Breaking News

31/07/2019

ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ బియ్యం నిలువలు

హైద్రాబాద్, జూలై 31, (way2newstv.in -Swamy Naidu)
తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లుల నుంచి పౌరసరఫరాల శాఖ సేకరించే బియ్యాన్ని నిలువ చేసేందుకు అవసరమైన గోదాములు రాష్ట్రంలో లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా నేరుగా ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ, భారత ఆహార సంస్థ, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరింది. పౌరసరఫరాల శాఖ రైస్‌మిల్లుల నుండి సేకరించే బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి, నిలువ చేసేందుకు అంగీకారం కుదిరింది.
ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ బియ్యం నిలువలు

ఒప్పందంలో భాగంగా  ప్రయోగాత్మకంగా సంగారెడ్డి జిల్లా నుండి ఒక రేక్  లో 2,500 టన్నుల బాయిల్డ్ రైస్‌ను కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా బియ్యం నిలువలకు అవసరమైన గోదాములను కేటాయించాలని పౌరసరఫరాల శాఖ అనేక పర్యాయాలు ఎఫ్‌సీఐని కోరింది. బాయిల్డ్‌రైస్‌కు సంబంధించి గోదాముల్లో నిలువ చేసేందుకు సరైన స్థలం లేపోవడంతో పౌరసరఫరాల శాఖ ఇక్కట్లను ఎదుర్కొంటోంది. 2018-19 బియ్యం సేకరణ సంవత్సరంలో 77 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. మిల్లింగ్ తర్వాత బియ్యం అందించేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ పౌరసరఫరాల శాఖ వెనుకడుగు వేయాల్సి వస్తోంది. దాంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మిల్లింగ్ కాగానే బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలని అకున్ సబర్వాల్ నిర్ణయించారు.

No comments:

Post a Comment