ఏలూరు, అక్టోబరు 23 (way2newstv.in)
చింతమనేని ప్రభాకర్ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు టీడీపీ హయాంలో నిత్యం వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఆయన, నెలరోజులుగా జైలుకే పరిమితమవ్వడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బెయిల్ ఇచ్చేలోపే మరో కేసులో జైలు పాలవుతున్నాడు. ఇలా కోర్టు-జైలు, చుట్టూ తిరుగుతుండటం చూసేవారికి చింతమనేని బయటకు వచ్చేనా అనే సందేహం కలుగుతోందట. అయితే కటకటాల వెనకున్న చింతమనేనికి, ఈ జైలు బాధలోనూ మరో బాధ మరింత బాధపెడుతోందట. ఇంతకీ ఏంటా బాధ....ఎవరిపైన ఆ బాధ..? నిను వీడని నీడను నేను అంటూ, మరుగునపడిపోయిన కేసులన్నీ, కొత్త శక్తితో చింతమనేని ప్రభాకర్‌ను వెంటాడుతున్నాయి.
చింతమనేనికి కేసుల టెన్షన్..
ఎన్ని కేసులున్నా చంద్రబాబు హయాంలో ఆడుతూ పాడుతూ, తనకు తిరుగులేదు బెదురులేదు అన్నట్టుగా తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి, వైసీపీ హయాంలో మాత్రం చుక్కలు కనపడుతున్నాయి. కేసు మీద కేసు, జైలు తర్వాత జైలు, ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, ఇలాంటి బాధాకరమైన టైంలో, పార్టీ అండ ఆశించినంతగా లేదని మరింతగా కుమిలిపోతున్నారట చింతమనేని. చింతమనేని ప్రభాకర్ పై కేసుల పర్వం కొనసాగుతూనే వుంది. అనేక కేసులు, ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 11న అరెస్ట్ చేసిన పోలీసులు ఒకటి తర్వాత మరో కేసును బయటకు తీస్తూ, నెలరోజులుగా చింతమనేనిని జైల్లోనే ఉంచారు. తాజాగా మరో 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలు నుంచి కోర్టుకు వచ్చిన చింతమనేని, మళ్లీ జైలుకే వెళ్లారు. అట్రాసిటీ కేసులు ఓ వైపు, అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు మరోవైపు, ఇలా అన్ని రకాల కేసులను తిరగదోడుతూ జైలు జీవితానికే పరిమితం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు చింతమనేని అరెస్ట్ ను ఖండిస్తూ, వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూనే ఉన్నా, కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. మొత్తం ఐదు కేసుల్లో రిమాండ్‌లో ఉన్న చింతమనేని ప్రభాకర్‌కు అక్టోబర్ 9వ తేదీతో రిమాండ్ పూర్తవడంతో, ఆయన బెయిల్ పై బయటకు వస్తారని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు ఆశించారు. జిల్లా జైలుకు భారీగా చేరుకున్న అభిమానుల మధ్య పోలీసులు మరోసారి జైలులోనే పీటీ వారెంట్ పై అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు. అప్పటికే సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 9 వరకూ నెలరోజులుగా ఏలూరులో జైలులోనే ఉన్న చింతమనేని ప్రభాకర్ పై, మరో కేసులో కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇంకో కేసులో, అక్టోబర్ 23 వరకూ రిమాండ్ విధించింది కోర్టు. ఇలా ఒక కేసు తర్వాత మరో కేసులో జైలుకు పంపుతుండటంతో చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి బయటకు వస్తారా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దెందులూరు నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లతో పాటు ఆయన అనుచరుల్లో కూడా ఇదే ఆందోళన కలవరపెడుతోంది. దెందులూరు నియోజకవర్గంలో పదేళ్లుగా తిరుగులేని నేతగా ఎదిగిన చింతమనేని వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ఆయన ఇరుక్కున్న వివాదాలన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. దాదాపు 66 కేసుల్లో చింతమనేని నిందితుడిగా ఉన్నారని, 22 కేసులకు పైగా దర్యాప్తు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ ఒకవైపు చెబుతుండటం, పోలీసులకు చింతమనేనిపై అక్రమ కేసులు మోపాల్సిన అవసరం లేదని సాక్షాత్తూ ఏలూరు రేంజ్ డిఐజీ ఎఎస్ ఖాన్ ప్రకటన ఇవ్వడం చింతమనేనిపై పోలీసులు చూపుతున్న శ్రద్ధను చెబుతోంది. అయితే, కేవలం బాధితులకు న్యాయం చేయడం కోసమే తామున్నామంటున్న పోలీసులు ఓ వైపు, కక్ష సాధింపు చర్యలే అంటున్న టీడీపీ నేతలు మరోవైపు, మాటల యుద్ధం కొనసాగుతుండడంతో చింతమనేని జైలు నుంచి బయటకు వచ్చేదెప్పుడు...? అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగులుతోంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్లు సైతం, తనను పెద్దగా పట్టించుకోవడం లేదని చింతమనేని తన అనుచరులతో రగిలిపోయారట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ, దూరం జరిగినట్టు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారట. అయితే చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలంటుంటే, కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి కేసు మీద కేసు, రిమాండ్ మీద రిమాండ్‌తో జైలుకే పరిమితమవుతున్న చింతమనేని, ఎప్పడు రిలీజ్ అవుతారో, ఎన్నాళ్లు జైలు గోడలకే పరిమితమవుతారోనని, చింతమేనని అనుచరులు దిగాలు చెందుతున్నారట.
No comments:
Post a Comment