Breaking News

10/07/2019

11 అంశాలపై చట్ట సవరణలు

విజయవాడ, జూలై 9, (way2newstv.in)
సాగునీటి ప్రాజెక్టుల్లో రీటెండరింగ్‌, జ్యుడీషియల్ కమిషనర్ ఏర్పాటు, స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, ఇలా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటోన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి వాటి అమలులో ఎదురవుతోన్న అడ్డంకుల్ని అధిగమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే దాదాపు 11 కీలక చట్టాలకు సవరణలకు జగన్ సర్కార్‌ సిద్ధమవుతోంది. అలాగే ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయని సాహసం చేయబోతోందిబడ్జెట్‌ సమావేశాల్లోనే కీలక బిల్లులను చట్టంగా మార్చేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే పలు చట్ట సవరణలను సభ ముందుకు తీసుకురానుంది. సుమారు 11 సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
11 అంశాలపై చట్ట సవరణలు 

తెలంగాణ తరహాలో లోకాయుక్తకు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని నియమించేలా చట్ట సవరణ చేయనున్నారు. అలాగే విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సుల అమలుకు చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక జ్యుడీషియల్‌ కమిషన్ నియామకం కోసం ఏపీ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ ఎనేబిలింగ్‌ యాక్ట్ 2001కి చట్ట సవరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పన, ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో సమీక్ష కోసం జ్యుడీషియల్ కమిషన్‌‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కమిషన్ ఏర్పాటుకు కూడా చట్ట సవరణ అవసరంకానుంది. ఇక స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటు చేయనున్న కమిషన్ల బిల్లులను కూడా ప్రభుత్వం సభ ముందు పెట్టనుంది. అత్యంత కీలకమైన వైద్యారోగ్యశాఖల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టుల కిందకి తెచ్చేందుకు చట్ట సవరణ చేయనుంది. అలాగే మరో కీలకమై చట్ట సవరణకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌, అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసేలా హిందూ ధార్మిక చట్టానికి సవరణలు చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రెవెన్యూ, కార్మికశాఖల్లో రెండు చట్ట సవరణలకు కసరత్తు జరుగుతోంది. అయితే ప్రభుత్వం మారినప్పుడల్లా తమకు అనుకూలంగా చట్ట సవరణలు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక బిల్లులకు సవరణలు చేయగా, ఇప్పుడు అదే దారిలో వైసీపీ ప్రభుత్వం వెళ్తోందని అంటున్నారు.

No comments:

Post a Comment