Breaking News

20/02/2019

నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాం

  షాద్ నగర్ లో క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం 
షాద్ నగర్, ఫిబ్రవరి 20(way2newstv.in): 
షాద్ నగర్ ప్రాంతంలో నేరాల సంఖ్య ను గణనీయంగా తగ్గిస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పేర్కొంటూ .. ఈ ప్రాంతంలో నేరాల సంఖ్యను తగ్గించే విధంగా పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగానే పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగిందన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇంకా ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో "నేను సైతం" అనే కార్యక్రమం ద్వారా చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. 


నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాం

ఇప్పటి వరకు 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ఈప్రాంతంలో 5000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పోలీస్ శాఖ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తారనే విశ్వాసం తమకు ఉందని ఆయన అన్నారు. గ్రేటర్ కమ్యూనిటీ ప్రాంతంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల శాంతిభద్రతలు దృడంగా ఉంటాయని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో కొన్ని చిన్న చిన్న నేరాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక క్రైమ్ పోలీస్ స్టేషన్ ను త్వరలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల క్రైమ్ రేటు తగ్గుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనితో కొంత ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. ఇన్స్పెక్టర్ వ్యవస్థతో  ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమం సజావుగానే కొనసాగుతుందని, దీనిని మరింత మెరుగు పరుస్తామని అన్నారు. ప్రజలకు ఆయా గ్రామాల్లో ట్రాఫిక్ పై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. హెల్మెట్ పెట్టుకోవడం, తాగి వాహనాలు నడపకూడదు అని ఆయన పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పై అవగాహన చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, మహిళా డి సి పి లతో పాటు షాద్ నగర్ ఏసిపి సురేందర్, ఇన్స్పెక్టర్లు శ్రీధర్ కుమార్, చంద్రశేఖర్, ట్రాఫిక్ సీఐ సునీల్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కేపి

No comments:

Post a Comment