చిత్తూరు, ఫిబ్రవరి 21, (way2newstv.in)
చిత్తూరు జిల్లాలో మూడు విడతల్లో మంజూరైన ఇందిరమ్మ గృహాల్లో 70,483 గృహ నిర్మాణాలను లబ్ధిదారులు చేపట్టలేకపోయారు.ఇందిరమ్మ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం దాని స్థానంలో ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని తీసుకొచ్చింది. 70,483 గృహాలను రద్దుచేసిన ప్రభుత్వం 2016–17 నుంచి 2019–20 వరకు నాలుగు విడతల్లో గ్రామీణ, పట్టణ, గ్రామీణ్ పథకాల ద్వారా 95,295 ఇళ్లు ఇచ్చింది. రద్దయిన ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించి ఉంటే పేదలకు ప్రయోజనం కలిగి అదనంగా పేదలకు ఇళ్లు దక్కేవి. 70,483 ఇళ్లను రద్దుచేసిన ప్రభుత్వం వీటికి అదనంగా 24,812 ఇళ్లను కలిపి 95,295 గృహాలను మంజూరు చేసింది.
ఇందిరమ్మ ఇళ్లే ఎన్టీఆర్ ఇళ్లు
పేదలు కావడంతో నిర్మాణాలు చేపట్టేందుకు జాప్యం చేశారు. గత ప్రభుత్వం వరకు ఈ గృహాలు అధికారికంగా మనుగడలోనే ఉన్నాయి. మంజూరైన వాటిలో ఇవి ఇంకా ప్రారంభం కాని గృహాల జాబితాలో ఉంచి లబ్ధిదారులు నిర్మాణాలను ఎప్పుడైనా చేపట్టే వీలు కల్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు. ఇందిరమ్మ పథకానికి రూపాయి విదల్చలేదు. ఫలితంగా జిల్లాలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. చేసిన ఖర్చంతా వృథా అయ్యింది. చివరకు ఈ ఇళ్లను ప్రారంభం కాని జాబితా నుంచి తొలగించి రద్దు చేశారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పక్కా గృహాలు కోల్పోయారు. కాగా ఇందిరమ్మ పథకంలో పునాదులు, గోడల స్థాయిలో జరిగిన ఇంటి నిర్మాణాలకు అప్పటి యూనిట్ విలువకు అదనంగా రూ.25వేలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల కూడా లబ్ధిదారులకు ప్రయోజనం లేదు. ఇందిరమ్మ పథకంలో పునాదుల స్థాయిలో 4,085 గృహాలు, గోడల స్థాయిలో 27,774 గృహాలు ఉండగా అందులో 11,238 గృహాలకు మాత్రమే అదనపు చెల్లింపులు వర్తింపజేశారు. మిగిలిన గృహాలు దీనావస్థలో అసంపూర్తిగా మిగిలిపోయాయి.ఇందిరమ్మ ఇళ్ల రద్దుతో గృహాల మంజూరుకు అవసరమైన పేదల సంఖ్య పెరిగింది. ఇళ్లకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మంజూరు కోసం ఎదురుచూస్తుంటే పల్స్ సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రజాప్రతినిధులకు కట్టబెట్టారు.
No comments:
Post a Comment