Breaking News

15/07/2019

జాతీయ రాజకీయాల్లో అధర్ రంజన్ చౌదరి

న్యూఢిల్లీ, జూలై 15, (way2newstv.in)
అధర్ రంజన్ చౌదరి….. ఢిల్లీ రాజకీయాల్లో ఆయన ఎవరో ఎవరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. ఆ మాటకు వస్తే సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో కూడా పెద్దగా తెలియదు. తాజాగా ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా ఎన్నికవ్వడంతో ఆయన పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత చూపడంతో రంజన్ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ లోని దిగ్గజ నాయకులను కాదని కీలకమైన ప్రతిపక్ష నేత పదవికి పార్టీ ఆయనను ఎంపిక చేసిందంటే రంజన్ చౌదరి ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. హిందీ, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడే శశిధరూర్, మనీష్ తివారీ వంటి సీనియర్లను కాదని పార్టీ రంజన్ చౌదరి వైపు మొగ్గు చూపడం విశేషం. శశిధరూర్, మనీష్ తివారీలో గతంలో కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు. 
జాతీయ రాజకీయాల్లో అధర్ రంజన్ చౌదరి

పోరాట పటిమ గల నాయకుడిగా పేరొందడం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన, పట్టున్న నాయకుడు కావడం రంజన్ చౌదరికి కలసి వచ్చింది.ప్రతిపక్ష నేత పదవి ఆషామాషీ కాదు. ఆయనకు కేబినెట్ హోదా ఉంటుంది. లోక్ సభలో ప్రధాని తర్వాత అందరి దృష్టి ఆయనపై ఉంటుంది. సభలో జరిగే చర్చల్లో, ప్రసంగాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలకు అవకాశం ఉంటుంది. తగినంత సంఖ్యాబలం లేనందున రంజన్ చౌదరిని ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి ప్రభుత్వం విముఖంగా ఉన్నప్పటికీ, సభలో రెండో అతి పెద్ద పార్టీ నేతగా ఆయన ప్రాధాన్యం అనన్యం. వివిధ కమిటీల్లో సభ్యత్వం ఉంటుంది. సీబీఐ డైరెక్టర్, సీవీసీ నియామకం, సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో ఆయన పాత్ర ఉంటుంది. సాధారణంగా ప్రతిపక్ష నేతను భవిష్యత్ ప్రధానిగా అభివర్ణిస్తుంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష పార్టీ అయిదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తే ప్రధాని పదవికి గట్టి పోటీదారుల్లో ఒకరిగా ఉంటారు. అందువల్ల వచ్చే అయిదేళ్ల రంజన్ చౌదరికి మంచి అవకాశం. సమర్థతతో వెలుగులోకి రావడానికి అవకాశాలు ఉంటాయి.క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన అధీర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ లో ప్రణబ్ ముఖర్జీ, ప్రియరంజన్ దాస్ మున్షీ తర్వాత సీనియర్ నేత. కాంగ్రెస్ నుంచి మమత బెనర్జీ విడిపోయి సొంత పార్టీ స్థాపించి నప్పుడు పార్టీ శ్రేణులు చాలా వరకూ ఆమె వెంట నడిచాయి. అయినప్పటికీ అధీర్ రంజన్ చౌదరి హస్తం పార్టీని వీడలేదు. రాష్ట్రంలోని బెర్హంపూర్ లోక్ సభ స్థానం నుంచి వరసగా ఐదుసార్లు ఎన్నికవుతూ వస్తున్నారు. 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తొలిసారి 1999లో బెర్హంపూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వాత వెనక్కి తిరిగే పరిస్థితులు ఎదురుకాలేదు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున ఇద్దరే ఎన్నికయ్యారు. వారిలో ఒకరు అధీర్ రంజన్ చౌదరి. అధీర్ రంజన్ చౌదరి నాలుగేళ్ల పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ సారథిగా వ్యవహరించారు. రాజకీయాల్లో ఆయన దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరుంది. ముర్హీదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ నుంచి వరుసగా ఐదు సార్లు ఎన్నిక కావడానికి ఆ దూకూడే కారణం.అధీర్ రంజన్ చౌదరి పెద్దగా చదువు కోలేదు. ఆయన చదువు మెట్రిక్యులేషన్ లోపే. అయినప్పటికీ హిందీ, ఇంగ్లీష్ పై మంచి పట్టుంది. అనర్గళంగా ప్రసంగించగలరు. 2012లో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేయడం ఒక్కటే అధికార అనుభవం. కాంగ్రెస్ ఎంపీల్లో కేరళ నుంచి ఏడుసార్లు ఎన్నికైన కొడిక్కోలన్ సురేష్ ఒక్కరే అధీర్ రంజన్ చౌదరి కన్నా సీనియర్. క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్న అధీర్ రంజన్ చౌదరి నేర చరిత పుష్కలంగా ఉంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన ప్రమాణపత్రం ప్రకారం ఆయనపై మొత్తం ఏడు కేసులున్నాయి. ఇందులో రెండు హత్య కేసులు కావడం గమనార్హం. అయితే ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులేనని, చట్టం ముందు అవి నిలబడవని కాంగ్రెస్ శ్రేణులు వాదిస్తున్నాయి. 63 ఏళ్ల అధీర్ రంజన్ చౌదరి కు జాతీయ రాజకీయాల్లో ఎదగడానికి మంచి అవకాశం. పార్టీలో పట్టు పెంచుకునేందుకు కూడా ఈ హోదా ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేతగా నిత్యం వార్తల్లో ఉంటారు. పదునైన ప్రసంగాలు, విమర్శలతో అధికార పార్టీని అడ్డుకోవచ్చు. మొత్తానికి జాతీయ రాజకీయాల్లో రావడం ఆయనకు అరుదైన అవకాశం.

No comments:

Post a Comment