Breaking News

18/10/2019

కామెడీ హార్రార్ గా రాజుగారి గది

హైద్రాబాద్, అక్టోబరు 18, (way2newstv.in)
తెలుగులో హారర్ కామెడీ జోనర్‌లో రూపొందిన రాజుగారి గది సిరీస్ చిత్రాలు చక్కటి వసూళ్లను సాధించాయి. ఈ సినిమాలతో దర్శకుడిగా ఓంకార్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తనకు అచ్చొచ్చిన ఈ ఫార్ములాను మరోసారి అనుసరిస్తూ రాజుగారి గది-3 చిత్రాన్ని తెరకెక్కించారాయన. తన తమ్ముడు అశ్విన్ హీరోగా స్వీయ నిర్మాణంలో ఓంకార్ రూపొందించిన చిత్రమిది. తొలుత ఈ సినిమాలో తమన్నాను కథానాయికగా తీసుకున్నారు దర్శకుడు. అనివార్య కారణాల వల్ల ఆమె స్థానాన్ని అవికాగోర్‌తో భర్తిచేశారు. కథానాయిక మార్పులు సినిమాకు కలిసివచ్చాయా?గత భాగాలకు మించిన వినోదంతో తెరకెక్కిన చిత్రమిదంటూ ప్రచార వేడుకల్లో ఓంకార్ బృందం చెప్పిన మాటలు ఎంతవరకు నిజమయ్యాయి? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..అశ్విన్(అశ్విన్) ఓ అనాథ. ఆటో నడుపుతూ జీవిస్తుంటాడు. బరువు బాధ్యతలు లేకుండా మామయ్యతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు.
 కామెడీ హార్రార్ గా రాజుగారి గది

మాయ(అవికాగోర్) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఫిజియెథెరఫిస్ట్‌గా పనిచేస్తుంటుంది. మాయకు ఐలవ్‌యూ చెప్పిన వారందరిని ఓ దయ్యం చంపడానికి ప్రయత్నిస్తుంటుంది. మాయమంచితనానికి ముగ్ధుడైన అశ్విన్ ఆమెను ప్రేమిస్తాడు. మాయకు అశ్విన్ తన ప్రేమను వ్యక్తం చేసిన ప్రతిసారి దయ్యం అశ్విన్‌పై దాడిచేస్తుంటుంది. మాయను వెంటాడుతున్న ఆత్మకు కారణం ఆమె తండ్రి గరుడపిైళ్లె(అజయ్‌ఘోష్) అని భ్రమపడిన అశ్విన్ అతడి కోసం కేరళ వెళతాడు. చివరకు యక్షి అనే ప్రేతాత్మ మాయకు రక్షణగా ఉందనే నిజం తెలుసుకుంటాడు. ఆ దయ్యం బారి నుంచి మాయను అశ్విన్ ఎలా రక్షించాడు? దైవశక్తి సహాయంతో యక్షిపై ఎలా విజయం సాధించాడు?మాయను యక్షి ఎందుకు వెంటాడుతుంటుంది? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.హారర్ సినిమాలన్నీ చాలావరకు హీరోయిన్‌ను వెంటాడే ఆత్మ, ఓ పాడు బడిన బంగళా, సామాన్యుడైన హీరో భయానకమైన ఆత్మ వెనుక ఉన్న చిక్కుముడి విప్పడం..రొటీన్ ఫార్ములాలోనే సాగుతాయి. రాజుగారిగది-3 అదే దారిలో నడించింది. రెగ్యులర్ హారర్ కథకు వినోదం, మాస్ హంగులను మేళవించి ఓంకార్ ఈ సినిమాను తెరకెక్కించారు. మలుపులు, లాజిక్‌లను పక్కనపెట్టి పూర్తిగా ప్రేక్షకుల్ని నవ్వించడంపైనే దృష్టిపెట్టారు. ఈ ప్రయత్నంలో కొన్ని చోట్ల ఓంకార్ సక్సెస్ అయ్యారు.ఫస్టాఫ్ మొత్తం అశ్విన్, అలీ పాత్రల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగుతుంది. వారి కారణంగా శివశంకర్‌మాస్టర్, బ్రహ్మజీ బృందం పడే ఇక్కట్ల పేరుతో జబర్ధస్త్ స్ఫూర్తితో రాసుకున్న కామెడీ కొన్ని చోట్ల బాగానే పేలింది. మాయను వెంటాడే దయ్యం సంగతి తేల్చడానికి అశ్విన్ కేరళలో అడుగుపెట్టడంతో కథ సీరియస్ టర్న్ తీసుకుంటుందని భావించిన ప్రేక్షకుల ఊహల్ని తలకిందులు చేస్తూ పాడుబడ్డ మహాల్‌లో దయ్యాల కారణంగా అశ్విన్‌తో అజయ్‌ఘోష్, అలీ, ఊర్వశి, ధన్‌రాజ్ పడే పాట్లతో పూర్తి వినోదాత్మక పంథాలో ద్వితీయార్థాన్ని నడిపించారు. తనను చంపడానికి వచ్చిన దయ్యానికి చాక్లెట్ యాడ్ వినిపించడం, హీరోల పేరడీ డైలాగ్‌లో దయ్యాలను భయపెట్టడం ఇలా లాజిక్‌లతో సంబంధం లేకుండా సాగే ఆ సన్నివేశాలన్నీ నవ్వించాయి.రాజుగారి గది ఇదివరకు భాగాల్లో ఏదో ఒక సందేశాన్ని అంతర్లీనంగా ఆవిష్కరిస్తూ వచ్చిన ఓంకార్ ఈ సారి మాత్రం పూర్తిగా కామెడీని నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించారు. తమ్ముడు అశ్విన్‌ను మాస్ హీరోగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఓంకార్ ఈ కథను రాసుకున్న భావన కలుగుతుంది. స్టార్ హీరోల తరహాలో అతడిని చూపించారు. మాయ, అశ్విన్‌ల ప్రేమకథను మరింత బలంగా ఆవిష్కరిస్తే బాగుండేది. వారి మధ్య ప్రేమ చిగురించడానికి కారణలేవి కనిపించవు. దయ్యం కారణంగా అశ్విన్ బృందం భయపడే సన్నివేశాల్లో కొన్ని చోట్ల దర్శకుడు అడల్ట్ కామెడీని ఆశ్రయించారు. అవన్నీ కొంచెం అతిశయంగా అనిపిస్తాయి. ప్రాణాలకు తెగించి పాడుబడిన మహాల్‌లో అడుగుపెట్టాలని, ప్రతి అడుగులో ప్రమాదం పొంచి ఉంటుందని ఓ పాత్ర ద్వారా హీరోకు చెప్పించిన దర్శకుడు ఆ సన్నివేశాలన్ని పూర్తి వినోదంగా తెరకెక్కించాడు. కథలో ఎక్కడ సీరియస్‌నెస్ కనిపించదు. దయ్యం పాత్రల మేకప్ జుగుప్సాకరంగా ఉంది.అశ్విన్ గత సినిమాలతో పోలిస్తే నటుడిగా పరిణితి కనబరిచాడు. డ్యాన్సుల్లో ప్రతిభనుకనబరిచాడు. అవికాగోర్ తొలిసారి నటించిన హారర్ సినిమా ఇది. ఆమె అభినయప్రతిభను చాటే సన్నివేశాలేవీ సినిమాలో కనిపించవు. పతాక ఘట్టాల్లో దయ్యంగా కొంత ఆకట్టుకుంటుంది. అజయ్‌ఘోష్, అలీ, ఊర్వశి కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పతాక ఘట్టాల ముందు వచ్చే ఎపిసోడ్ చివరి అరగంట హిలేరయస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.ఛోటా కె నాయుడు ఛాయాగ్రహణం హారర్ సినిమాలోని డార్క్ మూడ్‌ను ఎలివేట్ చేయడానికి దోహదపడింది. షబ్బీర్ నేపథ్య సంగీతం పర్వాలేదనిపించింది. నిర్మాతగా తాను రాసుకున్న కథకు న్యాయం చేయడానికి నిర్మాణ పరంగా ఎక్కడ రాజీపడలేదు ఓంకార్.హారర్ కామెడీ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు టైమ్‌పాస్‌ను పంచే చిత్రమిది. రెగ్యులర్ హారర్ జోనర్ సినిమాలను చూసే ఆడియన్స్‌నే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. సొంత నిర్మాణంలో ఓంకార్ నిర్మించిన ఈ చిత్రం బీ, సీ సెంటర్స్‌లో వసూళ్లను సాధించే అవకాశం వుంది.పరిమిత వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించడం వల్ల కమర్షియల్‌గా సేఫ్‌జోన్‌లోకి వెళ్లే అవకాశం వుంది.

No comments:

Post a Comment