Breaking News

22/01/2020

ఏపీసీఆర్డీయే చట్టం రద్దు పై హైకోర్టులో పిల్

హైదరాబాద్ జనవరి 22 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఏపీసీఆర్డీయే) చట్టం – 2014 ను రద్దు చేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఏపీ శాసనసభ ఆమోదించిన బిల్లును సస్పెండ్‌ చేయాలని అభ్యర్థిస్తూ విజయవాడకు చెందిన శీలం మురళీధర రెడ్డి ఒక పిల్ దాఖలు చేశారు. ఇదే కాకుండా మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.సీఆర్డీయే చట్టం-2014ను రద్దు చేస్తూ బిల్లు ప్రవేశ పెట్టడం చట్టవిరుద్ధమని, ఏక పక్షమని పిటిషనర్ శీలం మురళీధర రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా మరో మార్గాన్ని వెతుక్కోవడమంటే రాజధాని రైతుల న్యాయబద్ధమైన ఆకాంక్షను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. 
ఏపీసీఆర్డీయే చట్టం రద్దు పై హైకోర్టులో పిల్

ల్యాండ్‌పూలింగ్‌ స్కీమ్‌ కింద భూములిచ్చిన రైతులకు తగిన న్యాయం చేయాలని, రాజధానిలో నిలిపి వేసిన నిర్మాణ పనులను పునః ప్రారంభించాలని కోరారు.సీఆర్డీయే చట్టం రద్దుకు సంబంధించిన బిల్లు అమలు కాకుండా నిలుపుదల చేయాలని, ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన నిర్మాణాలను, పలు సంస్థల ఏర్పాటును తన పిటిషన్‌ లో ప్రస్తావించారు. గతంలో జరిగిన ఒప్పందం మేరకు రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి నేతృత్వం లోని ప్రభుత్వ యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, మంత్రివర్గం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. రాజధాని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. ప్రజా ధనంతో 50శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో సీఆర్డీయే చట్టం రద్దు చేయడం తగదన్నారు.

No comments:

Post a Comment