Breaking News

20/11/2019

ని‘బంధనాలు‘ తో పత్తి ఆశలు

నిజామాబాద్, నవంబర్ 20, (way2newstv.in)
రాష్ట్రంలో పత్తిసాగు భారీగా పెరిగినా అకాల వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపించాయి. పత్తిని మార్కెట్‌‌కు  తీసుకువస్తే తేమ ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు వెనక్కి పంపుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా 306 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే.. 8 శాతంలోపు తేమ ఉన్న పత్తికే పూర్తి మద్దతు ధర చెల్లిస్తోంది. ఆపై తేమ శాతం ఉంటే క్వింటాలుకు పదిశాతం కోత విధిస్తోంది.12 శాతం తేమ మించితే అసలు కొనుగోలు చేయడం లేదు. దీంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే తేమ 12 శాతానికి పైగా ఉంటే.. రూ. 2 వేలు కూడా చెల్లించడం లేదు. కొన్ని ప్రాంతాల్లోనైతే పత్తి నల్లగా మారిందని చెప్పి రూ. 1200 మాత్రమే చెల్లిస్తున్నారు. 
ని‘బంధనాలు‘ తో పత్తి ఆశలు

దీంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగాల్సి వస్తోంది. రాస్తారోకోలు చేయాల్సి వస్తోంది.తీసుకొచ్చిన పత్తిని రైతులు తిరిగి తీసుకెళ్లరని వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే ధరను భారీగా తగ్గిస్తున్నారు.  రోజువారీ వేలం పాటలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తన్నారనే విమర్శలు ఉన్నాయి. రైతుల వద్ద పత్తి పంట ఉన్నప్పుడు ధర పెంచని వ్యాపారులు.. పంట విక్రయించిన తర్వాత చివరిలో  ధరను పెంచుతూ రావడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది.  దీంతో  రైతులు నష్టపోవాల్సి వస్తుండగా.. వ్యాపారులు లాభపడుతున్నారు.దున్నడం, విత్తనాల కొనుగోలు, విత్తనాలు నాటడం, కలుపు, గుంటకలు తిప్పడం, ఎరువులు, పురుగు మందులు, పత్తి ఏరడం వంటి పనుల కోసం ఎకరానికి రూ. 25 వేలకు పైగా రైతులు పెట్టుబడిపెట్టారు. ఈ సారి పలు చోట్ల బ్యాంకర్లు అప్పులివ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 2 నుంచి రూ. 5 వడ్డీకి అప్పులు తీసుకొచ్చి పంట సాగు చేపట్టారు. గులాబీ రంగు పురుగు ఉధృతి లేకపోవడంతో పత్తులు చాలా ఏపుగా ఎదిగాయి. చెట్టుకు వందకు పైగా పూత, కాత వచ్చింది. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. సెప్టెంబర్‌‌‌‌, అక్టోబర్‌‌‌‌ నెలల్లో ఎడతెరపిలేకుండా కురిసిన వానలతో పూత రాలింది. కాయలు మురిగిపోయాయి. పెద్దగా విచ్చుకోలేదు. నల్లగా మారిపోయాయి. కొన్ని కాయలు మాత్రం విచ్చుకొని పత్తి ఏరడానికి వీలైంది. రైతులు కూలీలతో పత్తి కాయలు తెంపి పత్తి వేరుచేయాల్సి వచ్చింది. ఇలా వేరు చేసిన పత్తి నల్లగా మారడంతో గాలికి ఆరబోయడం చేశారు. రెండు నెలల పాటు కురిసిన అకాల వర్షాల వల్ల  పత్తి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఎకరానికి 5 క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. నల్లగా మారిన పత్తి క్వింటాల్‌‌‌‌కు రూ. 2 వేలలోపే ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే రూ. 1200 వరకే చెల్లిస్తున్నారు. ఎకరానికి సుమారు 3 క్వింటాళ్ల నాణ్యమైన పత్తి, మిగతా 2 క్వింటాళ్లు నల్లగా మారిన పత్తి కావడంతో రైతులకు పెట్టుబడులు కూడా చేతికి అందడం లేదు.

No comments:

Post a Comment