Breaking News

13/02/2019

వ్యవసాయశాఖలో నిధులు నిక్షేపం

ఏలూరు, ఫిబ్రవరి 13, (way2newstv.in)
ప్రధానంగా రైతన్నకు ఆధునిక యంత్ర పరికరాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే రూ.23 కోట్లు జిల్లాకు కేటాయించగా, మరో రూ.25 కోట్లను జిల్లాకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆర్థిక సంవత్సరం సమీపిస్తున్నా ఇప్పటికే కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుబంధ రంగాల్లో కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలో వివిధ యూనిట్లు, పథకాలకు వచ్చిన   నిధులను ఖర్చు చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందునా ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రబీ గడువు ముగుస్తున్న సందర్భంగా ఆయా శాఖలు చూపుతున్న నిర్లక్ష్యం ఇటు ప్రజాప్రతినిధుల్లో, అటు ప్రభుత్వంలో అసహనానికి కారణమవుతోంది. 


వ్యవసాయశాఖలో నిధులు నిక్షేపం

అన్నీ అయ్యాక ఇచ్చి లాభమేంటనే ఆలోచన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ఆయా శాఖలు స్పందించాలని, ఆర్థిక సంవత్సరం ఆఖరున నిధులు వెనక్కిపంపాలని చూస్తే అలాంటి వారిని సస్పెండ్‌ చేస్తానని జిల్లా కలెక్టరు స్వయంగా హెచ్చరించడం ఇప్పుడు అధికారులను పరుగులు పెట్టిస్తోంది.జిల్లాలో వరి 4.60 లక్షల ఎకరాలు, ఉద్యాన పంటలు 5 లక్షల ఎకరాలు, ఆక్వా 2.25 లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. రైతులు 6 లక్షల మంది వరకు ఉండగా, ఇందులో కౌలురైతులు సుమారు 3 లక్షల మంది వరకు ఉన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా సాగులో నాణ్యత పెంచడం, ఖర్చు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించే లక్ష్యంతో వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు 2017-18లో సబ్‌మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకానిజం (ఎస్‌ఎంఏఎం) పథకం కింద రూ.23 కోట్లను ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. పథకంలో భాగంగా ఈఏడాది ట్రాక్టర్లకు రాయితీ కింద రూ.3.50 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.2.50 కోట్ల విలువైన 1500 ట్రాక్టర్లను అందించారు. ఇంకా రూ.కోటి విలువైన 400 ట్రాక్టర్లు అందించాల్సి ఉంది. రూ.12 కోట్ల విలువైన రాయితీతో పవర్‌ టిల్లర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.కోట్ల విలువైన 1250 పవర్‌ టిల్లర్లను అందించారు. ఇంకా 200 వరకు ఇవ్వాల్సి ఉందని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. రూ.4.20 కోట్ల విలువైన 840 పవర్‌ టిల్లర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.3.65 కోట్ల సబ్సిడీతో 636 పవర్‌ టిల్లర్లను మాత్రమే ఇవ్వగలిగారు. మినీట్రాక్టర్ల విషయంలో మాత్రం 100 శాతం ఫలితాలను సాధించగలిగారు. ఒక్కోటి రూ.లక్ష విలువచేసే మినీ ట్రాక్టర్లను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, లక్ష్యానికి అనుగుణంగా 30 మినీట్రాక్టర్లను అందించగలిగారు. ఇక రైతులు ఎక్కువ అవసరంగా భావించి కోరుకునే స్ప్రేయర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల విలువైన 2300 ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.1.20 కోట్ల విలువ చేసే స్ప్రేయర్లు మాత్రమే అందజేశారు. ఇంకా 1500 స్ప్రేయర్లు అందించాల్సి ఉంది. ఇక కొంతకాలంగా వివాదాస్పదమవుతూ వస్తున్న రైతు రథం పథకంలోనూ జాప్యం జరుగుతోంది. పథకం కింద 1097 ట్రాక్టర్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 975 ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం రూ.1.50 లక్షల రాయితీ ఇస్తుండగా, మిగిలిన మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంది. ఆర్‌కేవీ పథకంలో భాగంగా రూ.2.14 కోట్ల విలువైన టార్పాలిన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.1.98 కోట్ల విలువైన 19,200 వరకు ఇచ్చారు. గతంలో డెల్టాలోనే వీటిని అందజేసేవారు. ఈ ఏడాది మెట్ట ప్రాంతంలోనూ పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.భూసార పరీక్షల్లో భాగంగా ఉద్యాన శాఖలో 24 వేల మట్టి నమూనాలు సేకరించగా, 19 వేలు విశ్లేషించి 6 వేలకు మాత్రమే భూసార పరీక్ష కార్డులు అందించారు. ఇంకా 18 వేల కార్డులు ప్రింట్‌ చేయాల్సి ఉంది.  వ్యవసాయ శాఖ పరిధిలో 11 వేల భూసార పరీక్షలతో కలిపి మొత్తం 40 వేల కొత్త కార్డులు ప్రింటింగ్‌ చేయాల్సి ఉంది.  జిల్లాలో పశుగ్రాస క్షేత్రాలకు సంబంధించి ప్రస్తుతం 2476 ఎకరాల్లో గడ్డి పెంపకం చేస్తున్నారు. ప్రగతి అంతంత మాత్రమే.  సూక్ష్మబిందు సేద్య పథకం కింద జిల్లాలో 45 వేల హెక్టార్లలో ఈ ఏడాది డ్రిప్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 27 వేల మంది రైతులకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేశారని, 8 వేల హెక్టార్లలో ఇన్సులేషన్‌ పూర్తిచేస్తే రానున్న 7 వారాల్లో లక్ష్యాలు సాధించడం సాధ్యంకాని పరిస్థితి.  జిల్లాలో మల్బరీసాగు, రేరింగ్‌ షెడ్ల నిర్మానం విషయంలో ఇంత వరకు 75 శాతం లక్ష్యాలను మాత్రమే పూర్తిచేశారు.

No comments:

Post a Comment