Breaking News

11/01/2020

మరాఠాలో రాజకీయాల్లో రివర్స్ పొత్తులు

ముంబై, జనవరి 11 (way2newstv.in)
మరాఠాలో రాజకీయాల్లో రివర్స్ పొత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ శివసేనను దెబ్బతీసేందుకు రెడీ అయిపోయింది. శివసేన నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా పార్టీని పెట్టుకున్న రాజ్ థాక్రేతో పొత్తుకు రెడీ అయిపోతోంది. ఈ మేరకు తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ లు సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.దాదాపు కొన్ని దశాబ్దాలుగా శివసేన, బీజేపీలు మంచి మిత్రులుగా కొనసాగారు. వివిధ ఎన్నికల్లో పొత్తులతో దిగి మంచి ఫలితాలను రాబట్టారు. 2014 ఎన్నికల్లో కలసి పోటీ చేయకపోయినా ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులు పెట్టుకుని శివసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మరాఠాలో రాజకీయాల్లో రివర్స్ పొత్తులు

2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి అత్యధిక స్థానాలను సాధించుకున్నాయి.అయితే 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టిన శివసేన చివరకు బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన తొలి నుంచి ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. రాజ్ థాక్రే నేతృత్వంలోని ఈ పార్టీ 2009లో తప్పించి ఆ తర్వాత ఎలాంటి ఫలితాలను రాబట్టలేకపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజ్ థాక్రే పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. దీంతో రాజ్ థాక్రే పార్టీని ప్రజలు ఆదరించడం లేదని అర్థమయిపోయింది. శివసేన, బీజేపీ జోడీ ముందు రాజ్ థాక్రే నిలవలేకపోయారు.కాని తాజాగా శివసేన తన దారి తాను చూసుకోవడంతో రాజ్ థాక్రేతో జట్టుకట్టడానికి బీజేపీ రెడీ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రాజ్ థాక్రే పార్టీ ప్రభావం చూపనుంది. రానున్న ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ, ఎంఎన్ఎస్ కలసి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్ల తెలుస్తోంది. ఇది ఒకరకంగా రాజ్ థాక్రేకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. బీజేపీ కూడా శివసేనను దెబ్బతీయడానికి రాజ్ థాక్రేను దగ్గరకు తీసుకుందంటున్నారు. మొత్తం మీద శివసేనను మహారాష్ట్రలో చెక్ పెట్టేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించిందనే అనుకోవాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment