Breaking News

21/02/2019

విజయవాడ, గుంటూరు రహదారులకు మహర్దశ

విజయవాడ, ఫిబ్రవరి 21, (way2newstv.in
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాలైన విజయవాడ, గుంటూరు ప్రాంతాల రహదారులకు మహర్దశ పట్టనుంది.ఏపీలో అత్యంత వేగంగా ప్రయాణించడానికి రోడ్డు మార్గాలను విస్తరించే పనిలో పడింది ప్రభుత్వం. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల వాసులు అమరావతికి చేరుకోవడానికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రభుత్వం నిర్మించనుంది. ఆరు, నాలుగు లేన్ల ఈ రహదారిని 598 కిలోమీటర్లు నిర్మిస్తారు.  విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు 11 జిల్లాల నుంచి తక్కువ వ్యవధిలో రోడ్డుమార్గం ద్వారా త్వరితగతిన గమ్యస్థానాలు చేరేలా ఏపీ ప్రభుత్వం రహదారులను విస్తరించనుంది. అందులో భాగంగానే అత్యంత ఆధునిక రీతిలో అనంతపురం నుంచి అమరావతికి హైవేను నిర్మించాలని నిర్ణయించింది.అనంతపురం నుంచి అమరావతి వెళ్లాలంటే 472 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కర్నూలు నుంచి 311, కడప నుంచి 371 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది. 


 విజయవాడ, గుంటూరు రహదారులకు మహర్దశ 

నూతన రహదారి ఏర్పాటుతో ఈ దూరం తగ్గనుంది. అనంతపురం నుంచి 101 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 28, కడప నుంచి 74 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ మార్గం ఏర్పాటుకు అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 26890 ఎకరాల భూమి, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 1,518.75 హెక్టార్ల అటవీ భూమిని ప్రభుత్వం సేకరించనుంది.గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో చేపట్టే రహదారితో రాజధాని నుంచి నాలుగైదు గంటల్లో సీమ జిల్లాలకు చేరే అవకాశముంది. కడప, కర్నూలు నుంచి వచ్చే రహదారుల అనుసంధానం అయ్యాక.. ప్రకాశం జిల్లా నుంచి ఆరు వరుసలుగా రహదారిని నిర్మిస్తారు. 29,557 కోట్లతో అత్యాధునిక రీతిలో ఆరు. నాలుగు లేన్లుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. రెండు మూడేళ్లలో ఈ మార్గాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే భూ సేకరణకు చర్యలు చేపట్టారు. ఈ మార్గం గనుక పూర్తయితే రాజధాని అమరావతి నుంచి తక్కువ సమయంలో రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చేరుకోనే వీలుకలుగుతుంది.అనంతపురం జిల్లాలో 72.850 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం 1268 ఎకరాల భూమి, 86 హెక్టార్ల అటవీ భూమి అవసరం అవుతుంది. ఇందుకు 5434.40 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక కిలోమీటర్‌కు 42.06 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్టుగా లెక్కగట్టారు. ఈ రహదారిలో ఏడు ఆర్వోబీలను నిర్మించనున్నారు.కర్నూలు జిల్లాలో 78.60 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణానికి 920.25 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఆరు వంతెనలు, ఒక ఆర్వోబీ, టన్నెళ్లను నిర్మించనున్నారు. ఈ జిల్లాలో రహదారి నిర్మాణానికి 7139.13 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ జిల్లాలో కిటోమీటర్‌ రహదారి నిర్మాణానికి 53.95 కోట్లు ఖర్చుగా అధికారులు అంచనా వేశారు. కడప జిల్లాలో 104 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. ఇందుకోసం 2,968 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. 824.25 హెక్టార్ల భూమితోపాటు.. 108 హెక్టార్ల అటవీ భూములు సేకరించాల్సి ఉంది. దీంతో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని కడప, కర్నూలు, అనంతపురం జిల్లా వాసులు అతృతతో ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment