తిరుపతి ఆగస్టు 23,(way2newstv.in - Swamy Naidu):
వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్కుమార్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్ముడని, శ్రావణమాసం కృష్ణ పక్షం అష్టమి తిథినాడు శ్రీకృష్ణుడు జన్మించాడని తెలిపారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని హిందువులు కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి పేర్లతో పర్వదినంగా జరుపుకుంటారని, వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారని వివరించారు.
గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం - టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఎస్వీ గోశాలలో ఘనంగా గోకులాష్టమి 'గోపూజ'
భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందన్నారు.తిరుమల, తిరుపతి. తిరుచానూరు, పలమనేరులలో 2991 గోవులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో దాదాపు 39 రకాల దేశవాళీ గోవుల జాతులు ఉన్నాయని, వీటిని సంరక్షించి వ్యాప్తి చేసేందుకు విశేషకృషి జరుగుతోందన్నారు. పలమనేరులో ఆధునిక వసతులతో 450 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేస్తున్నామని, రూ.40.77 కోట్లతో గోశాలల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడి గోశాల నుండి తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర టిటిడి అనుబంధ ఆలయాలకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలియజేశారు.అంతకుముందు ప్రభుత్వ విప్ మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టిటిడి గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. గోశాలలో కనుమ పండుగ రోజున, గోకులాష్టమి గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్వీ గోశాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా గోపూజ మహోత్సవంలో భాగంగా ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర గో మందిరంలో టిటిడి ఛైర్మన్ గో పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, వేణుగానం, ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తనాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పిడబ్ల్యు విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
No comments:
Post a Comment