Breaking News

23/10/2019

ఇళ్లు సరే.. సౌకర్యాలేవీ..? (మెదక్)

మెదక్, అక్టోబర్ 23 (way2newstv.in): 
పెద్దఎత్తున ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో మాత్రం ముందు చూపుతో వ్యవహరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్న తరుణంలో కనీస వసతులు లేక ఆలోచించాల్సి వస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతుండటంతో సొంతింటి కల నెరవేరనుందన్న ఆశ లబ్ధిదారుల్లో నెలకొనగా, మౌలిక వసతుల కొరతతో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత గూడు లేని వారి కల సాకారం చేసేందుకు తెరాస ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేసింది. 
ఇళ్లు సరే.. సౌకర్యాలేవీ..? (మెదక్)

అనంతరం ఇల్లు లేని వారి వివరాలను సేకరించి నియోజకవర్గాల వారీగా ఇళ్ల సముదాయాలను నిర్మిస్తోంది. అందుకు ఒక్కో ఇంటికి రూ.5.18 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. కొన్నిచోట్ల ఇండిపెండెంట్‌ ఇళ్లు నిర్మిస్తుండగా చాలా చోట్ల రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోక మొదట్లో గుత్తేదారులు ముందుకు రాలేదు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకు సిమెంట్‌ ఇప్పించడంతో పలువురు ముందుకు వచ్చారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన చోట మౌలిక వసతులు కల్పించే పనులు సైతం అప్పగిస్తామని పాలనాధికారి హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసి పనులు సొంతం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించారు. ప్రభుత్వం జిల్లాకు 5,514 ఇళ్లను మంజూరు చేసింది. అందులో మెదక్‌ నియోజకవర్గంలో 1,726, నర్సాపూర్‌ నియోజకవర్గంలో 709, గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మనోహరాబాద్‌, తూప్రాన్‌ మండలాల్లో 683, దుబ్బాక నియోజకవర్గ పరిధిలో చేగుంట, నార్సింగి మండలాల్లో కలిపి 176, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గం పెద్దశంకరంపేటలో 20 ఇళ్ల నిర్మాణాల పనులు చేపట్టారు. ఇందులో వెల్దుర్తి పట్టణంలో 30, శివ్వంపేట మండలం దంతాన్‌పల్లిలో 30, చేగుంట మండలం బి.కొండాపూర్‌లో 30 ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణ పరిధి పిల్లికొట్టాల్‌లో 700 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా ఒకటి, రెండు నెలల్లో 200 ఇళ్లు సిద్ధం కానున్నాయి. నర్సాపూర్‌ పట్టణంలో సైతం రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో రెండు పడకగదుల ఇళ్ల పనులు చివరి దశకు చేరుతున్నా వాటిల్లో మౌలిక వసతుల జాడ కనిపించడం లేదు. ఇళ్లను మాత్రమే నిర్మిస్తుండగా సదుపాయాల మాట మరిచారు. వెల్దుర్తి, శివ్వంపేట, చేగుంట మండలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా వసతులు మాత్రం పూజ్యం. ఆయా చోట్ల నల్లాలు, సీసీ రహదారులు, విద్యుత్తు కనెక్షన్లు లేవు. మెదక్‌ పట్టణ పరిధి పిల్లికొట్టాల్‌లో విద్యుత్తు పనులు చేపట్టారు. ఇళ్లలో నుంచి వచ్చే మురుగు బయటకు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేసినా సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మించలేదు. జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో  మౌలిక వసతుల కల్పనకు రూ.42.22 కోట్లు అవసరమని గుర్తించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం స్పందించి ఆ నిధులు మంజూరు చేస్తేనే ఆయా చోట్ల వసతులు సమకూరనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా ప్రజా ప్రతినిధులు చొరవ చూపితే తప్ప నిధులు మంజూరు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

No comments:

Post a Comment