Breaking News

20/11/2019

హానీ ట్రాప్ లింక్ ఇష్యూలో కొత్త కోణాలు

హైద్రాబాద్, నవంబర్ 20, (way2newstv.in)
మన మిలటరీపై పాకిస్థాన్ హనీట్రాప్ విషయంలో కొత్త విషయం వెలుగు చూసింది. ఆ హనీట్రాప్ వయా హైదరాబాద్ నుంచే జరుగుతోందని తేలింది. పాకిస్థాన్ నుంచి వచ్చే కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చి చూపిస్తున్నరు కొందరు వ్యక్తులు. దానికి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ- విదేశాల నుంచి వచ్చే కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చే కాల్ డైవర్ట్ చేసేది) సెంటర్ముసుగులోచేస్తున్నరు. చాంద్రాయణగుట్టలోని ఇస్మాయిల్ నగర్లో ఉన్న వీవోఐపీ సెంటర్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేయడంతో ఇక్కడి నుంచే సైనికులను హనీ ట్రాప్ చేస్తున్నారన్న సంగతి బయటకొచ్చింది. పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ సెంటర్ ఓనర్ పరారవడంతో అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
హానీ ట్రాప్ లింక్ ఇష్యూలో కొత్త కోణాలు

ఇటీవలి కాలంలో అమ్మాయిలతో మాట్లాడిస్తూ సైనికులను, ఆర్మీ అధికారులను హనీట్రాప్ చేస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో కామెంట్తో మాట కలిపే మాయలేడీలు, చనువు పెంచుకుని నేరుగా ఫోన్లో మాట్లాడేవరకు వెళ్లిపోతున్నారు. కాల్స్, మెసేజ్లు, వాట్సాప్ చాటింగ్లను అడ్డుపెట్టుకుని అత్యంత సీక్రెట్గా ఉంచాల్సిన సమాచారాన్ని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ ఆ కాల్స్ చేయిస్తోందన్న విషయం అప్పటిదాకా తెలియలేదు. ఇప్పుడు లోకల్ కాల్స్గా వస్తున్న ఆ ఫోన్లు హైదరాబాద్ నుంచే వస్తున్నాయని తేలడంతో హనీట్రాప్లోని కొత్త కోణం బయటపడింది. మిలటరీలోని పై స్థాయి అధికారుల ఫోన్ నంబర్లు అత్యంత రహస్యంగా ఉంటాయి. అలాంటిది ఇద్దరు అధికారులకు ఇటీవల తరచూ కొత్త వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎవరో తెలుసుకోవాలని తిరిగి వేరే నంబర్లతో ఆ ఫోన్లకు కాల్ చేశారు. కానీ, అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో లోలోపలే దర్యాప్తు చేశారు. చివరికి ఆ ఫోన్లు వస్తున్నది హైదరాబాద్ నుంచి అని తెలుసుకున్నారు. వాటి సంగతేంటో తేల్చాలని హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారంతో మిలటరీ ఇంటెలిజెన్స్, సిటీ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ నంబర్లు, ఐపీ అడ్రస్ ఆధారంగా చాంద్రాయణ గుట్ట పరిధిలోని ఇస్మాయిల్ నగర్ నుంచి ఫోన్లు వచ్చినట్టు గుర్తించారు. అయితే, అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తే, ఆ కాల్స్ వచ్చింది ఇక్కడి నుంచి కాదు, పాకిస్థాన్ నుంచి అని తేలింది. అక్కడి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ను డైవర్ట్ చేసి లోకల్ కాల్స్గా మార్చారని తేల్చారు. అందుకోసం వీవోఐపీ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. రహస్యంగా ఉండే మిలటరీ అధికారుల వ్యక్తిగత నంబర్లకు ఫోన్లు రావడంతో, టెర్రరిస్టుల కుట్ర కోణంలో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కాల్డైవర్టింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ అక్బర్ అనే వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఆ వీవోఐపీ సెంటర్ నుంచి భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, సిమ్ కార్డులు, సిమ్ బాక్సులతో పాటు ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.ఇలాంటి వీవోఐపీ సెంటర్లు అక్కడ ఒక్కచోటే కాదు, పాతబస్తీలో చాలా చోట్ల ఉన్నాయి. కాల్ డైవర్షన్ ఘటనలూ జరిగాయి. ఈ ఏడాది మే 20న ఫలక్నుమా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. జహనుమాకు చెందిన మహ్మద్ అంజద్ ఖాన్ , యూసుఫ్ హసన్లను అదుపులోకి తీసుకున్నారు. ఆరేళ్లుగా జహనుమాలో వీవోఐపీ సెంటర్ను నడుపుతున్న అంజద్ ఖాన్, అడ్డాను కాలాపత్తర్కు మార్చాడు. జహనుమాలో ఫ్లాట్, కాలాపత్తర్లో పెంట్హౌస్ తీసుకుని సెంటర్ను నడుపుతున్నాడు. స్థానికంగా ఉండే రిటైల్ వ్యాపారి అయిన యూసుఫ్ హసన్ నుంచి 144 సిమ్కార్డులను కొనుగోలు చేశాడు. ఇంటర్నేషనల్ కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చేందుకు అవసరమైన టెక్నాలజీని, 8 సిమ్కార్డు బాక్సులను చైనా నుంచి కొన్నాడు. బ్రిటన్, అమెరికా, సౌదీ నుంచి వచ్చే కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చి సొమ్ము చేసుకునేవాడు. అక్కడి నుంచి ఐఎస్డీ (ఇంటర్నేషనల్ సబ్స్క్రైబర్ డయలింగ్) కాల్స్ ఎక్కువగా వెళ్తుండడంతో టెలికాం సెక్యూరిటీ వింగ్ నిఘా పెట్టింది. ఇక్కడి నుంచి కాల్ డైవర్షన్ ఎక్కువగా జరుగుతున్నాయని, లోకల్ కాల్స్గా మారుస్తున్నారని గుర్తించిన అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజద్ ఖాన్ వీవోఐపీ సెంటర్పై దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment