విశాఖపట్టణం, డిసెంబర్ 31, (way2newstv.in)
వైసీపీకి ఏడు నెలల వయసు నిండింది ఈ ఏడు మాసాల్లో అన్ని వర్గాలను తనవైపు తిప్పుకొనేలా సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ విషయంలో కేంద్రం నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా.. రివర్స్ టెండర్ల విషయంలో ఎన్ని అవమానాలు విమర్శలు వచ్చినా ఆయన ముందుకే నడిచారు. ఇక, ఇప్పుడు అంత్యంత కీలకం, రాష్ట్రానికి ప్రాణ ప్రదం వంటి రాజధాని విషయంలోనూ ఆయన మడమ తిప్పేది లేదంటున్నారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని, చేసిన ప్రకటననే అమలు చేస్తానని ఆయన చెప్పుకొస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన విశాఖను పాలనా రాజధానిగా అసెంబ్లీలో చేసిన ప్రకటనను నిజం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల కల్పన సహా వివిధ పనుల కోసం ఆయన రు.1250 కోట్లను కేటాయించారు.
విశాఖలో జోష్ కనిపించడం లేదే
వీటికి సంబంధించిన పనులను కూడా సైలెంట్‌గా వెళ్లి శనివారం ప్రారంభోత్సవాలు చేసి వచ్చారు. దీంతో రాజధాని ఇక, అమరావతి కాదు.. విశాఖేననే విషయం చెప్పకనే జగన్ చెప్పారని సామాన్య ప్రజలకు కూడా అర్ధమవుతోంది. మరి ఇలా జగన్ వాయువేగంతో పనులు చేస్తూ.. నిర్ణయాలు తీసుకుంటే.. ఆయన పరివారం ఏం చేస్తున్నట్టు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.విశాఖ నగరానికి చుట్టూ ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో వాస్తవానికి టీడీపీ విజయం సాధించింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతున్న టీడీపీ.. నిన్న జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తే కనీసం నిరసన వ్యక్తం చేయకపోవడం గమనార్హం. టీడీపీ నేతలు పరోక్షంగా విశాఖ రాజధానికి జైకొట్టినట్టేనని ఈ పరిణామాలను గమనిస్తున్న నాయకులు అంటున్నారు. మరి అదేసమయంలో వైసీపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు. ప్రధానప్రతిపక్షం నుంచే ఎలాంటి నిరసనలు లేనప్పుడు వైసీపీ విశాఖ నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయారు? విశాఖ ఎంపీ వైసీపీ నాయకుడే అయినా కూడా ఆయన ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చింది లేదు.ఇక నగరంలో ఉన్న నాలుగు మినహా మిగిలిన నియోజకవర్గాలు వైసీపీ ఖాతాల్లోనే ఉన్నాయి. మరి వారి నుంచి ఎలాంటి హడావుడీ కనిపించడంలేదు. ఇక్కడ అమరావతి విషయాన్ని పరిశీలిస్తే.. గతంలో చంద్రబాబు రాజధానిని అమరావతిగా ప్రకటిస్తే.. వారాల తరబడి టీడీపీ నాయకులు పండగ జేసుకున్నారు. మరి ఆ తరహా ఊపు, ఉత్సాహం విశాఖలో కనిపించకపోవడం గమనార్హం. దీంతో అసలు వీరికి ఏమైంది? అనే చర్చ జోరుగా సాగుతోంది
No comments:
Post a Comment