Breaking News

31/12/2019

యదేఛ్చగా ఇసుక దందా..!

వరంగల్, డిసెంబర్ 31, (way2newstv.in)
డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట మానేరు వాగులో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు అక్రమార్కులు దందా కొనసాగిస్తూ అందినకాడికి దండుకుంటూనే ఉన్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేసే నాథులే లేకుండా పోయారు. అధికారులు, సిబ్బంది కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జమ్మికుంట మండలం తనుగుల-శంభునిపల్లి గ్రామాల శివారు మానేరు వాగులోంచి ఇసుక రవాణా జాతరలా సాగుతున్నదని గ్రామస్తులుంటున్నారు. అసలు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల కోసం ఇసుక ఎంత అవసరం..? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జమ్మికుంట అర్బన్‌కు 500, రూరల్ గ్రామాలకు 559 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కూడా ఫైనల్ కాదు. మండలంలోని 18 గ్రామాల్లో అంకుశాపూర్‌లో 12, వావిలాలలో 71, యావరేజీగా 40 డబుల్ బెడ్రూంలకు పైబడి నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. 
యదేఛ్చగా ఇసుక దందా..!

అయితే ఎక్కడా పనులు మొదలు కాలేదు. ఇసుక డంపులు లేవు. ఇక జమ్మికుంట అర్బన్‌లో దాదాపు ఇళ్ల నిర్మాణం దగ్గర పడింది. ఒకవేళ అవసరమని అనుకున్నా.. ఇక్కడి ఇసుక కనుచూపు మేరలో కనపించడం లేదు. మిగిలిన రూరల్ గ్రామాల్లో కేవలం ఒక్క ధర్మారం శివారులో ఇసుక కుప్పలుగా పోశారు. మిగిలిన చోట ఎక్కడా లేదని తెలుస్తున్నది. ఇక ధర్మారం విషయానికి వస్తే.. ఇక్కడి 41 డబుల్ బెడ్‌రూం నిర్మాణాల కోసం 300 ట్రిప్పులకు పర్మిషన్ తీసుకున్నారని తాసిల్దార్ నారాయణ చెబుతున్నారు. ఒక్క ధర్మారం కోసం 300 తీసుకుంటే.. సరాసరి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల కోసం 12వేల ట్రిప్పుల ఇసుక అవసరం కానుంది. ఇంత ఇసుక ఎన్ని ఇండ్లకు సరిపోతుందో..? అధికారులు చెప్పాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లెక్కా.. పత్రం లేకుండా అక్రమార్కులను ప్రోత్సహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ట్రాక్టర్లకు సైతం అనుమతులిచ్చారు. ఇవి ఎక్కడ డంప్ చేస్తున్నాయో..? ఎవరికీ తెలియడంలేదు. అంతే కాకుండా రూ.కోట్లు పెట్టి వేసిన రోడ్లు తమకే సొంతం అన్నట్లుగా ఇసుక వాహనాలు నడుస్తున్నాయి. ఒక్కోసారి పాదచారుల పైకి వెళ్లేలా నడుపుతుండడంతో వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిత్యం మండలం దాటి వెళ్తున్న వాహనాలకు లెక్కే లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:

Post a Comment