కర్నూలు, ఫిబ్రవరి 18, (way2newstv.in)
కోట్ల కుటుంబం… ఇప్పుడు నిట్టనిలువునా చీలింది. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు కోట్ల హర్షవర్థన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సొంత గ్రామం లద్దగిరి. ఇది కోడుమూరు నియోజకవర్గంలో ఉంది. అయితే కోడుమూరు నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందనడంలో అతిశయోక్తి లేదు. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కోట్ల ఫ్యామిలీ సపోర్ట్ చేసిన వారే ఇక్కడ విజయం సాధిస్తుంటారు. అయితే గత ఎన్నికలు పూర్తిగా భిన్నం. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్న కోడుమూరు ప్రజలు గత ఎన్నికల్లో ఇక్కడ కోట్ల కుటుంబాన్నికాదని వైసీపీకి కట్టబెట్టారు.కోడుమూరు నియోజకవర్గం 1962లో ఏర్పాటయింది. రిజర్వ్ డ్ నియోజకవర్గం.
నిట్ట నిలువునా చీలిపొయిన కోట్ల ఫ్యామలీ
ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విజయం సాధించారు. కోడుమూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐ లు కలపి ఎనిమిది సార్లు గెలిచాయి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకసారి మాత్రమే విజయం సాధించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి శిఖామణి నాలుగు సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆయన కుమారుడు మణిగాంధీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన మణిగాంధీ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.అయితే ఇప్పుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కూడా టీడీపీ లో చేరుతుండటంతో మణిగాంధీ బలం మరింత పెరగాల్సి ఉంటుంది. కానీ కోడుమూరు నియోజకవర్గం లోని టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీకి, అక్కడి పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్న విష్ణువర్థన్ రెడ్డికి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఒక దశలో అనవసరంగా పార్టీని మారానని మణిగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇన్ ఛార్జి విష్ణువర్థన్ రెడ్డిదే పెత్తనం కావడంతో మణిగాంధీ సహించలేకపోతున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ దక్కుతుందో? లేదో? అన్నదీ డౌటే. అలాంటి పరిస్థితుల్లో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి బలం అదనంగా చేరినా ఇక్కడ టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు.మరోవైపు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సోదరుగు కోట్ల హర్షవర్థన్ రెడ్డి వైసీపీలో చేరారు. ఇటీవల పార్టీలో చేరిన హర్ష వైసీపీకి ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్న మురళీ కృష్ణకు హర్ష మద్దతుగా నిలిచారు. ఏడుగురు ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. మరోసారి ఇక్కడ వైసీపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే తెలుగుదేశం ఆశలన్నీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపైనే ఉన్నాయి. మరి కోడుమూరు నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. బ్రదర్స్ లో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే.
No comments:
Post a Comment