విజయవాడ, నవంబర్ 5 (way2newstv.in)
వల్లభనేని వంశీ పార్టీని వీడటం ఏమో గాని కృష్ణా జిల్లా తెలుగుదేశంపార్టీలో వర్గ విభేదాలు మరింత ముదురుతున్నాయి. వల్లభనేని వంశీని వదులుకోవడం ఇష్టం లేని టీడీపీ అధినేత చంద్రబాబు నేటికీ వంశీ వద్దకు తమ పార్టీ నేతలను పంపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజగా గన్నవరం నియోజవర్గంలో వంశీ వర్గీయులు సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. వల్లభనేని వంశీ పార్టీని వీడింది వైసీపీ వేధింపుల వల్ల కాదట. సొంత పార్టీ నేత వ్యవహారశైలి ముదరడం వల్లనేనట. ఇప్పుడు ఈ ప్రచారం గన్నవరం నియోజకవర్గంలో ఊపందుకుంది.గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఉమా మెడకు వల్లభనేని ఇష్యూ
అయితే వల్లభనేని వంశీపై అక్రమ కేసులు బనాయించడం వల్లనే ఆయన వత్తిడిని తట్టుకోలేక పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని ప్రతి సమావేశంలో చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వల్లభనేని వంశీ వద్దకు ఎంపీ కేశినేని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు చర్చల కోసం వెళ్లిన సంగతి తెలిసిందేఈ చర్చల్లో తనను టీడీపీ నేతలే ఇబ్బంది పెట్టారని వల్లభనేని వంశీ వారి ఎదుట కుండబద్దలు కొట్టారట. అందులో ముఖ్యంగా వల్లభనేని వంశీ తనను దేవినేని ఉమ టార్గెట్ చేశారని కేశినేని నానికి చెప్పారని తెలుస్తోంది. గత ఐదేళ్లు మంత్రిగా ఉండి దేవినేని ఉమ తన నియోజకవర్గంలో పార్టీలోనే మరో గ్రూపు సృష్టించారని వల్లభనేని వంశీ బరస్ట్ అయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కేశినేని నాని నివేదిక రూపంలో చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం.వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీ ఇరకాటంలో పడ ప్రమాదముందంటున్నారు. చంద్రబాబుపై వల్లమాలిన అభిమానం చూపిస్తూనే వంశీ దేవినేని ఉమ పేరును బయటపెట్టడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. టీడీపీలో దేవినేని ఉమ బాధితులంతా రావాలని సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఉమ అనుచరులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా దేవినేని ఉమ మాత్రమే పార్టీ కార్యక్రమాలు చేపట్టారని, అటువంటి నేతపై నిందలు మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద వల్లభనేని వంశీ వ్యవహారం ఉమకు తలనొప్పిగా మారింది
No comments:
Post a Comment