Breaking News

10/08/2019

బాలారిష్టాలు దాటని రిమ్స్

అదిలాబాద్, ఆగస్టు 10, (way2newstv.in):
రిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు నిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఏజెన్సీ మరణాలు, ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ను 2008 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. రిమ్స్‌ వైద్య కళాశాలకు గుర్తింపు వస్తుందో లేదోనని మెడికోలు అయోమయంలో పడ్డారు. ఇటీవల ఎంసీఐ బృందం పర్యటించినప్పుడు విద్యార్థులను బోధనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ రిమ్స్‌కు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు నిరాకరిస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. వారి శిక్షణకు కూడా అడ్డంకులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
బాలారిష్టాలు దాటని రిమ్స్

ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేస్తే తమకు నాణ్యమైన విద్యతో పాటు కళాశాలకు గుర్తింపు లభిస్తుందని, రిమ్స్‌ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని కోరుతున్నారుప్రతిసారి ఎంసీఐ బృందం రిమ్స్‌ను తనిఖీ చేసినప్పుడు ఏవిధంగా గట్టెక్కిద్దామనే ఆలోచనే తప్పా సమస్యను పూర్తిగా ఎలా పరిష్కరిద్దామనేది అధికారులకు అంతుచిక్కడంలేదు. అద్దె వైద్యులు, పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను బృందం తనిఖీ సమయంలో చూపించి చేదులు దులిపేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంసీఐ బృందం 10 శాతం ఖాళీలు ఉంటే రెన్యువల్‌ చేయడం నిరాకరించకుండా అనుమతులను జారీ చేస్తోంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ పరిస్థితిని చూస్తే ప్రస్తుతం 18 శాతం ఖాళీగా ఉన్నాయి. రిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో బోధించేందుకు ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండడం, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవనే ఆలోచనతోనే ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదని సమాచారం. వేతనాలు పెంచినా సరైన మౌళిక వసతులు కల్పించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఖాళీల కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రొఫెసర్ల వేతనాలను పెంచుతూ జీఓ నెం.482 ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో బోధకుల నియామక ప్రక్రియ జరగనుంది. ఈసారైనా బోధకులు వస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఖాళీలు భర్తీ అయితే మెడికోలకు లబ్ధి చేకూరడంతోపాటు రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయి.  రిమ్స్‌లో వైద్య సేవలను పక్కనబెడితే భావి వైద్యులైన మెడికోలకు నాణ్యమైన విద్య అందడం లేదనే చెప్పుకోవచ్చు. బోధనకు సంబంధించి 150 పోస్టులకు గాను 90 మంది బోధన సిబ్బంది పనిచేస్తుండగా, 60 ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో మెడికోలకు సరైన రీతిలో బోధన సాగడం లేదని తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల కోర్సు కాగా ఒక సంవత్సరం శిక్షణ వైద్యులుగా అనుభవంతో వైద్య వృత్తిలో కొనసాగనున్నారు. 16 ప్రొఫెసర్‌ పోస్టులు, 10 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 15 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 19 ట్యూటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు కీలకమైన రిమ్స్‌ డైరెక్టర్‌ పోస్టు ఇన్‌చార్జీతోనే కొనసాగుతోంది. రిమ్స్‌ ఆస్పత్రి సూపరింటెండెంటే డైరెక్టర్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మొదటి నుంచీ సమస్యల నడుమే వైద్య శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. కాగా మొదటి నుంచి రిమ్స్‌ సిబ్బంది కొరతతో సతమతం అవుతుంది. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల మెడికోలు వైద్య శిక్షణను పూర్తి చేసుకొని బయటకు వెళ్లారు. గతేడాది సూపర్‌ స్పెషాలిటీ కోసం కూడా కేంద్రం కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తాజాగా రిమ్స్‌ వైద్య కళాశాలను రెన్యువల్‌ సమస్య వెంటాడుతోంది. మరోసారి రిమ్స్‌ను ఆ బృందం ఈ నెలాఖరులో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆలోగా రిమ్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటే గుర్తింపును కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. లేనిపక్షంలో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే క్రమంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.2008 సంవత్సరంలో ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు బోధన విషయమే ప్రధాన సమస్యగా ఉంది. ఎంసీఐ బృందం మొదటి నాలుగు సంవత్సరాలు తనిఖీలు చేసింది. పలుసార్లు కూడా రెన్యువల్‌ సమస్యనే ఉంది. ఎలాగో నెట్టుకుంటూ నాలుగు బ్యాచ్‌ల తర్వాత గుర్తింపు లభించింది. ఎంసీఐ బృందం తనిఖీ చేసే సమయంలో పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులను ఇక్కడ పనిచేస్తున్నట్లు చూపించి గట్టెక్కించారు. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల విద్యార్థులు ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్‌ ఉండడంతో ప్రతిసారి సమస్యే ఉత్పన్నమవుతోంది.ప్రస్తుతం బోధిస్తున్న వారిలో కూడా రెగ్యులర్‌ లేకపోవడం గమనార్హం. ఈ కళాశాలలో సీటు సాధించిన విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో విద్యాబోధన జరగకపోవడంతో భవిష్యత్తులో చేసే వైద్య వృత్తిలో పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాగా రిమ్స్‌కు వచ్చే రోగులకు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. చిన్నపాటి వైద్య చికిత్సలు చేస్తూ మెరుగైన వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు రెఫర్‌ చేయడం పరిపాటిగా మారుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. గత నాలుగైదు నెలల క్రితం జిల్లా అటవీ శాఖాధికారి గుండెపోటుతో రిమ్స్‌లో చేరగా, వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, సరైన వైద్యం అందకపోవడంతో తుదిశ్వాస వదిలారు. ఇలాంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. రాత్రి వేళల్లో జూనియర్‌ వైద్యులతోనే సేవలు అందిస్తున్నారు. దీంతో వారికి అనుభవం లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment