Breaking News

02/02/2019

ఎంపీ ఎన్నికలపై వ్యూహ,ప్రతి వ్యూహాల్లో నేతలు

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 2, (way2newstv.in)
పార్లమెంట్ ఎన్నికలపై విజయం సాధించాలన్న లక్షంతో ఇప్పటికే రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. మార్చి చివరిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సమాచారం మేరకు ఆయా పార్టీల నేతలు ఎంపి బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసిన టిఆర్‌ఎస్ పార్టీ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం విజయం సాధించాలన్న లక్షంతో ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల భుజస్కంధాలపై వేశారు. రాష్ట్రంలో 16 ఎంపి స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలనే సంకేతాన్ని ఎమ్మెల్యేలకు అందించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సైతం సిఎం మాటను జవదాటకుండా పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.రాజకీయాల్లో ఎప్పుడు వార్తల్లో ఉండే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలన్న తపన టిఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. 


ఎంపీ ఎన్నికలపై వ్యూహ,ప్రతి వ్యూహాల్లో నేతలు
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టిఆర్‌ఎస్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న సర్వేల నేపథ్యంలో టిఆర్‌ఎస్ మరింత ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగనుంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం టిఆర్‌ఎస్ లోకసభ ప్రతిపక్ష నేత ఎంపి జితేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్ వైపు నుండి పోటిలో నిలవనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా సంకేతాలు అందాయి. ఎంపిగా ఉన్న జితేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం లోక్‌సభలో తన బాణిని వినిపించారు. విభజన హామిల అమలుకు గట్టిగా పోరాడుతూనే ఎంపిగా మహబూబ్‌నగర్ పార్లమెంట్‌తో పాటు జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టుల సాధనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న జితేందర్‌రెడ్డి తిరిగి ఈ ఎన్నికల్లో పోటి చేయనున్నారు.ఎమ్మెల్యేల గెలుపుకు జితేందర్‌రెడ్డి కృషి చేయడంతో తిరిగి ఎమ్మెల్యేలందరూ జితేందర్‌రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేయనున్నారు. ఇక కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికలు నల్లేరు మీద నడకలా సాగనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలలో కేవలం ఒకటే సీటును కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ పరిస్థితి దీనంగా ఉంది. కాంగ్రెస్‌లో కీలక నేతలుగా చక్రం తిప్పిన రేవంత్‌రెడ్డి, డికె అరుణ, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, నాగం జనార్ధన్‌రెడ్డి వంటి హేమాహేమీల నేతలను ప్రజలు మట్టి కరిపించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న వార్తలు వెలువడుతున్నాయి. ఎంపిగా పోటి చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్థికంగా ఖర్చు పెట్టుకున్న వీరు తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడం అంటే తలకు మించిన భారంగా మారనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంపి రేసులో మాజీ ఎంపి జైపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, డికె అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే జైపాల్‌రెడ్డి పోటి చేద్దామని భావించినప్పటికీ వయసు రీత్యా పెద్దవారు కావడంతో పాటు టిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టగలడా అన్న భావనలు కాంగ్రెస్‌లోనే వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి పోటి చేయాలనుకున్నప్పటికీ ఇంకా ఓటమి ఆలోచన నుంచి ఆయన తేరుకోవడం లేదని తెలుస్తోంది.కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి ఓటమి చెందడం తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా డికె అరుణ పోటిలో నిలవాలనుకున్నప్పటికీ ఆమె కూడా అంతగా ఆసక్తి కనబర్చడం లేదని సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక వెలుగు వెలిగిన డికె అరుణ కేంద్ర రాజకీయాలపై అంతగా ఆసక్తి లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల మదనం వెనుక ఓటమి భయమే వెంటాడుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బిజెపి నుంచి ఈ సారి బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ సీటు దాదాపు ఖరారయినట్లే అని భావిస్తున్నారు బిసి సామాజిక వర్గానికి చెందిన శాంతకుమార్ అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం సేవలందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంపి టికెట్ బిజెపి అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు ఖరారయినట్లే అని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని చోట్ల పోటి చేసినప్పటికీ అన్నింట్లో ఓటమి పాలైంది.నారాయణపేట, కల్వకుర్తి మినహా మిగతా చోట్ల కనీసం ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం విశేషం. ఇలాంటి సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఏ మేరకు పోటి ఇవ్వగలదన్న చర్చ జరుగుతోంది. టిఆర్‌ఎస్ పైన పోటి చేయాలంటే బలమైన ప్రత్యర్థి ఉంటే తప్ప అంత సులువు కాదన్న చర్చ అన్ని రాజకీయ పార్టీలో జరుగుతోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం విషయానికొస్తే ప్రస్తుత ఎంపి నంది ఎల్లయ్య కాంగ్రెస్ నుంచి 2014లో ఎంపిగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ సారి ఆయన కూడా వయస్సు సమస్య కావడంతో అభ్యర్థులను మార్చే యోచనలో కాంగ్రెస్ అభ్యర్థుల వేట కొనసాగిస్తోంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లురవి పోటి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కూడా ఎంపి సీట్‌పై కన్నేసినట్లు సమాచారం. ఇక టిఆర్‌ఎస్ విషయానికొస్తే మాజీ ఎంపి మంద జగన్నాధం, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే రాములు మధ్యనే ప్రధాన పోటి నెలకొంది. ఇద్దరు కూడా సీనియర్ నేతలు కావడంతో టిఆర్‌ఎస్ అధిష్టానం ఎవరి వైపు మద్దతిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే మంద జగన్నాధంకు ఢిల్లీ స్థాయిలో ఉన్నతమైన స్థానమే ముఖ్యమంత్రి కేటాయించారు. రాములుకు ఇంతవరకు ఎలాంటి పదవి రాలేదు. ఎమ్మెల్సీ పదవి కాని ఎంపి బరిలో కాని నిలబట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంచాయతీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కసరత్తులు జరిగే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కానున్నాయి.

No comments:

Post a Comment