Breaking News

26/06/2019

కూలిన ప్రజా వేదిక


28 గంటల పాటు కొనసాగిన కూల్చివేత
పోలీసుల నిఘాలో కరకట్ట
తిరుమల, జూన్ 26, (way2newstv.in)
ప్రజావేదికను కూల్చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో... కూల్చివేత కార్యక్రమం రాత్రంతా కొనసాగింది. ఇప్పటికే దాదాపు భవనాన్ని నేలమట్టం చేశారు. ఈ ఉదయం వర్షం కురవడంతో, కూల్చివేత పనులకు స్వల్ప ఆటంకం కలిగింది. అనంతరం, కూల్చివేతను మళ్లీ కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఈ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించాలని తొలుత అనుకున్నప్పటికీ... ఊహించని విధంగా నిన్న రాత్రి నుంచే పనులు మొదలు పెట్టారు. మరోవైపు, ప్రజావేదికతో పాటు కరకట్ట ప్రాంతాన్ని మొత్తం భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు.ప్రజా వేదిక కూల్చివేత పనులు రెండవరోజు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచే కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు.. కృష్ణానది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

కూలిన ప్రజా వేదిక

మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు భవనంలోని ఫర్నిచర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. అనంతరం జేసీబీల సహాయంతో ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది. ప్రజావేదిక కూల్చివేతకు మొదటి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు అడ్డుకునే అవకాశం ఉండడంతో  ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 70 మంది సివిల్‌, మరో 70 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.తొలుత కరకట్టను పోలీసులు తమ అధీనంలోకి తీసుకోగా, ప్రజావేదికలోని సామాన్లను సీఆర్డీయే అధికారులు బయటకు తరలించారు. పూల కుండీలను నర్సరీకి, ఇతర సామగ్రిని సచివాలయానికి చేర్చారు. అనంతరం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న కూలీలు సమ్మెటలతో గోడలు పగలగొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత  3 జేసీబీలు, 6 టిప్పర్లను రంగంలోకి దిగాయి.  రాత్రి 11.15 గంటల సమయంలో ‘ప్రజా వేదిక’ ప్రధాన భవనం కూల్చివేత పనులు మొదలయ్యాయి.  భవనాన్ని కూల్చి వేస్తున్నారని తెలిసి రాజధానికి చెందిన కొందరు రైతులు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని పంపించేశారు.  

ప్రజావేదికలో కొత్త ట్విస్ట్
ఉండవల్లిలో ‘ప్రజావేదిక’ కూల్చివేత వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేతను ప్రభుత్వం ప్రారంభించగా, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంటికి వెళుతున్న రోడ్డుపై గొడవ మొదలయింది. సీఆర్డీఏ అధికారులు తమ పొలం నుంచి ప్రజావేదిక, చంద్రబాబు నివాసం వరకూ రోడ్డు వేశారని రైతులు ప్రకాశ్, సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం తమ భూములను తీసుకున్న అధికారులు ఇప్పటివరకూ నష్టపరిహారం చెల్లించలేదని వాపోయారు.చంద్రబాబు పదవీకాలం అయిపోయాక ఈ రోడ్డు కోసం ఇచ్చిన భూమిని తాము తిరిగి పొలంలో కలుపుకునేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. దీనికి ఆర్డీవో భాస్కరనాయుడు, ఎమ్మార్వో వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి ఒప్పందంపై సంతకం పెట్టారనీ, దాని కాపీలను జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్, ఉండవల్లి సీఆర్డీఏ కలెక్టర్, తనకు తలో కాపీ ఇచ్చారని స్పష్టం చేశారు. తాజాగా ప్రభుత్వం మారింది కనుక.. ఇప్పుడు తమ స్థలాన్ని తమకు వెనక్కు ఇచ్చేయాలని కోరారు.తమ భూమిని పూలింగ్ కు ఇవ్వాలని తొలుత కోరారనీ,  ఇందుకు తాము అంగీకరించకుండా రోడ్డుకు స్థలం ఇచ్చామని చెప్పారు. తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారనీ, ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ గొడవ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వెళ్లే రోడ్డును కూడా తొలగించే అవకాశముందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజావేదిక, చంద్రబాబు నివాసానికి వెళుతున్నది ఒకే రోడ్డు కాబట్టి, అక్రమ కట్టడం సాకుగా రోడ్డును తవ్వేసే అవకాశముందని భావిస్తున్నాయి.
పిల్ ను కొట్టేసిన కోర్టు
చంద్రబాబు ఇంటిని ఆనుకుని కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రజావేదికను అధికారులు కూల్చివేస్తుంటే మరోవైపు దానిని తక్షణం ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి.శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంగళవారం అర్ధ రాత్రి 2:30 గంటలు దాటిన తర్వాత కూడా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు కొనసాగాయి. పిల్ విచారణ చేపట్టిన జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లు అడ్వకేట్ జనరల్ శ్రీరాం, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డిల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు నిరాకరిస్తూ కేసును రెండు వారాలు వాయిదా వేసింది.

No comments:

Post a Comment