Breaking News

15/10/2019

కేసీఆర్ తగ్గక తప్పని పరిస్థితి

హైద్రాబాద్, అక్టోబరు 15 (way2newstv.in)
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెపై కార్మికులు నెలరోజుల ముందే నోటీసులిచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె మొదలుపెట్టారు ఆర్టీసీ జేఏసీ. అంతకు ముందు రెండుసార్లు చర్చలు జరిగినా అందులో ఎటువంటి పురోగతి లేదు. కేసీఆర్ సైతం భీష్మించుకు కూర్చున్నారు. మరో వైపు రోజు రోజుకు ఆర్టీసీ కార్మికులకు మద్దతు పెరుగుతోంది. దీంతో సర్కార్ వ్యూహం మారుస్తున్నట్లు తెలుస్తోంది.అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు ప్రభుత్వం మెట్టుదిగని పరిస్థితి నెలకొంది. సమ్మె జరిగి పదిరోజులు కావస్తోంది. ప్రజలు మాత్రం బస్సులు లేక నరకయాతన పడుతున్నారు. ప్రైవేటు దోపిడీతో సర్కార్ పై వ్యతిరేకత పెరుగుతోంది. సమ్మెపై చర్చలు జరిగితే… సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశలు ఉండేవి. 
కేసీఆర్ తగ్గక తప్పని పరిస్థితి

ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల మధ్య చర్చలే లేవు. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి. సకల జనుల సమ్మె తరహాలో జేఏసీ రెండు రోజులకోమారు షెడ్యూల్ ప్రకటిస్తూ సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసు కున్నారు. మరోకరు ఆత్మహత్యా యత్నంచేసుకున్నారు. విపక్షాలు, వివిధ సంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలుకుతున్నాయి. దీంతో రోజు రోజుకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది.ఓ వైపు సర్కార్ కు హుజూర్ నగర్ ఉప ఎన్నిక కత్తిమీద సామైంది. ఇంకో వైపు ఆర్టీసీ సమ్మె వల్ల ఎన్నికల్లో మద్దతు తెలిపిన సిపిఐ కూడా మద్దతు ఇచ్చేందుకు మళ్లీ పునరాలోచిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం, కార్మికుల మధ్య చర్చల కోసం సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను బుజ్జగించేలా టీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావును రంగంలోకి దింపినట్లు సమాచారం. సమ్మెను ఆపేయాలని ఆత్మహత్యలతో ఏమి కాదని, సమ్మె ఆపి చర్చలకు రావాలని ఆయన కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకే ప్రకటనలో చర్చల అంశం ఉండటంతో సీఎం కేసీఆరే వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది..కేకే వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ సైతం ఆహ్వానించింది. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ సైతం పేర్కొంది. దీంతో మరో సారి సర్కార్ కు, ఆర్టీసీ కార్మికుల మధ్య చర్యలు జరిగే వాతావరణం కనిపిస్తోంది. డిమాండ్లు ఎలా ఉన్నా ఒకసారి కేశవరావు జేఏసీ నాయకులతో చర్చలు జరిపితే పరిస్థితి ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదని ప్రస్తుత వాతావరణాన్ని బట్టి తెలుస్తోంది. కేశవరావు జోక్యం చేసుకుని ఈ సమ్మెను విరమింపజేయగలరాననే ఉత్కంఠ రేపుతోంది

No comments:

Post a Comment