Breaking News

24/07/2019

ఏపీకి రుణాలను అడ్డుకుంటున్న ప్రధాని

మొన్న ప్రపంచ బ్యాంక్.. నిన్న ఏఐఐబీ
విజయవాడ, జూలై 24, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత దారుణంగా దెబ్బతినిపోయింది. చెప్పుకోవడానికి విశాఖ తప్ప పెద్ద నగరం ఒకటీలేదు, ఇక రాజధాని అని అనుకోవడమే కానీ అమరావతికి రూపూ, రేఖా ఎక్కడా లేవు. పెద్ద నగరాలు ఉంటే ఆదాయ వనరులు రాష్ట్ర ఖజానాకు ఎక్కువగా సమకూరతాయి. హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికిపుడు అంతటి నగరాన్ని నిర్మించుకోవడం అంటే అద్భుతమే. అది జరిగే పని కూడా కాదు. కనీసం మంచి రాజధాని ఒకటి కట్టుకుని ధీమాగా ఉండాలన్నా కుదిరే పరిస్థితి లేదు. 16 వేల కోట్ల రెవిన్యూ లోటుతో, 90 వేల కోట్ల అప్పుతో విడిపోయిన నవ్యాంధ్రకు కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా సాయం చేస్తేనే తప్ప సాధారణ స్థితికి రాలేదన్నది నిజం. మరి కేంద్రం వైఖరి ఈ విషయంలో ఎలా ఉంది అంటే అందరికీ చూసినట్లే ఏపీని చూస్తున్నాం అంటున్నారు. 
ఏపీకి రుణాలను అడ్డుకుంటున్న ప్రధాని

మిగిలిన రాష్ట్రాలకు విభజన గాయాలు లేవు. ఏపీకి కొత్త బాధలు పెట్టారు, అడ్డంగా విడదీసి అన్యాయం చేశారు. మరి దానికి నష్టపరిహారం అంటూ ఉండదా. ఇది సగటు పౌరుడి ఆవేదన అయితే, కేంద్రం వైఖరి మరింత దారుణంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.కేంద్రంలోకి మోడీ సర్కార్ ఏపీ రాజధాని అమరావతి కోసం ఇచ్చింది పెద్దగా లేదు. కేవలం పదిహేను వందల కోట్లను విడుదల చేసి అయిదేళ్ళలో చాలా చేశామని చెప్పుకుంటున్నారు. ప్రత్యేక హోదా హామీని తుంగలోకి తొక్కారు. విశాఖకు రైల్వే జోన్ అంటూ ఆరు నెలల క్రితం అదీ ఎన్నికల వేళ ప్రకటించినా ఇప్పటికి దాని గురించి అతీ గతీ లేదు. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి లేదు, జాతీయ విద్యా సంస్థలు అన్నీ కాగితాల మీదనే తప్ప వాటికి నిధులు మంజూరు చేసిన వైనమూ లేదు. ఈ నేపధ్యంలో ప్రపంచ బ్యాంక్ నుంచి రాజధాని మౌలిక సదుపాయాల కోసం 4,500 కోట్ల రూపాయల రుణ సాయాన్ని నాటి బాబు సర్కార్ కోరింది. అది ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ కూడా ఒకే అంది. తాజాగా ఈ ప్రతిపాదన నుంచి తప్పుకుంటున్నట్లుగా తన వెబ్ సైట్లో వరల్డ్ బ్యాంక్ పెట్టింది. ఎందుకిలా అని అంతా అనుకుంటున్న సమయంలో కేంద్రం వద్దనడం వల్లనే తాము రుణ సాయం చేయలేకపోతున్నామని చావు కబురు చల్లగా చెప్పింది. అంటే మోడీ సర్కార్ నో చెప్పిందన్న మాట.తెల్లారిలేస్తే ఏపీకి అంత చేశాం, ఇంత చేశాం అని చెప్పుకుని జనంలో తిరుగుతున్న బీజేపీ నాయకులు వరల్డ్ బ్యాంక్ రుణానికి మోడీ సర్కార్ ఎందుకు మోకాలడ్డిందో చెప్తే బాగుంటుందని ఏపీలోని మేధావులు అంటున్నారు. అమరావతికి కేంద్ర సాయమే చాలా తక్కువ. దానికి తోడు ఇతర మార్గాల ద్వారా రుణ సదుపాయం పొందాలనుకున్నా బ్రేకులు వేయడమేంటన్న బాధ అందరిలోనూ కలుగుతోంది. దీనికి కేంద్రం సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకపోతే జనం దృష్టిలో దోషులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీలో హోదా ఇవ్వలేదన్న బాధ ప్రతీ ఆంధ్రుడి గుండేల్లో మంటగా ఉంది. మరి రాజకీయంగా ఎదుగుదామనుకుంటున్న చోట ఇన్ని రకాల విన్యాసాలు చేయడం వల్ల కలిగే లాభం ఏంటో బీజేపీ పెద్దలకే తెలియాలి అంటున్నారు.

No comments:

Post a Comment