Breaking News

06/03/2019

చర్చానీయంగా మారిన జేసీ జోస్యం

అనంతపురం, మార్చి 6, (way2newstv.in)
జేసీ దివాకర్ రెడ్డి జోస్యం నిజమవుతుందా? నలభై శాతం ఎమ్మెల్యేలను మార్చకుంటే చంద్రబాబు ప్రభుత్వం రావడం కష్టమేనా? జేసీ కామెంట్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. నలభై శాతం సిట్టింగ్ లను మార్చాలంటే దాదాపు యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సిందే. కానీ చంద్రబాబు ఆ సాహసం చేయగలరా? సిట్టింగ్ లకు టిక్కెట్లు దక్కకుంటే వారు రెబల్స్ గా మారరా? ప్రస్తుతం చంద్రబాబు నివాసానికి వచ్చిన నియోజకవర్గం నేతలు చర్చించుకుంటున్న మాటలివి.చంద్రబాబునాయుడు నిజానికి గత సంక్రాంతి పండగ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. కానీ నెలన్నర గడుస్తున్నా ఇంకా అధికారికంగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయంటున్నారు. నిజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు సొంతంగా నిర్వహించుకున్న సర్వేల్లోనూ వెల్లడయింది. వివిధ రూపాల్లో తెప్పించుకున్న సర్వే నివేదికలు చంద్రబాబును సయితం ఆశ్చర్యంలో ముంచెత్తాయంటున్నారు. 


చర్చానీయంగా మారిన జేసీ జోస్యం

తాను ఖచ్చితంగా గెలుస్తారనుకున్న గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ఒకరిపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలడంతో ఆయన అవాక్కయ్యారని చెబుతున్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం సమీక్ష సందర్భంగా చంద్రబాబు దీనిని నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.మొదటి నుంచి టీడీపీ అధినేతగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిపై ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉంది. చంద్రబాబు అంటే నమ్మకముంది. ఆయన వల్లనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఇప్పటీకీ అనేకమంది నమ్ముతున్నారు. అంతేకాదు రాజధాని నిర్మాణం పూర్తికావాలన్నా, ఏపీ ఇతర రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో ముందుండాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమన్నది మేధావులు సయితం అంగీకరిస్తున్న విషయం. అయితే గత నాలుగున్నరేళ్లుగా ఆయన వేసిన పిల్లిమొగ్గలతో కొంత వ్యతిరేకత చంద్రబాబుపైన కూడా వచ్చిందంటున్నారు. చేసే పనికీ, చెప్పే దానికి పొంతన లేకపోవడం, రాజధాని నిర్మాణాన్ని నాలుగున్నరేళ్లుగా గాలికొదిలేసి ఇప్పుడు హడావిడి చేయడం కూడా బాబుకు ఇబ్బందిగా మారింది. అయినా ఇప్పటికీ ప్రజల్లో అత్యధిక శాతం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంగా ఉన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది. ల్యాండ్, శ్యాండ్ మాఫియాలతో గత నాలుగున్నరేళ్లుగా కొందరు ఎమ్మెల్యేలు భ్రష్టుపట్టి పోయారు. ప్రజల్లో చులకన ఏర్పడింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలాంటి బాపతు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. అయితే చంద్రబాబు మాత్రం సిట్టింగ్ లను తొలగించేందుకు సిద్ధంగా లేరు. మరీ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న వారిని మాత్రం పిలిపించి వారి కుటుంబంలో మరొకరికి టిక్కెట్ ఇచ్చే ప్రయత్నంలో బాబు ఉన్నారు. అంతేకాదు వ్యతిరేకత ఉన్న వారికి దాన్నుంచి ఎలా బయటపడాలో చంద్రబాబు క్లాసులు పీకి పంపుతున్నారు. ఇలా జేసీ చెప్పినట్లు 40 శాతం మంది ఎమ్మెల్యేలను తొలగించే అవకాశమే లేదని, మరి రిజల్ట్ ఎలా ఉంటాయోనన్నది తెలుగుదేశం పార్గీ వర్గాలు ఆందోళనగా ఉన్నాయి.

No comments:

Post a Comment