Breaking News

21/08/2019

యడ్డీకి మొదలైన అసమ్మతి

బెంగళూర్, ఆగస్టు 21, (way2newstv.com)
ఏ పార్టీ అసంతృప్తికి అతీతం కాదు. యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తొలిరోజునే భారతీయ జనతా పార్టీలో అసమ్మతి బయలుదేరినట్లు కనపడుతోంది. కేవలం 17మందినే మంత్రి వర్గం సభ్యులుగా యడ్యూరప్ప తీసుకున్నప్పటికీ తొలిదశలో తమకు దక్కలేదన్న అసంతృప్తి సీనియర్లలో ఉంది. దీంతో వారు ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు సీనియర్ నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ అధికారం చుట్టూనే తిరుగుతుంటాయి. కుమారస్వామి పధ్నాలుగు నెలల పాలన కూడా అసమ్మతితోనే గడిచింది. అసమ్మతి నేతలను బుజ్జగించడం, వారిని రిసార్టులకు తరలించడంతోనే కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎక్కువగా సమయం కేటాయించాల్సి వచ్చింది. 
యడ్డీకి మొదలైన అసమ్మతి

చివరకు ఆ అసమ్మతి నేతలే కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ఇప్పుడు తాజాగా గద్దెనెక్కిన యడ్యూరప్పకు కూడా సేమ్ సీన్ తొలిరోజే రిపీట్ అయింది.నిజానికి భారతీయ జనతా పార్టీ కొంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నేతలకే టిక్కెట్లను కేటాయిస్తారు. కానీ కర్ణాటకలో తీరు వేరు. అక్కడ యడ్యూరప్పదే ఇష్టారాజ్యం. ఆయనే పార్టీని బలోపేతం చేయడంతో నిన్న మొన్నటి వరకూ అధిష్టానం ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లోనూ మోదీ ఇమేజ్ తో పాటు యడ్యూరప్ప కష్టం ఫలితంగానే కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేసింది.అయితే ఈసారి కేంద్ర నాయకత్వం యడ్యూరప్పకు ఫ్రీహ్యాండ్ ఇవ్వలేదు. ఆయనను పక్కనపెట్టి ఆర్ఎస్ఎస్ నేత సంతోష్ సూచనలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో యడ్యూరప్పకు, పార్టీకి అండదండలుగా ఉండేవారికి మొదటి విస్తరణలో చోటు దక్కలేదు. ఉమేష్ కత్తి, మురుగేష్, బాలచంద్ర, బసవరాజ్ పాటిల్, రేణుకాచర్య వంటి వారికి మంత్రిపదవులు దక్కకపోవడంతో వారు ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. ఇప్పటికిప్పుడు యడ్యూరప్ప ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏమీ లేకున్నా బీజేపీలో అసమ్మతి రాగం అందుకుందన్నది మాత్రం వాస్తవం.

No comments:

Post a Comment