార్లమెంటు ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో గెలుపోటములు రాహుల్ రాజకీయ భవిష్యత్ ను కూడా నిర్దేశిస్తాయి. అందుకోసమే భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీని నివారించేందుకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడా మిత్రులు కలసి రావడం లేదు.ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఒంటరి పోరుకే సిద్ధమయింది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్దంగా లేదన్న వార్తలు వస్తున్నాయి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ స్ట్రాంగ్ గా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకునే అవకాశాలున్నాయి. అందుకే మమత బెనర్జీ బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ తో సఖ్యతగా గత కొన్నేళ్ల నుంచి మెలుగుతూ వస్తున్నారు. 



వామపక్షాలతో కాంగ్రెస్ అడుగులు

వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సమయంలోనూ అక్కడ పొత్తు ఉంటే బీజేపీ ఓడిపోయి ఉండేదన్న వ్యాఖ్యలు మమత నోటి నుంచే వచ్చాయి. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి భారతీయ జనతా పార్టీ తర్వాత శత్రువు వామపక్షాలే. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వామపక్షాల నుంచి తాను పవర్ ను చేజిక్కించుకున్నారు. ఇప్పటికీ వివిధ ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీకి, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వీధిపోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కేసులు పెడుతూ ప్రభుత్వం తమ పార్టీ క్యాడర్ ను వేధిస్తుందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ తో జట్టుకట్టాలని మమత భావిస్తున్నారు. ఇటీవల కోల్ కత్తా లో జరిపిన ర్యాలీలో కూడా ఇదే రకమైన సంకేతాలను మమత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మమత పార్టీతో జట్టుకట్టేందుకు సిద్దంగా లేదు. అక్కడ వామపక్ష పార్టీలతో కలసి వెళ్లాలని కాంగ్రెస్ దాదాపుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో సీపీఎం, కాంగ్రెస్ లు ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో సీపీఎం, కాంగ్రెస్ లు కలసి పోటీ చేస్తే అది మమత పార్టీకి నష్టమని తెలిసినా కాంగ్రెస్ మాత్రం కమ్యునిస్టులతోనే సర్దుకుపోవాలని నిర్ణయించుకుంది. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలం పెంచుకునే అవకాశాలున్నాయంటున్నారు.

No comments:

Post a Comment