Breaking News

21/08/2019

మెదక్ లో

కోతులు పోయో...కొండముచ్చులు వచ్చే
మెదక్, ఆగస్టు 21, (way2newstv.in)
వానర మూకలు ఊర్లపై దండయాత్ర చేస్తున్నాయి. గ్రామస్తులను హడలెత్తిస్తున్నాయి. ఇండ్లలోకి చొరబడి చేతికందిన తినుబండారాలు, ఆహార పదార్థాలు ఎత్తుకు పోతున్నాయి. వీధులలో పిల్లలు, మహిళలూ ఏదైనా పట్టుకొని నడుస్తే అంతేసంగతులు.. దాడిచేసి, గాయపరిచి తమపని కానిచ్చేస్తున్నారు ఆ వానర వీరులు. కోతుల బెడద రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో విసిగిపోయిన గ్రామస్తులు, చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారు. కాని ఫలితం మాత్రం కనిపించలేదు. చివరగా గ్రామస్తులకు ఒక ఆలోచన తట్టింది దాంతో కోతుల బాద తీరింది.... ఇంతకీ ఏమిటా ఆలోచన తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.... రోజు రోజుకు అంతరించిపోతున్న అరణ్యాలు ఒకవైపు, వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఉన్న కాస్త అడవుల్లో చెట్లు కూడా మోడుబారాయి. 
 మెదక్ లో 

మూగజీవులకు అడవుల్లో త్రాగడానికి నీరు కూడా దొరికే పరిస్థితి లేదు. తినడానికి ఏమి దొరక్క వన్యప్రాణులు జనారణ్యంలో కి వచ్చి పడుతున్నాయి.  అడవుల్లో నుండి గుంపులు గుంపులుగా కోతులు సమీప గ్రామాల్లోకి వచ్చి బతికిబట్ట ప్రయత్నం చేస్తున్నాయి. గ్రామంలో దొరికింది తినడమో, దొరక్కపోతే దోచుకొని తినడమో చేస్తున్నాయి.సిద్దిపేట జిల్లా దుబ్బాక నగరపంచాయతిలోని చెల్లాపూర్ గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. గత కొన్ని రోజులుగా కోతులను వెళ్లగొట్టడానికి నానా ప్రయత్నాలు చేశారు. కాని ఫలితం లేకపోయింది. చివరగా కొండముచ్చులను తీసుకు వస్తే కోతులు పారిపోతాయని తెలుసుకున్న గ్రామస్తులు, కొండముచ్చులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకున్నారు. కృష్ణా జిల్లాలో  కొండముచ్చులు అమ్ముతారు అని తెలుసుకున్న గ్రామస్తుడు మల్లారెడ్డి 25000 రూపాయల సొంత డబ్బులు వెచ్చించి  కొండముచ్చులను తీసుకువచ్చారు. కొండముచ్చులను చూసిన కోతులు కాళ్లకు బుద్ధి చెప్పాయి. చేసేది ఏమీ లేక గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాయి కోతులు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.గ్రామంలోని పంటలు, పెరట్లో వేసుకున్నా మొక్కలు పాడుచేసి నష్టం చేసేవి అని కూరగాయల పంటలను కాపాడుకోవడానికి నానా కష్టాలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు ఆ గ్రామ రైతులు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. కొండముచ్చుల ఎంట్రీతో ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. కొండముచ్చులను చూసుకోవడానికి ఇద్దరిని నియమించారు. ఆ ఇద్దరికి ఆరువేల రూపాయల జీతంగా కూడా ఇవ్వడానికి ఇంటింటికి సంగమేశ్వర్ పంతులు సూచనల మేరకు చందాలు వేసుకుంటున్నారు. కొండముచ్చులకు అవసరమైన ఆహారానికి రోజు 200 నుండి ఇ 300 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు గ్రామస్తులు. కొండముచ్చులు రావడంతో ఇప్పటికే చాలా వరకు కోతులు ఊరు వదిలి వెళ్లిపోయాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.పిల్లలను బయటకు పంపించాలంటే భయపడే వాళ్ళమని, ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంచే వాళ్ళని అంటున్నారు ఆ గ్రామ మహిళలు. ఇప్పుడు కోతుల బెడద తప్పడంతో ధైర్యంగా ఉన్నామని అంటున్నారు. ఇంటి తలుపులు తీసి ఉంచితే ఇంట్లోకి వచ్చి ఉన్న కూరగాయలు, అన్నం తినేవని, బియ్యాన్ని కూడా తిని పారబోసేవని అన్నారు. కొండముచ్చులు తమ గ్రామ ప్రజల సమస్యను తీర్చాయని ఆనందం వ్యక్తం చేశారు. తమ పైన, తమ పిల్లల పైన దాడులు చేసి గాయపరిచాయని, రెండు నెలలకు పైగా చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వాటి నిర్వహణకు అవసరమైన ఖర్చులను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ముల్లు ముల్లుతోనే తీయాలన్న నానుడి మరొకసారి రుజువైంది. పొట్ట చేత పట్టుకొని తమ ఊరికి వచ్చిన కోతులను తరిమివేయడం బాధగానే ఉంది. కానీ వాటి బెడద తీవ్రం కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు. ఆ గ్రామ ప్రజలకి కొండముచ్చులు హీరోలా కనిపిస్తున్నాయి. కోతుల బెడద ఉన్న గ్రామాలకు కొండముచ్చులు తీసుకురావడమే పరిష్కారమని అంటున్నారు గ్రామస్తులు.

No comments:

Post a Comment