Breaking News

21/08/2019

టీ కాంగ్రెస్ లో హూజూరు నగర్ లొల్లి

హైద్రాబాద్, ఆగస్టు 21, (way2newstv.in)
తెలంగాణ కాంగ్రెస్‌లో మ‌రోసారి టికెట్ రాజ‌కీయ ర‌గులుకుంటోంది! అదేంటి? నిన్న గాక మొన్ననే క‌దా? ఎన్నిక‌లు జ‌రిగింది? అప్పుడే ఎన్నిక‌లా? అని ప్రశ్నిస్తే.. అవున‌నే చెప్పకతప్పదు. గ‌త ఏడాది డిసెంబ‌రులోనే అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ ముందస్తుగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఈ క్రమంలో అదికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ నేత‌లు చేయ‌ని సాహ‌సం లేదు. ఏకంగా వారు బ‌ద్ధ వైరిప‌క్షం టీడీపీతోనే చెలిమి చేశారు. అయితే, అనుకున్న విధంగా కాదుక‌దా.. ఊహించ‌ని విధంగా చావు దెబ్బతిన్నారు. ఘోరాతి ఘోరంగా కాంగ్రెస్ నాయ‌కులు ప‌రాజ‌యం పాల‌య్యారు.అయితే ఇంత ఓట‌మిలోనూ.. చావుత‌ప్పి క‌న్ను లొట్టపోయిన‌ట్టుగా.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం హుజూర్ న‌గ‌ర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. 
టీ కాంగ్రెస్ లో హూజూరు నగర్ లొల్లి

క‌థ అక్కడితో అయిపోలేదు. ఆయ‌న ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన పార్లమెంటు ఎన్నిక‌ల్లోనూ పోటీ చేశారు. కాంగ్రెస్ కంచుకోట న‌ల్లగొండ నుంచి నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. దీంతో హుజూర్ న‌గ‌ర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో నిబంధ‌న‌ల మేర‌కు ఆరు మాసాల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీంతో ఈ స్థానంలో ఎవ‌రిని నిల‌బెట్టాల‌నే కార్యక్రమంపై కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో చ‌ర్చ సాగుతోంది.గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉత్తమ్ కేవ‌లం 7 వేల ఓట్లతో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై విజ‌యం సాధించారు. అప్పుడు రెండు పార్టీల మ‌ధ్య కేవ‌లం 4 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయితే నాలుగు నెల‌ల‌కే జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అక్కడ కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ వ‌చ్చింది. ఇక త్వర‌లో ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రావ‌డంతో ఒక‌ప‌క్క ఉత్తమ్ కుమార్ త‌న భార్యనే రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమె కోదాడ నుంచి పోటీ చేసి ప‌రాజయం పాల‌య్యారు.అయితే, ఈ ద‌ఫా హుజూర్ న‌గ‌ర్‌లో టికెట్ ఆమెకే కేటాయించి గెలిపించుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రోప‌క్క సీనియ‌ర్ నేత జానారెడ్డి వంటి వారు త‌మ ప్రయ‌త్నాల్లో తామున్నారు. ఇదిలావుంటే.. కాంగ్రెస్ కంచుకోట వంటి హుజూర్ న‌గర్‌లో కారు జోరు పెంచాల‌ని అధికార టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సిట్టింగ్ సీటును చేజిక్కించుకునేందుకు ప్రయ‌త్నిస్తోంది.కాంగ్రెస్ అభ్యర్థిని ప్రక‌టించాకే టీఆర్ఎస్ త‌న అభ్యర్థిని ప్రక‌టించాల‌ని చూస్తోంది. ఈ ఎన్నిక‌ను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే టైంలో ప్రతి ఉప ఎన్నిక‌లోనూ గెలుస్తూ వ‌స్తోన్న టీఆర్ఎస్ ఎలాగైనా ఉత్తమ్ కోట‌లో గెలిచి స‌త్తాచాటాల‌ని విశ్వప్రయ‌త్నాలు చేస్తోంది. ఇక త‌మ సిట్టింగ్ సీటు, అందునా పీసీసీ అధ్యక్షుడి సీటు కావ‌డంతో కాంగ్రెస్‌కు, ఉత్తమ్‌కు ఈ ఎన్నిక స‌వాల్‌గా మారింది. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నిక‌ల్లో ఓట్ల ప‌రంగా స‌త్తా చాటాల‌ని చూస్తోంది. కానీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీకి అంత ప‌ట్టులేదు. ఏదేమైనా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో తెలంగాణ పొలిటికల్ వాతావ‌ర‌ణం మ‌రోసారి వేడెక్కనుంది.

No comments:

Post a Comment