Breaking News

20/11/2019

పంచాయితీల్లో కరెంట్ మోత

నల్లగొండ, నవంబర్ 20, (way2newstv.in)
పంచాయతీల్లో కరెంట్‌‌ బిల్లుల మోత మోగుతోంది. నెలనెలా వచ్చే బిల్లులో పెండింగ్ బిల్లుల వడ్డీని కలిపి వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల కరెంటు అసలు చార్జీకంటే ఈ వడ్డీయే ఎక్కువగా ఉంటోంది. స్ట్రీట్ లైట్లు, మంచినీటి బావుల్లో వాడే మోటార్లకు నెలనెలా వేలల్లో వచ్చే బిల్లులకు ఈ వడ్డీ తోడవడంతో సర్పంచ్లు ఆందోళన పడుతున్నరు. రాష్ట్రంలోని రెండు విద్యుత్‌‌ డిస్కమ్‌‌ అధికారులతో సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు చెల్లించాల్సిన సుమారు రూ.9,500 కోట్ల విద్యుత్‌‌ బిల్లులను ఆయా శాఖల బడ్జెట్‌‌ నుంచి వన్‌‌ టైం సెటిల్‌‌మెంట్‌‌ చేస్తామని సీఎం కేసీఆర్‌‌ గతంలో ప్రకటించారు. ఈ హామీ మేరకు పంచాయతీరాజ్‌‌ శాఖ నిధుల నుంచి ఒకేసారి బిల్లులు చెల్లిస్తే తమకు ఈ అడిషనల్‌‌ చార్జీల బాధ తప్పుతుందని సర్పంచ్‌‌లు చెబుతున్నారు.పంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిలపై విద్యుత్‌‌ శాఖ 18 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. 
పంచాయితీల్లో కరెంట్ మోత

వరంగల్‌‌ అర్బన్‌‌ జిల్లా ఐనవోలు మండలం ముల్కలగూడెం గ్రామ పంచాయతీలో అన్ని మీటర్లకు కలిపి నెలనెలా రూ.28 వేల నుంచి 30 వేల వరకు బిల్లు వస్తుండగా, మరో రూ.30 వేల దాకా వడ్డీ యాడ్‌‌ అవుతోంది. ఈ గ్రామంలో రూ.1.71 లక్షల బకాయి ఉన్న ఒక మీటర్‌‌కు నవంబర్‌‌ నెలలో వాడకం చార్జీలు రూ.774 రాగా, అడిషనల్‌‌ చార్జీలు(వడ్డీ) రూ.1,461 వచ్చాయి. అలాగే రూ.2.14 లక్షల బకాయి ఉన్న మరో మీటరుకు నెలనెలా రూ.2 వేల వడ్డీ వేస్తున్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పంచాయతీ పాలకవర్గాలు కరెంట్బిల్లు కట్టడం మానేశాయి. హామీ ఇచ్చిన సర్కారు కూడా ఈ విషయమే మరిచింది. ఫలితంగా రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. పంచాయతీ పాలకవర్గాలే కరెంట్ బిల్లులు కట్టుకోవాలని టీఆర్ఎస్ సర్కారు 2016లో ఆదేశాలు జారీ చేసింది. అయితే, అప్పటికే అన్ని పంచాయతీల్లో రూ.1,473 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కో గ్రామంలో సగటున రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా బకాయిలు ఉన్నాయి. మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఈ బకాయిలు రూ.2,570 కోట్లకు చేరాయి. కేంద్రం ఇచ్చే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి 30శాతం నిధులను బకాయిల చెల్లింపులకే కేటాయించాలని ప్రభుత్వంఆదేశించింది.

No comments:

Post a Comment