న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27, (way2newstv.in)
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాల జోడీ మరోసారి జాదూ చేసే దిశలో భారీ రాజకీయ యజ్ణానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా సమరాన్ని తలపింప చేసే విధంగా ఒక్కో రాష్ట్రంలో గెలుపు బాటలు వేసుకుంటూ, సర్దుబాట్లతో మైత్రీపూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటూ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. గడచిన వారం పదిరోజులుగా ఇదే పనిలో నిమగ్నమవుతున్నారు. నిన్నామొన్నటివరకూ కొరుకుడు పడని కొయ్యలుగా ఉన్న ఈ ద్వయం ఎన్నడూ లేనంత సహనం ప్రదర్శిస్తున్నారు. సంయమనం చూపుతున్నారు. ఒక్కసీటు కలిసివచ్చే పార్టీని సైతం వదులుకునేందుకు సిద్ధపడటం లేదు. తమ సహజధోరణికి భిన్నంగా అపూర్వమైన సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నారు. గొడవలు,వివాదాలతో తమకు దూరమైన వారిని కూడా మచ్చిక చేసుకుంటూ కలుపుగోలుతనం ప్రదర్శిస్తున్నారు. రానున్న రెండు నెలల్లో పక్కా రాజకీయమే దేశంలో నడుస్తుంది. దానికి అవసరమైన పరిణతిని, ఎత్తుగడలను బీజేపీ నాయకత్వం కనబరుస్తోంది.ఎక్కడ నెగ్గాలో కాదు.
మోడీ, షాలకు కొత్త ఫ్రెండ్స్
ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అంటూ ఒక సినిమా డైలాగ్ అన్నిరంగాలకూ వర్తించే ఒక జీవనసత్యాన్ని ఆవిష్కరించింది. రాజకీయాలకు ఇది మరింతగా వర్తిస్తుంది. తగ్గి నెగ్గడం రాజకీయాల్లో ప్రతినేతకూ అవసరమే. అనేక సందర్భాల్లో కులసంఘాలు, ప్రత్యర్థుల ముందు తలవంచాల్సి ఉంటుంది. జాతీయ పార్టీల్లో పెద్ద నాయకులు కూడా అధిష్టానం ముందు తలవంచాలి. బీజేపీ అగ్ర నాయక ద్వయానికి ప్రస్తుతానికి తిరుగులేదు. కొన్ని అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నప్పటికీ పేలవంగా ధ్వనిస్తున్నాయి. దేశస్థాయిలో ప్రతిధ్వనించగల అద్వానీ వంటి వారు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఒక రకంగా పార్టీ పరంగా తిరుగులేని మద్దతే లభిస్తోంది. ధిక్కరించలేని ఈ అధికారం వారిపై గురుతర బాధ్యతను ఉంచుతోంది. గడచిన నాలుగేళ్లలో పార్టీని విస్తరించడానికి సకల విధాలుగా యత్నించిన వీరు తమ పంథాను తాజాగా పూర్తిగా మార్చుకున్నారు. విస్తరణ వాదాన్ని పక్కనపెట్టి పాత మిత్రులతో విభేదాలు పరిష్కరించుకోవడం, కొత్త వాళ్లను కలుపుకు పోవడమనే మధ్యేవాద మార్గాన్ని అనుసరిస్తున్నారు. బిహార్ లో తమ బలాన్ని తగ్గించుకుని జేడీయూతో సర్దుబాటు చేసుకున్నారు. కారాలు మిరియాలు నూరుతున్న శివసేనతో మహారాష్ట్రలో సయోధ్య కుదుర్చుకున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ చిన్నాచితక పార్టీలతోనూ ఒక అవగాహనకు వచ్చేస్తున్నారు. ఇప్పటికి పన్నెండు పార్టీలతో విభేదాలకు సంబంధించిన సమస్యలు కొలిక్కి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.తమతో కలవడానికి ఇష్టపడని పార్టీలనూ దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఆయా పార్టీల బలహీనతలపై గురి పెడుతున్నారు. సామదానభేదోపాయాలను తెలివిగా ప్రయోగిస్తున్నారు. ఒత్తిడి పెంచుతున్నారు. తెలుగుదేశం తో తెగతెంపుల తర్వాత దక్షిణభారతంలో బలమైన మిత్రపక్షం లేకుండా పోయింది. అన్నాడీఎంకే ఆ స్థానాన్ని భర్తీ చేయాలని బీజేపీ నాయకత్వం నిర్దేశించుకుంది. తమకు నష్టం వాటిల్లుతుందని ఏఐఏడీఎంకే తొలుత చాలాకాలంపాటు సందేహించింది. అయితే ఆ నాయకత్వంపై కేంద్రదర్యాప్తు సంస్థల వద్ద ఉన్న కేసుల వివరాలను తవ్వి తీసి పరోక్షంగా పర్యవసానాలను గుర్తు చేసింది బీజేపీ. ఫలితంగా అన్నాడీఎంకే తల వంచాల్సి వచ్చింది. బీజేపీ ఇక్కడ అయిదుస్థానాలకే తన పొత్తును పరిమితం చేసుకున్నప్పటికీ మిగిలిన స్థానాల్లో పోటీ పడుతున్న ఏఐఏడీఎంకే కూడా బీజేపీకి సహకరించాల్సిందే. ముందస్తు పొత్తు కారణంగా ఇదంతా ఒక సంకీర్ణంగానే అధికారాన్ని క్లెయిం చేయాల్సి ఉంటుంది. నిజానికి ఏఐఏడీఎంకే చాలా బలహీనపడింది. అయితే పార్టీ శ్రేణులు, వ్యవస్థాగతమైన నిర్మాణం బలంగానే ఉన్నాయి. రజనీకాంత్ వంటివారిని పార్టీలోకి ఆకర్షించడం ద్వారా బీజేపీ సొంతంగా బలపడాలని చూసింది. అది ఫలించలేదు. డీఎంకేకు సైతం మైత్రీ సంకేతాలు పంపించినా ఫలించలేదు. దీంతో అన్నాడీఎంకే పైనే కమలం పార్టీ ఆధారపడాల్సి వచ్చింది. అన్నాడీఎంకే చిన్నాభిన్నమైన స్థితిలో ఉంది. నాయకత్వ బలహీనత ఉంది. ఎన్నికల తర్వాత గంపగుత్తగా పరిస్థితులు అనుకూలిస్తే అన్నాడీఎంకేను కలిపేసుకునేందుకూ బీజేపీ యత్నిస్తుందనే వాదన ఉంది.చిన్నపార్టీలతో సైతం పొత్తులు కదుర్చుకోవడానికి బీజేపీ రాజీ పడిపోతున్నట్లుగా పైకి కనిపిస్తుంది. కానీ ఇది ముందస్తు వ్యూహం లో భాగం. అనేక సర్వేలు వచ్చే ఎన్నికల్లో హంగ్ లోక్ సభ ఏర్పడుతుందని చాటి చెబుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు మూడు మార్గాలు ఉంటాయి. ఎన్నికలకు ముందుగా పొత్తు కుదుర్చుకున్న మెజార్టీ సంకీర్ణపక్షాన్ని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యంగా ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకున్న మెజార్టీ పక్షాన్ని పిలుస్తారు. మూడో ప్రాధాన్యంగా మెజార్టీ లేకపోయినప్పటికీ అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ముందుగానే పొత్తులు కుదుర్చుకుంటే బీజేపీకి మెజార్టీ లేకపోయినప్పటికీ సంకీర్ణ పక్షాల బలం ఎక్కువగా ఉంటే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. కాంగ్రెసు పార్టీ పొత్తుల ద్వారానే పోటీలోకి వెళుతోంది. అందువల్ల మెజార్టీ పక్షంగా ఆవిర్భవించేందుకు ఆస్కారం ఉంది. బీజేపీ పెద్ద పార్టీగా గెలిచినా కాంగ్రెసు మిత్రపక్షాల బలం ఎన్డీఏ కంటే ఎక్కువగా కనిపిస్తే వాటికే తొలి అవకాశం దక్కుతుంది. రెండు పక్షాలకూ దూరంగా ఉన్న పార్టీలను తమ కూటమిలోకి చేర్చుకునేందుకు అధికారం చేపట్టే పక్షానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనిని నిరోధించేందుకు గాను ముందస్తు పొత్తుల ద్వారా బలమైన కూటమిని ప్రజల ముందు పెట్టాలనేది బీజేపీ ఎత్తుగడ. అందుకే మోడీ, అమిత్ షాలు ఎక్కడికక్కడ పొత్తుల వ్యూహంతో విపక్షాలకు పొగ బెడుతున్నారు.
No comments:
Post a Comment