Breaking News

26/02/2019

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం మెరుపుదాడులు

న్యూఢిల్లీ ఫిబ్రవరి 26  ( way2newstv.in
ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు సమాచారం. వెంటనే గుర్తించిన భారత బలగాలు మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దాన్ని పేల్చివేశారు. గుజరాత్‌లోని కచ్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్‌ బేస్‌ సమీపంలో గుర్తించిన దీన్ని అక్కడి సిబ్బంది వెంటనే పేల్చివేశారు. ఈ ఎయిర్‌ బేస్ సరిహద్దు అతి సమీపంలో ఉంటుంది. ఇప్పటికే దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌లలో హైఅలర్ట్‌ ప్రకటించగా గుజరాత్‌లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
కాగా మూడేళ్ల క్రితం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది. 2016 సెప్టెంబరులో కశ్మీర్‌లోని ఉరి సైనిక శిబిరంపై ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనలో 19 మంది జవాన్లు అమరులయ్యారు. ఉరి దాడి జరిగిన 11 రోజుల తర్వాత భారత తొలిసారిగా సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి ముష్కరులను మట్టుబెట్టింది. 


పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం మెరుపుదాడులు

అయినా ఉగ్రవాదుల ఆగడాలు ఆగలేదు. ఇటీవల ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను బలితీసుకున్నారు. దీంతో ఈసారి భారత్‌ ఇంకాస్త గట్టిగా బదులిచ్చింది. ముష్కర మూకల కోరలు పీకేందుకు భారత్‌ పక్కా ప్రణాళిక రచించింది. పాక్‌ గగనతలంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు దిగింది. 2016 నాటి మెరుపుదాడులతో పోలిస్తే ఇది చాలా రెట్లు పెద్దది. 
2016లో కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనే భారత్‌ మెరుపుదాడులు చేపట్టింది. నేడు పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరంపై భారత వాయుసేన విరుచుకుపడింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఉగ్రవాదాన్ని అరికట్టాలని పాక్‌ను ఎన్నిసార్లు కోరినప్పటికీ ఆ దేశం పెడచెవిన పెడుతూ వస్తోంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి కూడా జైషే మహ్మద్‌ చేసిందే. పాకిస్థాన్‌ కేంద్రంగా జైషే గత కొన్నేళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తోంది. దాని ఆటకట్టించేందుకే భారత ఈ వ్యూహాన్నిఅమలుపర్చింది.
అప్పటి మెరుపుదాడిలో భారత జవాన్లు ఆయుధాలు, తుపాకులతో ముష్కరులను హతమార్చారు. ఆ దాడిలో దాదాపు 50 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కానీ, నేటి దాడికి భారీ ఆయుధాలను వినియోగించారు. అత్యాధునిక మిరాజ్‌ 2000 యుద్ధ విమానాల ద్వారా 1000 కిలోల బాంబులను ఉగ్ర స్థావరాలపై జార విడిచారు. దీంతో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు భారత్‌ చెబుతోంది.
పుల్వామా ఘటనతో భారత్‌, పాక్‌ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. తమ దేశంపై భారత్‌ దాడి చేయాలని చూస్తే ప్రతిదాడికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్  గట్టి హెచ్చరికలు చేసింది. ఈ హెచ్చరికలను పక్కనబెట్టి భారత్‌ వ్యూహాత్మకంగా మెరుపుదాడులకు దిగి జైషేకు బుద్ధిచెప్పింది.
ఇక భారత్‌ లక్ష్యంగా చేసుకున్న బాలాకోట్‌ ఉగ్ర స్థావరం జైషే మహ్మద్‌కు చెందిన అతిపెద్దది. జైషే అధినేత మసూద్‌ అజార్‌ బావమరిది మౌలానా యూసఫ్‌ అజార్‌ ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శిబిరంలో ఉగ్రవాదులకు ఆత్మాహుతి దాడిలో శిక్షణ ఇస్తుంటారు. తాజా దాడులతో వందల సంఖ్యలో ముష్కరులు హతమవడంతో జైషేకు ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

No comments:

Post a Comment