Breaking News

16/12/2019

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ యూనివర్సిటీల్లో ఆందోళనలు

న్యూఢిల్లీ డిసెంబర్ 16 (way2newstv.in)
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా మిగతా యూనివర్సిటీల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని నద్వా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్సిటీ నుంచి బయటకు వచ్చేందుకు యత్నిస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు. యూనివర్సిటీ ప్రధాన గేట్‌ను పోలీసులు మూసేశారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసులపైకి రాళ్లు, చెప్పులు రువ్వారు విద్యార్థులు. పోలీసులు కూడా విద్యార్థులపైకి తిరిగి రాళ్లు రువ్వారు.
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ యూనివర్సిటీల్లో ఆందోళనలు

నద్వా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై లక్నో ఎస్పీ కళానిధి నైథాని మీడియాతో మాట్లాడారు. సుమారు 150 మంది విద్యార్థులు 30 సెకన్ల పాటు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. విద్యార్థులు తమ తరగతి గదుల్లోకి వెళ్లారని ఎస్పీ వెల్లడించారు.యూపీలోని అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలోనూ నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. యూపీలోని యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. డీజీపీ ఓపీ సింగ్‌ నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సీఎం సూచించారు.హైదరాబాద్‌లోని మౌలానా అజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. జామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని విద్యార్థులు స్పష్టం చేశారు.ముంబయిలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ విద్యార్థులు కూడా తమ తరగతులను బహిష్కరించారు. జామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలిపారు టాటా ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు. పౌరసత్వ సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల నిరసనకు కొంతమంది ప్రొఫెసర్లు కూడా మద్దతు పలికారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

No comments:

Post a Comment