Breaking News

07/03/2019

వేసవికి ముందే నీటి ఎద్దడి

కరీంనగర్, మార్చి 7, (way2newstv.in)
హుజూర్‌నగర్ పట్టణానికి మంచినీటి సరపరా ఇంకా వేసవి కాలం రాకముందే దిన దిన గండంగా మారింది. పట్టణానికి మంచినీరు అందించే మట్టపల్లి వద్ద గల కృష్ణా జలాల పథకం ద్వారా గత ఏడాది కాలంగా గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం వారు సరఫరా చేయటం లేదు. గతంలో హుజూర్‌నగర్ నుండి మట్టపల్లి వెళ్లే రహదారిలో కల్వర్టుల నిర్మాణం వల్ల పైప్‌లైన్ పగిలి నీరు సరఫరా చేయటం లేదని మున్సిపల్ విభాగం వారు చెప్పగా కల్వర్టుల నిర్మాణం పూర్తి జరిగి 6 నెలలు దాటినా నీరు సరఫరా నిలిపివేశారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖకు రూ.80 లక్షల వరకు బాకీ ఉండటంతో నీటి సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. దీనితో ఏడాది కాలంగా 1974లో చిలుకూరు మండలం బేతవోలు చెరువు కింద ఉన్న బావి నుండి హుజూర్‌నగర్ పంచాయతీ కార్యాలయం వరకు ఉన్న పైప్‌లైన్ ద్వారా నీరు అందిస్తున్నారు. ఇవి ప్రజలు తాగటానికి ఉపయోగపడే నీరు కాకపోవటంతో పట్టణ ప్రజలు 100 శాతం కూడా ఆటోల ద్వారా ఇంటి ముందుకు వచ్చి అమ్మకం చేసే మంచినీటి క్యాన్‌లనే కొనుగోలు చేస్తున్నారు. 


వేసవికి ముందే నీటి ఎద్దడి 

ఇక బేతవోలు చెరువు నీరు స్నానం చేయటానికి కూడా పనికి రానందున బట్టలు ఉతకటానికి, ఇతర పనులకు వినియోగిస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఎస్. జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరువురు హుజూర్‌నగర్‌కు మంచినీరు అందించే కృష్ణా జలాల పథకాన్ని రూ.50 కోట్లతో ప్రారంభించి దానిని విస్తరించటానికి రూ.250 కోట్ల పథకంగా రూపొందించి మఠంపల్లి మండలంలోని గ్రామాలకు, పులిచింతల ప్రాజెక్టు పునరావాస గ్రామాలకు, హుజూర్‌నగర్, పరిసర గ్రామాలకు ఏర్పాటు చేయించగా ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాలు ఏడాదిగా హుజూర్‌నగర్‌కు సరఫరా చేయకుండా గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ అధికారులు నిలిపివేశారు. మిషన్ భగీరథ పేరుతో పట్టణంలోని 20 వార్డులలో సీసీ, బీటీ రోడ్లు ధ్వంసం చేయటం మినహా ఇప్పట్లో మంచినీరు వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో నీరు ఇప్పటికే చాలా వరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో మిషన్ భగీరథ పథకానికి మాత్రం మంచినీరు ఎక్కడి నుండి వస్తాయని అధికారులే అంటున్నారు. గత నెల రోజులుగా బేతవోలు చెరువు నుండి హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలోని మంచినీటి ట్యాంకుకు వచ్చే నీరు కూడా పూర్తిగా మురికిగా వస్తోంది. బేతవోలు, బూరుగడ్డ గ్రామాల రైతులు పైప్‌లైన్‌లను పగులగొట్టి నీటిని తమ పొలాలకు మళ్లించటమే మురికినీరు సరఫరాకు కారణమని సిబ్బంది అంటున్నారు. గత 44 ఏళ్ల నుండి కూడా రైతులు మంచినీరు సరఫరా చేసే పైప్‌లైన్‌లను ధ్వంసం చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే హుజూర్‌నగర్ ప్రజలకు మురికి నీరు సరఫరా ఒక శాపంగా మారింది

No comments:

Post a Comment