Breaking News

31/07/2019

నో డివిజన్...నో జోన్

విశాఖపట్టణం, జూలై 31, (way2newstv.in - Swamy Naidu)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి రెండు మాసాలు పూర్తయినా, ఆరు మాసాల కిందటే కొత్త రైల్వేజోన్‌ను ప్రకటించినా, రెండో ఓఎస్డీ వచ్చినా ఇంతవరకు జోన్‌కు సంబంధించి ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. కనీసం రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి స్థల సేకరణే జరగలేదు. నగరంలోని సాగరతీరంలో రుషికొండ బీచ్ ప్రాంతం, కొమ్మాది, మర్రిపాలెం, మార్షలింగ్ యార్డ్, సింహాచలం నార్త్‌కేబిన్ వంటి విశాలమైన రైల్వే స్థలాలను పరిశీలించినట్టు ప్రచారమైతే జరిగింది. డివిజన్‌లో నిధులు పుష్కలంగా ఉన్నా, రాయగడ కొత్త డివిజన్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నా జోన్ కార్యాలయం నిర్మాణంపై ఎందుకు నిర్లక్ష్యం వెంటాడుతుందో తెలియడంలేదని రైల్వేవర్గాలు చెబుతున్నాయిఘన చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ ఇప్పుడు లేకుండా పోయింది. రైల్వే కార్మికవర్గం ఉద్యమస్ఫూర్తి కనబరచి సాధించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. వీరు తీసుకునే నిర్ణయంపైన, భవిష్యత్ కార్యాచరణ సాధ్యపడనుంది. ఇదిలా ఉండగా దక్షిణకోస్తా పేరిట విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన కొత్త రైల్వేజోన్‌కు సంబంధించి ఎటువంటి పురోగతీ లేదు.
నో డివిజన్...నో జోన్

ప్రధానమైన ఈ రెండు సమస్యలూ తీరాలంటే కచ్చితంగా రాజకీయశక్తితోనే సాధ్యమంటూ ఉత్తరాంధ్రవాసుల వాదన. చివరకు నిపుణులూ ఇదే మాట అంటున్నారు. విభజన హామీల్లో ప్రధానమైన రైల్వేజోన్‌ను కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి డివిజన్ లేకుండా చేయడంపట్ల ఇప్పటికే తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆరు మాసాలుగా ఏదో ఒక రూపంలో ఆందోళనలు, నిరసనలు, సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా ఈ పోరాటం చాలదని, కేంద్రం, రైల్వేబోర్డుపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తే తప్ప వాల్తేర్ డివిజన్‌ను కాపాడుకోలేమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనికి సాహసించే ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీ నాయకులు లేకపోవడంతో సమస్య పరిష్కారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రస్థాయిలో ఉద్యమించిన సమైక్యాంధ్ర సమితి ముక్కలైన సందర్భాలను ఈ సందర్భంగా కార్మికవర్గం గుర్తుకు తెచ్చుకుంటోంది. ఒడిశా ఆధిపత్య పోరుతో దశాబ్దాల తరబడి నలిగిపోయిన వాల్తేర్ డివిజన్ ఏనాడూ ఒక్క సమస్యనూ పరిష్కరించుకోలేకపోయింది. అటువంటిది ఇపుడు చేతులారా పోగొట్టుకున్న తరువాత వాల్తేర్ డివిజన్‌ను ఏ విధంగా కాపాడుకుంటారంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చట్టసభల్లో ఎవరూ పోగొట్టుకున్న డివిజన్ గురించి నోరు మెదపడం లేదని, అలాగే డివిజన్ పరిధిలో ఎక్కడా ఆందోళనలు, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, నిరసనలు, పోరాటాలు చేపట్టనే లేదని, అటువంటపుడు కేంద్రానికి దీని తీవ్రత ఏ విధంగా చేరుతుందనే ప్రశ్నలు ఉత్పత్తనమవుతున్నాయి. ఏకంగా వాల్తేర్ డివిజన్ పరిధిలో ముఖ్యమైన 12 విభాగాలకు సంబంధించి దాదాపు 20 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో సిగ్నలింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఆపరేటింగ్, కమర్షియల్, మెకానికల్, ఇంజనీరింగ్, కనస్ట్రక్షన్, మెడికల్, సేఫ్టీ, రన్నింగ్, పరిపాలనా విభాగాలకు సంబంధించి 500 మంది వరకు అధికారులుండగా, గ్యాంగ్‌మెన్, కీమెన్లు, ఈ లోకోపైలెట్లు (డ్రైవర్లు), టీటీఇలు, గార్డులు, వైద్యులు, నర్సులు, ఆర్టీఎఫ్, జీఆర్‌పీ, మెకానిక్‌లు, వెల్డర్లు, క్షేత్రస్థాయి నుంచి 18 వేల మందికి పైగానే డివిజన్‌లో వివిధ బ్రాంచీల్లో పని చేస్తున్నారు. ఇక నుంచి విజయవాడ డివిజన్ కేంద్రంగానే వీరంతా పనిచేయాల్సి ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి డివిజన్ అధికారులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. సెలవు పెట్టాలన్నా, ఫీఎఫ్ పనుల కోసం, సిక్ లీవ్ కావాలన్నా, పదోన్నతులు, బదిలీలు, మెడికల్ వంటి అవసరాల నిమిత్తం ప్రతీ చిన్న పనికీ విజయవాడ వెళ్ళి రావాల్సిందే. దీని కంటే ఒడిశా ఆధిపత్య పోరులోనే పనిచేయడం నయమని డివిజన్ కార్మికవర్గం చెబుతోంది. ఉద్యమం ద్వారా డివిజన్‌ను కాపాడుకోవడం ఒక్కటే మార్గంగా రైల్వేవర్గం భావిస్తోంది. అయితే దీనికి అన్నివర్గాల ప్రజల మద్దతు అవసరమని, అపుడే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళగలమనే వాదన వినిపిస్తోంది.మరెక్కడాలేని వౌళిక వసతులు, సొంత స్థలాలు ఈ డివిజన్‌లో ఉన్నాయి. ప్రత్యేకించి సమకూర్చుకోవాల్సిన, భారీగా వెచ్చించాల్సిన పరిస్థితులు లేవని అధికారులే స్పష్టం చేస్తున్నారు. అయినా ఎందుకు వివక్ష చూపుతున్నారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment