Breaking News

26/06/2019

పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు


హాజరుకాని కాపు నేతలు 
విజయవాడ, జూన్ 27, (way2newstv.in)
విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు.. వచ్చీరాగానే సమీక్షలు మొదలు పెట్టారు. తాజా రాజకీయపరిణామాలపై అందుబాటులో ఉన్న నేతలతో చర్చిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలోప్రజావేదిక కూల్చివేత, ఎంపీలు బీజేపీలో చేరడంతో పాటూ పలు కీలక అంశాలపై నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా చంద్రబాబు నివాసంపై చర్చ జరిగిందట. తాను నివాసం ఉంటున్న భవనం కూల్చివేత పరిస్థితి వస్తే ఏం చేయాలనే అంశంపై నేతలతో చర్చించారట. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు దూరంగా ఉన్నారట. చంద్రబాబు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం ఏర్పాటు చేసినా.. పొరుగునే ఉన్న విజయవాడలో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ భేటీకి దూరంగా ఉన్నారు. 

పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు

అలాగే ముఖ్య నేతలైన తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, పంచకర్ల రమేష్‌బాబు వంటి వారు కూడా సమావేశానికి రాలేదు. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో పాటూ మరికొందరు సీనియర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. కాపు నేతలు ఈ సమావేశానికి రాకపోవడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నేతలకు ఈ భేటీ గురించి సమాచారం లేకపోవడంతోనే వెళ్లలేదని చెబుతున్నారు. ఇదే అంశంపై సీనియర్ నేత వేదవ్యాస్ కూడా స్పందించారు. ముఖ్య నేతల సమావేశం కావడంతోనే తాను దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మిగిలిన నేతలు ఎందుకు వెళ్లలేదో తనకు తెలియదన్నారు. అయితే ఇక్కడ పక్కనే విజయవాడలో ఉన్న బోండా ఉమా సమావేశానికి వెళ్లకపోవడంపై చర్చ నడుస్తోంది. మంగళవారం రాత్రి చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. అధినేతకు స్వాగతం పలికేందుకు కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, గద్దే రామ్మోహన్, జవహర్, దేవినేని అవినాష్, బచ్చుల అర్జునుడు సహా పార్టీ నేతలంతా కలిసి వెళ్లారు. కానీ బోండా ఉమా మాత్రం అక్కడ కనిపించ లేదు. దీంతో ఉమా బుధవారం జరిగిన సమావేశానికి హాజరుకాకపోవడం ఆసక్తిరేపుతోంది. ఈ నెల 20న కాకినాడలో టీడీపీ కాపు నేతలు సమావేశం కావడం.. అదే రోజు నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంతో.. కాపు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ జరిగింది. కానీ తాము పార్టీ మారేది లేదని నేతలు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పడు బాబుతో భేటీకి నేతలు వెళ్లకపోవడంతో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. 

No comments:

Post a Comment